
ద్వారకాతిరుమల: సృష్టిలో తల్లి ప్రేమకు మించింది మరొకటి లేదు. అది మనుషుల్లో అయినా.. జంతువుల్లో అయినా ఒక్కటే అనడానికి ఈ దృశ్యం అద్దంపడుతోంది. ద్వారకాతిరుమల శివారు లక్ష్మీపురంలోని ఆర్చిగేటు సమీపంలో రోడ్డుపై సోమవారం ఉదయం ఓ కుక్క పిల్లను కారు ఢీకొట్టడంతో, అది అక్కడే చనిపోయింది. దీంతో తన మరో పిల్లతో కలిసి అక్కడికి చేరుకున్న తల్లి శునకం చనిపోయిన పిల్లకు కాపలా కాసిన తీరు కంటతడి పెట్టించింది.
వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రోడ్డుపై పిల్లతో కూర్చుని, చనిపోయిన పిల్లను మరే వాహనం తొక్కకుండా ఒక పూటంతా కాపలా కాసింది. రోడ్డుపై వెళుతున్న వారి వైపు దీనంగా చూస్తూ తల్లడిల్లిపోయింది. చివరికి ఓ వ్యక్తి చనిపోయిన కుక్క పిల్లను దూరంగా తీసుకెళ్లి పడేయడంతో తల్లి శునకం, దాని పిల్ల అక్కడి నుంచి వెళ్లిపోయాయి.
ఇదీ చదవండి: బంగారం కాదు..కానీ కిలో కోటి రూపాయలు