
న్యూఢిల్లీ: ప్రేమించడం నేరం ఎలా అవుతుందని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ముస్లిం బాలికల కనీస పెళ్లి వయసుకు సంబంధించిన వ్యవహారంలో బాలల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్(ఎన్‌సీపీసీఆర్) దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం మంగళవారం తోసిపుచ్చింది. పంజాబ్‌లో 21 ఏళ్ల ముస్లిం యువకుడు, 16 ఏళ్ల ముస్లిం బాలిక ప్రేమ వివాహం చేసుకున్నారు.
ముస్లిం పర్సనల్ లా ప్రకారం ఆ వివాహం చెల్లుతుందని పంజాబ్ అండ్ హరియాణా హైకోర్టు ఉత్తర్వు జారీ చేసింది. రజస్వల అయిన తర్వాత లేదా 15 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత ముస్లిం బాలిక పెళ్లి చేసుకోవచ్చని వెల్లడించింది. దీన్ని సవాల్ చేస్తూ ఎన్‌సీపీసీఆర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు ఉత్తర్వును వ్యతిరేకిస్తూ జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) సైతం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.బి.నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. బాలిక, యువకుడి మధ్య అంగీకారంతోనే పెళ్లి జరిగిందని గుర్తుచేసింది. సమాజంలోని వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటున్నామని తెలిపింది. బాలబాలికలు ఒకచోట కలిసి చదువుకుంటున్నప్పుడు వారి మధ్య ఆకర్షణ ఏర్పడడం సహజమేనని పేర్కొంది. వారి మధ్య ప్రేమను నేరంగా పరిగణించడం సరైంది కాదని తేల్చిచెప్పింది. ఎన్‌సీడబ్ల్యూ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.