తిమ్మరుసు ధీయుక్తి... నూరు దిగ్గజాల కీర్తి! | driver is captain of the bus | Sakshi
Sakshi News home page

తిమ్మరుసు ధీయుక్తి... నూరు దిగ్గజాల కీర్తి!

Apr 3 2015 11:04 PM | Updated on Sep 2 2017 11:48 PM

తిమ్మరుసు ధీయుక్తి...  నూరు దిగ్గజాల కీర్తి!

తిమ్మరుసు ధీయుక్తి... నూరు దిగ్గజాల కీర్తి!

స్టీరింగ్ చేతిలో ఉంటుంది కాబట్టి చక్రం తిప్పే డ్రైవర్‌నే కెప్టెన్ ఆఫ్ ది బస్ అనుకుంటారు గానీ...

స్టీరింగ్ చేతిలో ఉంటుంది కాబట్టి చక్రం తిప్పే డ్రైవర్‌నే కెప్టెన్ ఆఫ్ ది బస్ అనుకుంటారు గానీ... నిజానికి కండక్టరే కెప్టెన్. ‘అక్కడ నిలబడకండీ... లోపలికి రండీ’ అంటూ ఓ కమాండ్ నింపుకున్న గొంతుతో ఆదేశాలు జారీ చేస్తాడతడు. అంతెందుకు ‘రైట్... రైట్... హోల్డాన్’ అన్న ఆయన ఆదేశాలననుసరించే డ్రైవర్ ప్రొసీడవుతాడు. అలాంటి కండక్టర్‌ను సిటీ బస్సుల్లో కూడా తొలగించి టిక్కెట్లిచ్చే ఆ బాధ్యతలనూ డ్రైవర్లకే అప్పజెబుతారన్న విషయం అందర్నీ ఎంతగానో కలచివేసింది.
 నిజానికి కండక్టర్లకూ, ప్యాసింజర్లకూ ఉన్నది భగవంతునికీ, భక్తునికీ ఉన్న బంధంలాంటిది. బస్సు కేవలం అనుసంధాన సాధనం మాత్రమే. బస్సును చూస్తే అదేదో శ్రీకృష్ణదేవరాయలు నిర్వహించే సాహితీ సమరాంగణ సభలా అనిపిస్తుంటుంది.
 సింహాసనం లాంటి డ్రైవింగు సీటు మీద కులాసాగా స్టీరింగు మీద ఒక చెయ్యీ, మెలిదిరిగిన మీసం లాంటి గేర్ రాడ్డు మీద మరో చెయ్యీ వేసి పాదపీఠం లాంటి క్లచ్‌లూ, యాక్సిలేటర్ల మీద కాళ్లూ వేసి సాక్షాత్తూ శ్రీకృష్ణదేవరాయలే ఖాకీ డ్రస్సు వేసుకున్నట్లుగా కూర్చుని ఉంటాడు డ్రైవరు. కాకపోతే తన సభాసదులకు వీపుచూపిస్తూ, అద్దంలోంచి బయటకు చూస్తూ! కానీ చెవులన్నీ బస్సులోనే ఉంటాయి. ఇక కండక్టరు తిమ్మరుసులాంటి ధీయుక్తితో టిక్కెట్లు పంచుతూ ఉండటంతో పాటూ... అష్టదిగ్గజాలు లేని లోటూ తీరుస్తుంటాడు. తానొక్కడే నూరుదిగ్గజ కవులకు పెట్టయి... వెటకారంగా, చమత్కారంగా చతురోక్తులూ, సరసోక్తులు పలుకుతుంటారు. దీనికి ఇతర దేశాల నుంచి వాదనకు వచ్చిన పండితోత్తముల్లా ప్యాసింజర్లూ తమవంతు విసుర్లు విసురుతుంటాడు. అలాంటి కండక్టరు, ప్యాసింజరు పాండిత్య ప్రకర్షణాకర్ష ప్రావీణ్య ప్రదర్శనలో వినిపించిన ఘట్టమొకటి ఒకనాడిలా సాగింది.
 ‘ఆ ఫుట్‌బోర్డు మీద ఉన్నవాళ్లు పైకి రావాలె... రావాలె బాబు... అక్కడ నిలబడొద్దు’
 ‘నువ్వంటే మా మేలుగోరి, మంచి మనసుతోని మమ్మల్ని పైకి రమ్మంటున్నవ్ గని, అక్కడ సోటు యాడుంది? కాలు కాదు కదా... వేలు పెట్టడానికి కూడా సోటు లేదు’ అన్నాడొక ప్యాసింజరు.
 ‘ఎందుకు లేదు బాబూ... నువ్విటు జరుగు. నాయనా నువ్వటుపో. ఇగజూడు ఎవర్నాయనా కాలుపెట్టనీకి సోటు లేదంది! ఇటురా... గీడ కాలుపెట్టుడేంది కాపురమే చెయ్యొచ్చు’
 ‘అవ్ కండక్టర్‌సాబ్. నువ్వన్నదే నిజం. కాపురం చేసుడేంది. ఆ తర్వాత పుట్టే పిల్లలు కబడ్డీ ఆడొచ్చు. అంత సోటు తయారు చేసినవ్’
 ఇలాంటి చమత్కార బాణాల్లాంటి సరసోక్తులను సివిల్ డ్రస్సులో ఉన్న శ్రీకృష్ణదేవరాయలతో పాటు భువన విజయంలాంటి బస్సులో ఉన్న ప్యాసింజర్లందరూ ఎంజాయ్ చేస్తుంటారు.
 టిక్కెట్లూ, హుకుంలూ జారీ చేస్తూ, వాటిని అమలయ్యేలా చూస్తూ ఉండే కండక్టర్ టిక్కెట్లతో పాటు, ప్రేమనూ తనలోంచి పంచుతూ, ప్రసరింపజేస్తూ ఉంటాడు. అలా ప్రేమను ప్రసరిస్తాడు కాబట్టే ఆయన్ను కండక్టర్ అన్నారు. లేకపోతే ఇన్సులేటర్ అనేవారేమో. అడుగడుగునా ఆగాల్సిన సిటీ బస్సుల్లో కండక్టర్లను ఎలా తీస్తారో చూద్దాం. కండర్టక్ లేని సిటీ బస్సు... అదీ ఓ బస్సేనా!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement