 
															అజిత్
సినిమా హీరోల విషయంలో నటన ఒక తీరుగా ఉంటే, నిజజీవితం మరో విధంగా ఉంటుంది.
	సినిమా హీరోల విషయంలో నటన ఒక తీరుగా ఉంటే, నిజజీవితం మరో విధంగా ఉంటుంది.  సినిమాలలో హీరోయిజం చూపించినంతమాత్రాన, వారు నిజజీవితంలో కూడా అలాగే ఉండాలని ఏమీలేదు. అలాగే విలన్ వేషాలు వేసేవారు, వాస్తవ జీవితంలో కూడా అంతే దుష్టులుగా ప్రవర్తించారనుకుంటే పొరపాటే.  అయితే తెరపైనే కాకుండా, తెర వెనుక కూడా  హీరో అనిపించుకుంటూ జనాల హృదయాల్లో నిలిచిపోయేవారు అతితక్కువ మంది ఉంటారు. అలాంటి అరుదైన హీరోల్లో తమిళ టాప్ హీరో అజిత్ ఒకరు.  అతని స్టైలే వేరు. ఆ  విషయం అభిమానులకు, పరిశ్రమలో అందరికీ తెలుసు. సినిమా, కుటుంబం ఈ రెండే అతని ప్రపంచం. అజిత్ 2000లో నటి శాలినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఎంతో అన్యోన్య దంపతులుగా వారికి పేరుంది.  వారికి ఆరేళ్ల అనౌష్క అనే కుమార్తె ఉంది.  
	
	తను ఒక్కడే బాగుంటే చాలు అనుకోకుండా, తన వద్ద పనిచేసే వారు కూడా బాగుండాలని హీరో అజిత్ కోరుకుంటారు. ఆయనను చూసి మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. వెండితెరపైనే కాదు, నిజజీవితంలోనూ  అజిత్ హీరో అని అందరితోనూ మెప్పు పొందుతున్నారు. ఎలాంటి ప్రచార ఆర్భాటాలూ లేకుండా ఆర్థిక సమస్యల్లో ఉన్నవారిని ఆదుకోవటం అజిత్‌కు అలవాటు. అంతేకాకుండా  అజిత్ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దానిని అములులో కూడా పెట్టేశారు. వాచ్మేన్, పని మనిషి, కారు డ్రైవర్, వంట మనిషి... ఒకరేమిటీ ఇలా తన వద్ద పని చేసేవారందరికీ  ఇళ్లు కట్టించాలనుకున్నారు. కట్టించేశారు.
	
	తన వద్ద పనిచేసేవారందరికీ  ఇళ్ళు కట్టించడానికి పాత మహాబలిపురం రోడ్డులో కొంత స్థలాన్ని కూడా అజిత్ కొన్నారు. మనిషికి అర ఎకరం చొప్పున పది మందికి వారి పేరిటే రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఆ ఇళ్ల  నిర్మాణ పనులు కూడా  పూర్తయ్యాయి. తన చిత్రాలతో నిత్యం వార్తల్లో నిలిచే అజిత్, తెర వెనుక కూడా హీరో అనిపించుకున్నారు. అభిమానులు గర్వించతగిన రియల్ హీరో అజిత్.
	- శిసూర్య

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
