
పెళ్లిలో వరుడి ఉత్తరీయాన్ని వధువు చీర కొంగు చివర అంచును కలిపి ముడి వేస్తారు. దానిలో ఏమైనా విశేషార్థం ఉందా?
– సంకా పవన్ కుమార్, హైదరాబాద్
మనకు వివాహంలో తలంబ్రాల అనంతరం జరిగే ప్రక్రియ బ్రహ్మముడి. ఈ బ్రహ్మముడి వేసేటప్పుడు వరుడి ఉత్తరీయాన్ని వధువు చీర కొంగు చివర అంచును కలిపి ముడి వేస్తారు. వారి బంధాన్ని పటిష్ఠపరిచే చర్య ఇది. ఇప్పటికీ ఏదైనా విడదీయరాని బంధం ఏర్పడితే బ్రహ్మముడి పడిందిరా అని అంటూ ఉంటారు. దీనినే బ్రహ్మగ్రంథి, కొంగులు ముడివెయ్యడం అని కూడా అంటారు.
ఇద్దర్ని కలిపి కొత్త వ్యక్తిని సృష్టించడం. రెండు శరీరాలు, రెండు మనస్సులు ఏకమవ్వడమన్నది ఇక్కడ పరమార్థం. ఇది కేవలం రెండు వస్త్రాలని కలపటం కాదు. ఇంటి ఇల్లాలిగా అన్నీ తీర్చిదిద్దడానికి నా ఇంటికి రా. ఒక యజమానురాలిగా గృహస్థ ధర్మాన్ని నిర్వహించు అని అర్థం.
ఇద్దరు వ్యక్తులను కలిపి కొంగొత్త ఆకారాన్ని సృష్టించడమే దీని లక్ష్యం. నీది అని ఏమీ లేదు. ఎవరు సంపాదించినా దాని మీద అధికారం ఇద్దరికీ ఉంటుంది. ఆదాయం, ఖర్చు, ప్రణాళిక కలిపి ఉమ్మడిగా చెయ్యవలసిన పనులని భావం.
(చదవండి: ఉగ్ర తాండవం..అనిర్వచనీయం..)