ఎత్తుకు పైఎత్తు

Funday crime story in this week 11 nov 2018 - Sakshi

 క్రైమ్‌ స్టోరీ

అర్ధరాత్రి కావస్తున్నా కూతురు సునీత ఇంటికి రాకపోవడంతో డాక్టర్‌ శేఖర్‌ ఆందోళన చెందాడు. పేషెంట్లు ఎవరూ లేకపోవడంతో రాత్రి పది గంటలకే శేఖర్‌ తన నర్సింగ్‌ హోమ్‌ నుంచి ఇంటికొచ్చేశాడు. కానీ తొమ్మిదిన్నరకే రావాల్సిన సునీత ఇంతవరకు రాలేదు. ఆమె ఫోన్‌ కూడా స్విచాఫ్‌ అని వస్తోంది. సునీత తన ఫోన్‌ని ఎప్పుడూ స్విచాఫ్‌ చెయ్యదు. నగరంలో ఒక బ్యూటీ పార్లర్‌ నడిపే సునీత రోజూ తొమ్మిదిన్నరకల్లా ఇంటికి చేరుకుంటుంది. కానీ ఈ రోజు అర్ధరాత్రి కావస్తున్నా రాలేదు. శేఖర్‌ బ్యూటీ పార్లర్‌లో పనిచేసే వారికి కూడా ఫోన్లు చేశాడు. ఎప్పటిలాగే రాత్రి తొమ్మిదికి పార్లర్‌ మూసేశాక సునీత తన కారులో ఇంటికి వెళ్లిపోయిందని వారు చెప్పారు. కొంపదీసి సునీత కారు ప్రమాదానికి గురైందా అనే అనుమానంతో పోలీస్‌ స్టేషన్‌కి ఫోన్‌ చెయ్యబోయాడు. అప్పుడే శేఖర్‌ సెల్‌ మోగింది.
స్క్రీన్‌పై సునీత నంబర్‌ కనిపించగానే ఆత్రంగా ‘‘ఏమ్మా! ఎక్కడున్నావ్‌?’’ అని అడిగాడు.

అవతల నుంచి సునీతకు బదులు ఇంకెవరో మాట్లాడారు.‘‘డాక్టర్‌ శేఖర్‌! మీ కూతురు ప్రస్తుతం మా బందీగా ఉంది. ఆమె ప్రాణాలతో దక్కాలంటే మీరు మేం చెప్పినట్లు చెయ్యాలి’’ అన్నాడు ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి కటువుగా.‘‘ఎవరు మీరు? మీకేం కావాలి? నా కూతుర్ని క్షేమంగా విడిచిపెట్టండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను’’ ఆందోళనగా అన్నాడు.‘‘మాకు డబ్బు అక్కర్లేదు. నువ్వు మాకొక చిన్న పని చేస్తే చాలు. మావాడికి భుజంలో బుల్లెట్‌ దిగింది. బుల్లెట్‌ బయటకు తీసి కట్టు కట్టాలి. ఆ పని ఇప్పుడే చెయ్యాలి. నీ వంటి సర్జన్‌కి ఇదొక పెద్ద పని కాదు. సర్జరీకి కావలసిన పరికరాలు తీసుకొని నువ్వు ఇప్పుడే కారులో నేరుగా గాంధీనగర్‌ వచ్చెయ్‌. ఆలోగా మేం నీకు మళ్లీ ఫోన్‌ చేస్తాం. ఈ విషయం పోలీసులకు చెప్పవంటే నీ కూతురు శవం కూడా నీకు దొరకదు’’ అంటూ ఫోన్‌ కట్‌ చేశాడా వ్యక్తి.డాక్టర్‌ శేఖర్‌ ఇంటి పక్కనే ఉన్న తన నర్సింగ్‌హోమ్‌ లోంచి సర్జరీకి కావలసిన పరికరాలు, మత్తుమందు, బ్యాండేజీ సామగ్రిని ఒక బ్యాగులో వేసుకుని కారులో బయల్దేరాడు. అతను గాంధీనగర్‌లోకి ప్రవేశించగానే ఫోన్‌ మోగింది. కిడ్నాపర్‌ మాట్లాడాడు. ‘నీ కారును రేమండ్‌ షోరూమ్‌ ముందు పార్క్‌ చేసి, దానికి ఎదురుగా ఉన్న సందులోకి నడుచుకుంటూ రా’’ అని ఆదేశించాడు.శేఖర్‌ అతను చెప్పినట్టే చేశాడు. ఫోన్‌లో సూచనల ద్వారా కిడ్నాపర్‌ శేఖర్‌ని నాలుగైదు సందులు తిప్పి, చివరకు నిర్మానుష్యంగా ఉన్న ఒక చీకటి ప్రదేశంలో ఆగమన్నాడు. అక్కడొక కారు నిలిపి ఉంది. కారు పక్కనే ఒక ముసుగు వ్యక్తి శేఖర్‌ చేతిలోని బ్యాగుతో పాటు అతని సెల్‌ఫోన్‌ కూడా తీసుకున్నాడు. సెల్‌ఫోన్‌ స్విచాఫ్‌ చేసి, బ్యాగును కారులో పెట్టాడు. తర్వాత శేఖర్‌ కళ్లకు గంతలు కట్టి కారు వెనుక సీట్లో కూర్చోబెట్టాడు. తాను డ్రైవింగ్‌ సీట్లో కూర్చుని కారు స్టార్ట్‌ చేశాడు. 

కారు వేగంగా ముందుకు ఉరికింది. పావుగంట ప్రయాణం తర్వాత ఒక చోట ఆగింది. ముసుగు వ్యక్తి శేఖర్‌ చెయ్యి పట్టుకొని కొంత దూరం తీసుకెళ్లాడు. గమ్యం చేరాక శేఖర్‌ కళ్లకు కట్టిన గంతలను తీసేశాడు. తానొక గదిలో ఉన్నానని గ్రహించాడు శేఖర్‌. గదిలోని మంచం మీద భుజానికి తూటా దెబ్బ తగిలిన వ్యక్తి ఉన్నాడు. అతని పక్కనే మరో వ్యక్తి ఉన్నాడు. వారిద్దరి ముఖాలకు కూడా ముసుగులు ఉన్నాయి. గాయపడ్డ వ్యక్తి బాధకు విలవిల్లాడుతున్నాడు. డాక్టర్‌ శేఖర్‌ వెంటనే పని మొదలుపెట్టాడు. గాయపడ్డ వ్యక్తికి మత్తుమందు ఇచ్చి అతని భుజంలో దిగిన తూటాను చాకచక్యంగా బయటకు తీశాడు. తర్వాత గాయానికి మందు రాసి, కుట్టు కుట్టి కట్టు కట్టాడు. తర్వాత పేపర్‌ మీద కొన్ని మందులు రాసిచ్చాడు. ‘‘తూటా చాలా లోపలకు దిగబడింది. పైగా చాలాసేపు లోపలే ఉండిపోవడం వల్ల అక్కడ ఇన్ఫెక్షన్‌ ఏర్పడింది. వెంటనే ఈ మాత్రలు వాడండి. వాడకపోతే ఇన్ఫెక్షన్‌ ఎక్కువై ప్రాణం మీదకు వస్తుంది. అందువల్ల నిర్లక్ష్యం చెయ్యవద్దు’’ అని ఆ ముసుగు వ్యక్తులతో చెప్పాడు.తర్వాత కిడ్నాపర్లు శేఖర్‌ని గాంధీనగర్‌ వరకు కళ్లకు గంతలతో తీసుకెళ్లారు. అక్కడ అతన్ని దించి, సెల్‌ఫోన్‌ ఇచ్చి వెళ్లిపోయారు. శేఖర్‌ కారులో ఇంటికి చేరుకున్నాడు. అప్పటికి వేకువ జాము నాలుగు గంటలైంది. తెలతెలవారుతుండగా సునీత ఇంటికి వచ్చింది. తనను ఎవరో దుండగులు కిడ్నాప్‌ చేసి, కళ్లకు గంతలు కట్టి ఎక్కడికో తీసుకెళ్లారని, రాత్రంతా ఒక గదిలో బంధించి కొద్దిసేపటి కిందటే విడిచిపెట్టారని చెప్పింది. శేఖర్‌ రాత్రి జరిగినదంతా కూతురికి చెప్పాడు.సునీత క్షేమంగా ఇంటికి తిరిగొచ్చింది గనుక ఇప్పుడు కిడ్నాపర్ల గురించి పోలీసులకు చెప్పడం ధర్మం అనుకున్నాడు శేఖర్‌. వెంటనే ఇన్‌స్పెక్టర్‌ విజయ్‌కుమార్‌కి ఫోన్‌ చేసి, జరిగినదంతా వివరంగా చెప్పాడు. అప్పుడు విజయ్‌ ఆ కిడ్నాపర్లు ఎవరో శేఖర్‌కి చెప్పాడు.

‘‘మీ అమ్మాయిని కిడ్నాప్‌ చేసిన ఈ దుర్మార్గులే నిన్న సాయంత్రం హైవేలో ఒక వజ్రాల వ్యాపారి కారును అటకాయించి, కోటి రూపాయల విలువైన వజ్రాలు దోచుకెళ్లారు. ఆ వ్యాపారి ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో దుండగుల్లో ఒకడు గాయపడ్డాడు. దుండగులు ఆ వజ్రాల వ్యాపారిని చంపి, తమ సహచరుణ్ణి కారులో ఎక్కించుకుని పరారయ్యారని మాకు తెలిసింది. వారు గాయపడ్డ తమ వ్యక్తిని నేరుగా ఆస్పత్రికి తీసుకెళితే పట్టుబడిపోతామనే భయంతో మీ కూతుర్ని కిడ్నాప్‌ చేసి, మీ ద్వారా అతనికి చికిత్స చేయించారని ఇప్పుడర్థమవుతోంది నాకు. నిన్న రాత్రి కిడ్నాపర్లు మిమ్మల్ని కారులో తీసుకెళ్లిన రూటును మీరు చెప్పగలిగితే మేం వారి స్థావరాన్ని కనుక్కొని వారిని అరెస్టు చేస్తాం’’ అన్నాడు విజయ్‌.‘‘సారీ ఇన్‌స్పెక్టర్‌. ఆ సమయంలో నా కళ్లకు గంతలు కట్టడం వల్ల నేనేమీ చూడలేకపోయాను. అయితే, వారి ఆచూకీ తెలుసుకోవడానికి నేనొక ట్రిక్కు ప్రయోగించాను. పేషెంటుకి ఇన్ఫెక్షన్‌ తగ్గడానికి నేను రాసిచ్చిన మాత్రలు నెహ్రూ రోడ్డులోని అపోలో ఫార్మసీ మెడికల్‌ షాపులో మాత్రమే దొరుకుతాయి. నగరంలో ఇంకెక్కడా ఆ మందుల స్టాక్‌ లేదు. ఒక డాక్టర్‌గా నాకీ విషయం బాగా తెలుసు. ఆ మెడికల్‌ షాపు రోజూ ఉదయం తొమ్మిది గంటల తర్వాత తెరుస్తారు. మీరు ఆ అంగడి వద్ద మాటు వేసి, ఆ మందుల చీటీ తెచ్చిన వ్యక్తిని పట్టుకుంటే చాలు మిగిలిన వారు కూడా దొరికిపోతారు’’ ధీమాగా చెప్పాడు శేఖర్‌.‘‘థాంక్యూ డాక్టర్‌. మా పోలీసుల బుర్ర కన్నా మీ బుర్రే తెలివైనది. ఆ మందుల పేర్లు చెప్పండి చాలు. ఆ దుర్మార్గుల్ని ఇట్టే పట్టుకుంటాను.’’ హుషారుగా అన్నాడు విజయ్‌ రాసుకున్నాడు.తర్వాత విజయ్‌ అపోలో ఫార్మసీ షాపు తెరవగానే షాపు ఓనరుతో మాట్లాడి తన సిబ్బందితో కలసి మఫ్టీలో షాపు బయట మాటు వేశాడు. ఊహించినట్టే కాసేపట్లో ఒక కిడ్నాపర్‌ శేఖర్‌ రాసిచ్చిన మందుల చీటీతో అంగడికి వచ్చాడు. షాపు ఓనర్‌ సైగ చెయ్యగానే విజయ్‌ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాడు. తర్వాత అతని ద్వారా అతని సహచరులను కూడా అరెస్టు చేసి, వజ్రాలను స్వాధీనం చేసుకున్నాడు.
- డి.మహబూబ్‌ బాషా 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top