
కర్పూరీ ఠాకూర్ గౌరవాన్ని దొంగిలించడానికి కుట్రలు
బిహార్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
రూ. 62,000 కోట్ల విలువైన యువత కేంద్రీకృత కార్యక్రమాలు ప్రారంభం
రూ. 60,000 కోట్లతో అమలు చేసే ‘పీఎం–సేతు’ పథకానికి శ్రీకారం
బిహార్‌కు సంబంధించిన పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభం
న్యూఢిల్లీ: విజ్ఞానం, నైపుణ్యాలకు మన దేశంలో లోటు లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంచేశారు. మేధో సంపత్తి మన విలువైన ఆస్తి అని ఉద్ఘాటించారు. విజ్ఞానం, నైపుణ్యాలను దేశ ప్రగతికి ఉపయోగించుకోవాలని చెప్పారు. 21వ శతాబ్దంలో స్థానిక నైపుణ్యాలు, వనరులు, ప్రతిభ, విజ్ఞానానికి డిమాండ్ నానాటికీ పెరుగుతోందని అన్నారు.
శనివారం రూ.62,000 కోట్లకుపైగా విలువైన యువత కేంద్రీకృత కార్యక్రమాలను ప్రధాని మోదీ ఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న బిహార్‌కు అనుసంధానమైన పథకాలు ఇందులో ఉన్నాయి. అలాగే రూ.60,000 కోట్లతో అమలు చేసే కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత ‘పీఎం–సేతు’ పథకానికి శ్రీకారం చుట్టారు. బిహార్ రాష్ట్రానికి సంబంధించిన మరికొన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 1,000 ప్రభుత్వ ఐటీఐలను హబ్ అండ్ స్పోక్ మోడల్‌గా అభివృద్ధి చేయబోతున్నారు. బిహార్‌లో జన నాయక్ కర్పూరీ ఠాకూర్ స్కిల్ యూనివర్సిటీని సైతం మోదీ ప్రారంభించారు.
బిహార్‌లో రా్రïÙ్టయ జనతాదళ్(ఆర్జేడీ) ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యావ్యవస్థ దిగజారిందని, వలసలు పెరిగిపోయాయని మండిపడ్డారు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మెరుగుపడిందని, రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని ప్రశంసించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాం«దీని ఆ పార్టీ కార్యకర్తలు ‘జన నాయక్’ అని పిలుస్తుండడాన్ని ప్రధానమంత్రి తప్పుపట్టారు. ఓబీసీ నేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్ మాత్రమే ‘జన నాయక్’ అని తేల్చిచెప్పారు. ఆ గౌరవాన్ని దొంగిలించే కుట్రలు జరుగుతున్నాయని, దీనిపై అప్రమత్తంగా ఉండాలని బిహార్ ప్రజలకు పిలుపునిచ్చారు. అందరూ జన నాయకులు కాలేరని రాహుల్‌ను ఎద్దేవా చేశారు.
ఐటీఐలపై ప్రత్యేక దృష్టి
‘‘పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లు పారిశ్రామిక విద్యకు అత్యంత కీలకం. ఇవి ఆత్మనిర్భర్ భారత్‌కు వర్క్‌షాప్‌లుగా పని చేస్తున్నాయి. ఐటీఐల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. 2014 వరకు దేశంలో 10,000 ఐటీఐలు ఉండేవి. ఇప్పుడు వాటి సంఖ్య 15,000కు చేరుకుంది. పారిశ్రామిక నైపుణ్య అవసరాలను తీర్చేలా, రాబోయే పదేళ్లలో డిమాండ్‌ను తట్టుకొనేలా ఐటీఐ నెట్‌వర్క్ ఇప్పటినుంచే సన్నద్ధం కావాలి’’ అని ప్రధాని మోదీ సూచించారు.
ప్రతి గ్రామంలోనూ పాఠశాల
‘‘బిహార్ పురోభివృద్ధి కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వం ఎంతగానో శ్రమిస్తోంది. యువతకు గత 20 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాల కంటే రాబోయే ఐదేళ్లలో అంతకు రెట్టింపు ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. వేర్లకు చెదలు పట్టి ఎండిపోయిన చెట్టును బతికించడం కష్టం. ఇతర పార్టీల పాలనలో బిహార్ పరిస్థితి ఇలాగే ఉండేది. నితీశ్ కుమార్ పట్ల బిహార్ ప్రజలు విశ్వాసం ప్రదర్శించారు. ఆయన నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వం బిహార్‌ను మళ్లీ దారిలో పెట్టడానికి ఉమ్మడిగా కృషి చేస్తోంది. రెండున్నర దశాబ్దాల క్రితంలో బిహార్‌లో విద్యా వ్యవస్థ ఎలా ఉండేదో ఇప్పటి తరానికి తెలియదు. తమ బిడ్డలు స్థానికంగానే చదువుకొని, ఉద్యోగం సంపాదించుకోవాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. కానీ, విపక్షాల పాలనలో లక్షలాది మంది బిహార్‌ను విడిచిపెట్టి బనారస్, ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాలకు వలసవెళ్లారు. వలసలకు అప్పడే బీజం పడింది. ఎన్డీయే సర్కార్ వచ్చిన తర్వాత బిహార్ ప్రజలు సొంత రాష్ట్రానికి తిరిగి రావడం ఆరంభమైంది’’ అని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.