
కిషన్‌గంజ్ (బిహార్): ముస్లింల మసీదులు, ఇతర పవిత్ర స్థలాలను లాక్కునేందుకే నరేంద్ర మోదీ ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. బిహార్‌లోని కిషన్‌గంజ్ జిల్లాలో బుధవారం జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా అక్కడ ఆయన ’సీమాంచల్ న్యాయ యాత్ర’ను ప్రారంభించారు. రానున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా.. రాష్ట్రంలోని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో తన పార్టీ విజయావకాశాలను పెంచుకునే లక్ష్యంతో మూడు రోజుల సుడిగాలి పర్యటనకు ఒవైసీ శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా కోచధమన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లో నిర్వహించిన ర్యాలీలో ఒవైసీ మాట్లాడుతూ.. మసీదులు, ఈద్గాలు, ఖబరస్తాన్‌లను లాక్కోవడానికే ప్రధాని నరేంద్ర మోదీ వక్ఫ్ బిల్లును తీసుకొచ్చారని, సదుద్దేశంతో కాదని స్పష్టం చేశారు. ఈ ఆస్తులు అల్లాహ్‌కు చెందినవని మోదీ గ్రహించలేదని విమర్శించారు. మోదీ తన దురుద్దేశపూర్వక ఆలోచనలతో ఎప్పటికీ విజయం సాధించలేరని చెప్పారు. ప్రపంచం ఉన్నంత వరకు ముస్లింలు తమ మసీదులలో ప్రార్థనలు చేస్తూనే ఉంటారని, అల్లాహ్‌ను విశ్వసించేవారి పవిత్రమైన స్థలాలు బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్ చేతుల్లోకి వెళ్లవని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఒవైసీ.. బిహార్‌లో ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్న ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్ష పారీ్టలపై కూడా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. స్వాతంత్య్రం వచి్చనప్పటినుంచి దేశ ముస్లింలు లౌకిక పారీ్టగా చెప్పుకొంటున్న పారీ్టకి మద్దతు ఇస్తున్నారని గుర్తు చేశారు. బీజేపీ అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు.. చాలా కాలంగా ముస్లింల ఓట్లు కోరుకున్నారని, కానీ, కూలీల్లా ఈ భారాన్ని ఎప్పటికీ మోయలేమని గ్రహించాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు. ‘ఒంటరిగా మిగిలిపోతున్న మన యువతపై శ్రద్ధ వహించాలి. మన శ్రేయస్సుకు అవసరమైనవి చేయాలి. కొన్ని పారీ్టలు.. అధికారాన్ని అనుభవించేందుకు ఇకపై మన ఆకాంక్షలను త్యాగం చేయరాదు’.. అని ఒవైసీ పిలుపునిచ్చారు.