వివేకవంతమైన మాట... వెయ్యి వరహాల మూట

Wisdom is a thousandth of beds - Sakshi

ఇస్లాం వెలుగు

పూర్వం ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు ఆయన వేటకు బయలుదేరాడు. మార్గమధ్యంలో ఒక ముసలిరైతు తన చేలో మొక్కలు నాటుతున్నాడు. అది చూసి, వెంట ఉన్న భటులతో, ‘చూశారా ఈ వృద్ధుడు ఈ వయసులో కూడా ఎలా కష్టపడుతున్నాడో! ఆ మొక్కలు పెరిగేదెప్పుడు, కాసేదెప్పుడు, కాటికి కాళ్ళుజాపిన ఈ ముసలాడు తినేదెప్పుడు?’ అన్నాడు. ‘అవును మహారాజా తమరు చెప్పింది నిజం’ అన్నారు సేవకులు. ‘సరే ఆ వృద్ధుణ్ణి నాదగ్గరకు తీసుకురండి. అనవసరపు శ్రమ ఎందుకని నచ్చజెపుతా.’ అన్నాడు. వెంటనే ఆ వృద్ధరెతును ప్రవేశపెట్టారు భటలు. రాజు ఆ రైతునుద్దేశించి, ‘నీవయసెంత?’ అని ప్రశ్నించాడు. ‘ 86 సంవత్సరాలు’ సమాధానం చెప్పాడు వృద్ధుడు. ‘ఇంకెన్నాళ్ళు బతుకుతావో ఏమైనా అంచనా ఉందా?’ మళ్ళీ ప్రశ్నించాడు రాజు. ’లేదయ్యా. నేనే కాదు, ఎవరూ చెప్పలేరయ్యా. మహా అయితే ఇంకో రెండు మూడేళ్ళు బతుకుతానేమో’. అన్నాడు. ‘మరిప్పుడు నువ్వు నాటుతున్న మొక్కలు ఎన్నాళ్ళకు కాపుకొస్తాయి?’ ‘ఒక పదేళ్ళకు కాస్తాయనుకుంటా.’ ‘మరి వీటివల్ల నీకు లాభమేమిటి?’ అన్నాడు రాజు. ‘రాజా! అల్లాహ్‌ ఎవరి శ్రమనూ వృథాగా పోనివ్వడు. నా పూర్వీకులు నాటిన మొక్కల ఫలసాయాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. ఈ రోజు నేను నాటిన మొక్కల ఫలసాయం రేపు నా సంతానం అనుభవిస్తుంది. వివేకవంతులైన ప్రజలు ఇలాగే చేస్తారు.’

‘ఓహ్‌! చాలా బాగా చెప్పావు. నీమాట నాకు నచ్చింది’ అన్నాడు మహారాజు. ముందుగా చెప్పిన ప్రకారం సేవకులు ఆ వృద్ధుడికి వెయ్యి నాణేల సంచి బహుమానంగా అందజేశారు. అందుకున్న వృద్ధుడు, ‘మహారాజా! నేను నాటిన ఈ మొక్కలు ఇంకా పదేళ్ళకు గాని ఫలాలనిస్తాయి. కాని వాటి ప్రతిఫలం ఇప్పుడే నా చేతికందింది.’ అన్నాడు. ‘ఎంతబాగా చెప్పావు. ఈ మాట నాకు బాగా నచ్చింది.’ అన్నాడు రాజు.
వెంటనే మరో వెయ్యి నాణేల సంచి బహుమతిగా అందజేశారు. రెండవసారి మరోబహుమతి పొందిన వృద్ధుడు, ‘మహారాజా, మొక్కలు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కాపునిస్తాయి. కాని నాకిప్పుడు వాటి రెండవ పంట కూడా చేతికందింది.’ అన్నాడు మహదానందంతో..‘ఎంత బాగా చెప్పావు. నాకు ఈ మాట కూడా నచ్చింది.’ అన్నాడు మహారాజు రైతును మెచ్చుకుంటూ.. దీంతో సేవకులు అతనికి మరోకానుకను బహూకరించారు. మూడవ బహుమతినీ అందుకున్న రైతు, ‘నా స్వహస్తాలతో నాటిన ఈ మొక్కలు పంటకొచ్చినప్పుడు వాటిని కోసి, సంతకు తీసుకెళ్ళి అమ్మాల్సి ఉంటుంది. కాని నాకైతే ఇప్పుడు ఎలాంటి శ్రమా లేకుండా, కూర్చున్న చోటే డబ్బులు కురుస్తున్నాయి.’ అన్నాడు.ఈ మాట రాజుగారికి ఎంతగానో నచ్చి, ‘భళా భళా’ అని గొప్పగా ప్రశంసించాడు. ఈసారి భటులు రైతుకు రెండువేల సంచిని బహూకరించారు!!ఒక వివేకవంతమైన మాట, సందర్భోచితమైన సమాధానం ఎంతటి ప్రభావాన్ని చూపిందో చూశారా..! దైవ విశ్వాసి అయిన రాజే ఇంతటి సేవాతత్పరుడైతే, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన అల్లాహ్‌ ఎంతటి కరుణామయుడో ఒక్కసారి ఊహించండి.
– ముహమ్మద్‌ ఉస్మాన్‌ ఖాన్‌  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top