చితికిన బతుకుల చీకటి వెలుగులు | Sakshi
Sakshi News home page

చితికిన బతుకుల చీకటి వెలుగులు

Published Sun, May 29 2016 12:43 AM

చితికిన బతుకుల చీకటి వెలుగులు

వారు తమ జీవితం గురించి ఆలోచించడం లేదు.
 ఎవరైతే తమ జీవితాలను చీకట్లోకి నెట్టారో...
 వారిని తప్పు పట్టడం లేదు.
 ఎవరినీ నిందించడం లేదు.
 తమ వారి బతుకుల్లో వెలుగులు నింపడానికి తాము చీకట్లో  మగ్గిపోతున్నారు.
 చీకటి వెలుగులతో దోబూచులాడుతున్న వారంతా ఎలాంటి జీవితాన్ని వెళ్లబుచ్చుతున్నారు?
 వారి ద్వారానే తెలుసుకుందాం...

 
‘చీకట్లో నన్ను నేను వేరొకరికి అప్పజెప్పుకుంటూ... ఇంట్లో నా బిడ్డ ఏ పరిస్థితిలో.. ఎలా ఉందో.. అని ప్రాణాలు అరచేతిలో నిలుపుకుంటుంటాను’ వస్తున్న దుఃఖాన్ని ఆపుకోవడానికి రెండు క్షణాలు ఆగింది పూర్ణ(పేరు మార్చాం). ఆమె వయసు 29. మనిషి మంచి ఒడ్డూ పొడుగుతో ఉంది. కాలం ఆమెకు చేసిన గాయాలను ఆ కళ ్లకింద వలయాలు చెప్పకనే చెబుతున్నాయి. పూర్ణ మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టింది...
 ‘‘ఈ ‘పని’ చేయకపోతే ఎలా.. రేపటి మా ఆకలి తీరేదెలా... అని గుర్తుకు తెచ్చుకుంటాను. ఎప్పుడెప్పుడు నా బిడ్డ దగ్గరకు వెళ్లిపోతానా అని ఎదురుచూస్తుంటాను.

తెల్లవారకముందే ఉరుకులు పరుగులతో ఇంటికి చేరుకుంటా. తాళం తీసి బిడ్డ ఏ మూల ఉందా అని వెతుక్కుంటా. చాలా సార్లు మా రమ్య (పేరు మార్చాం) పడుకునే కనిపిస్తది. ఒక్కోసారి ఆ చీకట్లో అరుస్తూ గోడకేసి తలబాదుకుంటూ ఉంటది. బిడ్డను గుండెలకదుము కొని... ఊరడించి పడుకోబెడతా. అది ఆకలికి తట్టుకోలేదు. ఏ పండో, బ్రెడ్డు ముక్కనో తినిపించి పడుకోబెడతా! దానికి మతిస్థిమితం లేదమ్మా! ’’ అంటూ ఏడుస్తూనే.. ‘‘నా గురించి ఇంకా ఏముంది చెప్పడానికి. రోత బతుకు. ఒక్కపూటలోనో, ఒక్కరోజులోనో ఈ దుఃఖం తీరిపోయేది కాదు.

దేవుడి పిలుపు వచ్చేంతవరకు ఈ కష్టం తప్పదు...’’ అని కళ్లనీళ్లు తుడుచుకుంది. ‘‘మాది అమలాపురం దగ్గర ఓ చిన్న పల్లెటూరు. అమ్మనాన్నలది కలిగిన కుటుంబమే. అన్న, ఇద్దరు అక్కలున్నారు. పదిహేనేళ్ల క్రితం ‘ప్రేమించాను..’ అని ఒకతను వెంటపడ్డాడు. నిజం అని నమ్మాను. ఇంట్లో వాళ్లకు చెబితే ఊరుకోరని... చెప్పాపెట్టకుండా వాడి చేత తాళి కట్టించుకొని, పట్నం వచ్చేశా. ఇంటి నుంచి తెచ్చుకున్న సొమ్ముతో మూడు నెలలు ఎలా గడిచిపోయాయో కూడా తెలియలేదు. కొన్ని రోజులు నా మొగుడు బేల్దారీ పని చేశాడు, కొన్ని రోజులు ఆటో నడిపాడు. ఆనందంగా సాగిపోతుందనుకున్నా.

నెలరోజులుగా ఏ పనికీ పోలేదు. ఎందుకంటే ‘పని దొరకలేదు’ అంటుండేవాడు. నెల తప్పిన విషయం నా భర్తకు సంతోషంగా చెప్పా. కానీ, అతనేం మాట్లాడలేదు. ఓ రోజు చీకటి పడుతూనే నా భర్త తన స్నేహితుడు ఒకడిని తీసుకొచ్చాడు. ఆ రాత్రి అతడితో గడపమన్నాడు. చీదరించుకున్నాను, తిట్టాను, అరిచాను, కాళ్లావేళ్లాపడ్డాను. అయినా నా మొగుడి మనసు కరగలేదు. నన్ను ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. వాణ్ని లోపలుంచి, బయట తాళం వేసుకొని వెళ్లిపోయాడు. రోజూ.. ఎవరినో ఒకరిని తీసుకొస్తూనే ఉండేవాడు. పగటి పూట పారిపోకుండా తలుపులకు తాళం వేసి బయటకు వెళ్లేవాడు. కడుపుతో ఉన్నానని కూడా కనికరం ఉండేది కాదు. నేనెప్పుడూ కాలు బయటపెట్టింది లేదు కాబట్టి చుట్టుపక్కల ఇళ్లవాళ్లకు ఇదేమీ తెలిసేది కాదు.

ఈ పరిస్థితిలోనే కూతురు పుట్టింది. పచ్చిబాలింతనని.. అప్పటికైనా వదిలిపెట్టమని బతిమాలుకున్నాను. మా ఊరు వెళ్లిపోతానని కాళ్లు పట్టుకున్నాను. అప్పటికి ‘సరే’ అనేవాడు. రాత్రి అయ్యేవరకు తన అసలు రూపం చూపించేవాడు. బాగా తాగి, తను తీసుకొచ్చినవారి కోరిక తీర్చకపోతే బిడ్డకు పాలు కూడా కొనేవాడు కాదు. బిడ్డ ఆకలి చూసే శక్తి ఇవ్వని దేవుడు, మొగుడు పెట్టే హింసను భరించే శక్తిని ఎలా ఇచ్చాడో...!! చాలా సార్లు చచ్చిపోదామనుకున్నా. పసిదాని మొఖం చూసేసరికి ఏం చేయాలో తెలిసేది కాదు. బిడ్డ పదినెలల వయసున్నప్పుడు నా మొగుడు మంచాన పడ్డాడు. ఏమైందో తెలియదు... విపరీతమైన జ్వరంతో మూలిగేవాడు. ఉన్న కాసిన్ని డబ్బులతో మందులు కొనిచ్చినా తగ్గలేదు.

వారం రోజులు తిరక్కుండానే చచ్చిపోయాడు. మున్సిపాలిటీ వాళ్లు వచ్చి శవాన్ని తీసుకెళ్లారు. ఇల్లు గలవాళ్లు ఇల్లు ఖాళీ చేయమన్నారు. చంటిబిడ్డనెత్తుకొని మా ఊరెళ్లాను.
 మావాళ్లంతా నన్ను ఛీత్కరించుకున్నారు. చెప్పా పెట్టకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి వాళ్ల పరువు తీశానని. ‘పట్నంలో ఏ కూలో నాలో చేసుకొని పైసలు తెచ్చిస్తా. నా బిడ్డను చూసుకోమ’ని మావాళ్ల కాళ్లావేళ్లా పడ్డా. ‘మా పిల్లలే మాకు బరువు, ఇంక నీ పిల్లనేం చూస్తాం’ అన్నారు. ఇక చేసేదేమీ లేక బిడ్డనెత్తుకొని పట్నం వచ్చా.

నాకు నా బిడ్డ, దానికి నేను... అంతే! మాకెవరూ లేరు. పని కోసం వెతికి వెతికి అలసిపోయా! ఆకలితో బిడ్డనెత్తుకొని రాత్రిపూట ఓ రోడ్డుపక్కగా నిల్చున్నా. ‘వస్తావా!’ అన్న మాటలకు ఉలిక్కిపడ్డ. బతకడానికి, బిడ్డను బతికించుకోవడానికి ఏ పనైనా చేయాల్సిందే! నా మొగుడు పుణ్యమా అని తెలిసిన దారే ఎంచుకున్నా! ఓ చిన్న రూము అద్దెకు తీసుకున్నా. ఏడాది దాటినా బిడ్డ తల నిలపడం లేదు. మాట లేదు, ముచ్చట లేదు. అనుమానం వచ్చి ఆసుపత్రిలో చూపించా. బిడ్డకు మతిస్థిమితం లేదన్నారు. ఎప్పటికీ బాగవదన్నారు. కాళ్ల కింద భూమి కంపించినట్టయింది. ఏం పాపం చేశానని... కడుపుతో ఉండగా నా మొగుడు తన్నిన తన్నులకు నా బిడ్డ ఇలా పుట్టిందా?!

వచ్చీ పోయేవాళ్ల కారణంగా నా బిడ్డ ఇలా పుట్టిందా?! ఎవరిని తప్పు పట్టాలి?! ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయేదాన్ని. బతికినన్నాళ్లూ నా బిడ్డ కడుపుకింత తిండి పెట్టగలిగితే అంతే చాలు అనుకుంటున్నా.. ఇప్పుడు దానికి ఎనిమిదేళ్లు.  నన్ను గుర్తుపట్టదు. కాస్త వదిలిపెడితే చాలు దారితెన్నూ లేకుండా వెళ్లిపోతుంది. ఒంటిసోయి తెలియదు. పొద్దంతా ఈ బిడ్డతోనే. చీకటిపడితే.. ఎక్కడో... !! నా భయం అంతా ఒకటే. మతిలేని బిడ్డకు ఒళ్లు గురించి తెలియదు. కానీ, దాని ఒళ్లు పెరుగుతోంది. చూడ్డానికి అందంగా కనిపిస్తోంది. ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? ఎలా కాపాడుకోవాలి?! ఎన్నాళ్లో ఇలా...!!’’ అంటూ ఏడుస్తూనే చేతులెత్తి కనపడని దేవునికి దణ్నం పెట్టుకుంది.
 పూర్ణ దుఃఖం ఎవరూ తీర్చలేనిది. కానీ, తోటి సెక్స్‌వర్కర్లు ఆమెను అర్థం చేసుకున్నారు.  అండగా ఉంటామని ఆమెను అక్కున చేర్చుకున్నారు.
- నిర్మలారెడ్డి, సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి
 
జీవితానికి భరోసా!
సెక్స్‌వర్కర్లు తమ భవిష్యత్తు గురించి తాము ఏ మాత్రం ఆలోచించరు. తమను నమ్ముకున్నవారికి విపరీతమైన సేవ చేస్తారు. ముందు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెబుతాం. వీరిలో హెచ్.ఐ.వి. బాధితులు ఉంటారు. వ్యసనాల బారిన పడిన వారుంటారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ‘మీరు ఎవరి కోసమైతే కష్టపడుతున్నారో వాళ్లకు ముఖ్యంగా మీ పిల్లలకు దూరమైపోతార’ని చెబుతాం. సెక్స్‌వర్కర్లు తమ జీవితం మెరుగ్గా చేసుకునేందుకు కావల్సిన అవగాహన కల్పించడమే మా పని. పదేళ్లుగా 1400 మంది సెక్స్‌వర్కర్లకు వెన్నుదన్నుగా ఉంది మా ఫౌండేషన్.
- బి. నారాయణస్వామి, టిఐ-ప్రాజెక్ట్ మేనేజర్, రాంకీ ఫౌండేషన్, హైదరాబాద్
 
నాదగ్గరే ఉండమ్మా అని ఏడుస్తుంది...
నా కూతురు ఇప్పుడు ఏడవ తరగతి చదువుతోంది. బిడ్డ సదువుకు, తిండికయ్యే పైసలన్నీ నేనే ఇస్తా, దానికింత నీడనివ్వండని మా బంధువులకు మొక్కిన.  వాళ్లు దయతలిచారు. మొదట్లో సెక్స్‌వర్కర్ గానే ఉన్నా. ఇప్పుడు హోటల్‌లో పని చేస్తున్నా. ఆరువేల రూపాయల నెల జీతం వస్తది. అవన్నీ నా బిడ్డకోసం పట్టుకెళతా! ఊరి నుంచి వచ్చేటప్పుడు ‘ఇక్కడే ఉండిపొమ్మా’ అని ఏడుస్తది. రొంపిలోంచి బయటపడ్డదాన్ని ఈ రొంపి గురించి నా బిడ్డకు తెల్వకూడదు. అందుకే, ఇంత దూరంలో ఉంటున్న.
- మాలిని
 
పిల్లల చదువులకు తప్పని జీవితం...
నాకు ఇద్దరు పిల్లలు. నా భర్త నయం కాని జబ్బుతో మంచాన పడ్డాడు. పూట గడవలేని పరిస్థితిలో ఓ వ్యక్తి ఈ రొంపిలోకి దించాడు. ఎప్పటికప్పుడు మానేద్దాం అనుకుంటాను. కానీ, నా బిడ్డ ఇప్పుడు బి.టెక్ చేస్తోంది. కొడుకు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు. వాళ్లు బాగా చదువా లంటే పైసలు కావాలి. అందుకే నేనీ పని చేయకతప్పదు. అష్టకష్టాలతోనే ఈ రొంపిలోకి వచ్చిన వాళ్లుంటారు. వారిని కనిపెట్టి, టెస్టులు చేయిస్తా! ఆరోగ్యం పట్ల అవగాహన కల్పిస్తుంటాను. నాలాంటి వారి మేలు కోసం కృషి చేస్తున్నా!  
- వసుమతి
 
నియమాలు తప్పనిసరి...
మాకు మేం కొన్ని కట్టుబాట్లు పెట్టుకున్నాం. 18 ఏళ్లు నిండని అమ్మాయిలు ఎవరైనా ఈ రొంపిలోకి వచ్చినట్టుగా గుర్తిస్తే వెంటనే ఫౌండేషన్ నిర్వాహకుల వద్దకు తీసుకురావాలి. అలాగే వారికి కౌన్సెలింగ్ ఇప్పించి మళ్లీ వాళ్ల వాళ్ల దగ్గరకు పంపించేయాలి. అందుకు మేమే తలా కొంత డబ్బు వేసుకుంటాం. ఎన్నో సమస్యల నుంచి తప్పించుకోవడానికి, పరిష్కరించుకోవడానికి ఇప్పుడిప్పుడే మాకు కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. మా బతుకులు మేం బతకడానికి టైలరింగ్ వంటివి నేర్చుకుంటున్నాం.
- ఉష

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement