కాస్త వెరైటీగా.. మరికాస్త రుచికరంగా | Egg Onion Ring And Sweat Potato Balls Recipes In Telugu | Sakshi
Sakshi News home page

కాస్త వెరైటీగా.. మరికాస్త రుచికరంగా

Sep 22 2019 9:24 AM | Updated on Sep 22 2019 9:24 AM

Egg Onion Ring And Sweat Potato Balls Recipes In Telugu - Sakshi

స్వీట్‌పొటాటో బాల్స్‌
కావలసినవి: చిలగడదుంపల గుజ్జు – 3 కప్పులు (స్వీట్‌పొటాటోలను ఉడికించుకుని ముద్దలా చేసుకోవాలి), చీజ్‌ – 4 టేబుల్‌ స్పూన్లు, టమాటో సాస్‌ – 3 టేబుల్‌ స్పూన్లు, మైదాపిండి – పావు కప్పు, గుడ్లు – 2, పాలు – అర టేబుల్‌ స్పూన్‌, బ్రెడ్‌ పౌడర్‌ – పావు కప్పు, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో చిలగడదుంపల గుజ్జు, చీజ్, టమాటో సాస్‌ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మైదాపిండి ఒక బౌల్‌లో.. పాలు, గుడ్లు మరో బౌల్‌లో.. బ్రెడ్‌ పౌడర్‌ ఇంకో బౌల్‌లో వేసుకుని బాల్స్‌ని మైదాపిండిలో ముంచి, గుడ్డు మిశ్రమాన్ని పట్టించి, బ్రెడ్‌ పౌడర్‌లో అటు ఇటూ తిప్పి.. నూనెలో డీప్‌ఫ్రై చేసుకుని వేడివేడిగా తింటే భలే రుచిగా ఉంటాయి.

ఎగ్‌ ఆనియన్‌ రింగ్స్‌
కావలసినవి:
 ఆనియన్‌ రింగ్స్‌ – 4(ఉల్లిపాయను రింగ్స్‌లా కట్‌ చేసుకోవాలి), గుడ్లు – 4, నూనె – సరిపడా, బ్రెడ్‌ పౌడర్‌ – 5 టేబుల్‌ స్పూన్లు, బటర్‌ – 3 టేబుల్‌ స్పూన్లు(కరిగించి), ఉప్పు – తగినంత, మిరియాల పొడి – కొద్దిగా
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో బ్రెడ్‌ పౌడర్, బటర్, ఉప్పు వేసుకుని బాగా కలుపుకుని ఆ మిశ్రమాన్ని ఆనియన్‌ రింగ్స్‌కి బాగా పట్టించి, నూనెలో డీప్‌ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌ తీసుకుని అందులో లైట్‌గా నూనె వేసి, ఒక డీప్‌ఫ్రై చేసుకున్న ఆనియన్‌ రింగ్‌ పెట్టుకుని.. దానిలో గుడ్డు పగలగొట్టి వేసుకోవాలి. ఇప్పుడు కాసేపు మూత బోర్లించి ఉడకనివ్వాలి. మిగిలిన రింగ్స్‌లో కూడా గుడ్లను అలానే వేసుకుని ఉడికించుకుని పైన మిరియాల పొడి వేసుకుంటే అదిరే రుచి మీ సొంతమవుతుంది.

కొబ్బరి గారెలు
కావలసినవి: అన్నం – 2 కప్పులు, కొబ్బరి కోరు – అర కప్పు, నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా, ఉప్పు – తగినంత, ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు – అభిరుచిని బట్టి
తయారీ: ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అన్నం, కొబ్బరి కోరు, కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని మరోసారి బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గారెల్లా చేసుకుని నూనెలో డీప్‌ఫ్రై చేసుకుంటే సరిపోతుంది.
సేకరణ:  సంహిత నిమ్మన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement