ఏం... మగాళ్లం కాదా... | wife and husbend story family special callum | Sakshi
Sakshi News home page

ఏం... మగాళ్లం కాదా...

Published Mon, Dec 28 2015 6:50 AM | Last Updated on Fri, Jul 27 2018 2:26 PM

ఏం... మగాళ్లం కాదా... - Sakshi

 మా అమ్మ ముందే వెళ్లిపోయింది. వెళ్లిపోవాల్సి వచ్చింది అని అనాలి. కాని అన్నిసార్లూ ధైర్యం చేయలేము కదా. వాళ్లమ్మ మాత్రం మొన్నటి దాకా ఉంది.
 ‘ఎవరికి పట్టకపోయినా మా అమ్మకు పట్టక తప్పదు కదండీ. ఒక్కగానొక్క కూతుర్ని. మీరో తిక్కమేళం. తనుండీ అన్నీ చూసుకోకపోతే ఎలాగా’ అంది జుబ్బా గుండీ గోముగా తెంపేస్తూ.

 ఫ్యాబ్ ఇండియాలో మూడు జుబ్బాలు కొన్నాను ఆఫీస్‌లో లోన్ పెట్టి. పెళ్లి రోజుకని ఒకటి, ఆ రోజుకని ఒకటి, పదహారు రోజుల పండగకు ఒకటి. ఆల్రెడీ రెండింటి గుండీలు తెంపేసింది- గోముగా. ఇవాళ మూడోదీ తెంపింది- గోముగా. ఈ గోమును ఎవడు సృష్టించాడో.
 కొత్త కాపురం సెట్టయ్యాక అత్తగారు మాటలతో హితవు, కళ్లతో బెదిరింపూ, బాడీ లాంగ్వేజ్‌తో మా అమ్మాయిని ఏమైనా చేశావో అండమాన్ పంపిస్తా అనే సంస్కారవంతమైన వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోయాక తెల్లారింది. వడ, గారె, పులిహోర, గరిటెతో గుంట నొక్కగా అందులో సువాసనలీనే నెయ్యితో పొగలు గక్కే పొంగలి... వీటిని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉండగా గోముగా ఒక గావుకేక వినిపించింది... ‘హేమండీ... కాస్త బజారుకు వెళ్లి టిఫిన్ పట్రండీ’...

 ‘ఏం... ఏదైనా చేయకపోయావా?’
 ‘ఎక్కడండీ... సరుకులు సర్దుకోలేదు... సర్దులు సరుకుకోలేదు.... లేదులు సర్దుల్ని చేసి కొసరుకోలేదు’... ఇలా ఏదేదో చెప్పింది.
 అసలు మగాడు పెళ్లి చేసుకునేదే టిఫిను కోసమని నా ఉద్దేశం. టిఫిన్ సెంటర్ల వాళ్లకు ఆ మేరకు భారత మానవ వనరులశాఖ రుణపడి ఉండాలి. వాళ్లే గనక ఏ టిఫిన్‌నైనా ఒకేలా చేయడం మానేసినా, ఒకేలాంటి టిఫిన్‌ని అనేక పదార్థాలుగా నమ్మించడం వదిలేసినా ఎవడూ పెళ్లి చేసుకోడు. పిల్లల్ని కనడు.  ఇక జనాభాని జైజవాన్ జైకిసాన్ జైపరేషాన్‌గా మార్చేదెక్కడ? పంచ్ డైలాగుల కంటే పరమ నాసిరకమైన ఆ టిఫిన్‌ని కడుపు నిండా తినలేక, సగం కడుపుతో ఆఫీసుకు వెళ్లి, ఆ చిరాకులో బాస్‌ను ఏదో మాట అని, బాస్ అది కడుపులో పెట్టుకుని మంచి వేసంగిలో చీపురుపల్లికి ట్రాన్స్‌ఫర్ చేసి... అవసరమా అని పెళ్లి చేసుకుంటారు. తీరా జరిగేది ఇది.
 ఏదో దర్శినిలో ఆ పూటకు ‘వడ’ అనే రెండు బ్రౌన్ మార్బెల్స్‌ని, ‘పూరీ’ అనే రెండు టిన్నుల రిపీటెడ్‌లీ యూజ్డ్ నూనెనీ దర్శించాను.
 ఇది ఇవాళ్టికే అని భ్రమపడ్డాను.

 కృష్ణలీల.
 పెళ్లయ్యి ఎనిమిదేళ్లు.
 మొన్నే ‘బెస్ట్ సందర్శన్ అవార్డ్’ ఇచ్చి రెండు ప్లేట్ల మైసూరు బోండా కూడా కట్టిచ్చారు.
 ఈసురో- అన్నాను.
 ఓయ్- అని నాబోటి వందమంది బదులు పలికారు.
 బట్టలు మడత పెట్టడం ఒక కళ.
 పెట్టించడం ఉత్కళ.
 ‘కాస్త ఆ బట్టలు మడత పెట్టండి’...
 ‘నేనా?’
 ‘మీరైతే చాలా చక్కగా... అంచులు కలిసేలా... మనసులు మురిసేలా... మమతలు విరిసేలా’...
 అప్పట్నించి మా ఇంట్లో ఎన్ని బట్టలున్నాయో నాకు కంఠోపాఠం.
 మరోరోజు బాల్కనీలో పిలిచింది. బంతిపూలు పూసి కనిపించాయి.
 ‘ఇవి మీరు నాటిన మొక్కలేగా’
 ‘అవును’...
 ‘అందుకే మిమ్మల్ని చూసి నువ్వుతున్నాయి. భలే భలే... మీ చేయి చాలా మంచిది’ పొగుడుతూ సంబరంగా చప్పట్లు కొట్టింది.
 ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాటికి నేనే నీళ్లు పోస్తున్నాను.
 ఎలక్ట్రీషియన్ రోషానికి పోయాడు. షాక్ కొడుతోందని నిరూపిస్తే వృత్తి మానేసి ఉంగటూరు వెళ్లిపోతానని సవాలు విసిరాడు. మా వెర్రిదేమో... అమ్మో నాకు భయంగా ఉందండీ... అని గోముగా నా గుండీలు లాగడానికి చూసింది. ఉంటేగా? చాలా ఏళ్లుగా పిన్నీసులు పెట్టుకుని తిరుగుతున్నాను.
 ‘ఇప్పుడేమిటి చేయడం?’ అడిగాను.
 ‘మీరే చెప్పాలి’
 ఏం చెప్తాను? వాషింగ్ మిషన్‌లో రెండు చెమ్చాలు ఏరియల్ వేసి తెల్లటి తెలుపు కోసం అశ్రువొక్కటి ధారబోశాను.
 మా అమ్మ నన్ను మగవాడిగానే పెంచలేదు.

 నా హితం కోరే మనిషైతే చిన్నప్పుడు నేను వంటగదిలోకి ఎప్పుడు వెళ్లినా కసురుకునేదా? ఛీ... అనీ ఛా.. అనీ... నువ్వేమైనా ఆడపిల్లవా అస్తమానం వంట గదిలో దూరడానికి... అనీ తరిమేసేదా? ఆమె  గనక రానిచ్చి ఉంటే ఒక అన్నం నాలుగు కూరలు ఏవో రెండు తాలింపులు కాస్త చారు పెట్టడం నేర్పించి ఉంటే ఎంత బాగుండేది. ఎంత మగాడి బతుకు దక్కి ఉండేది.
 ‘ఇవాళ తలనొప్పిగా ఉందండి- సుకన్యా నుంచి సాంబారు తెచ్చుకోరాదూ’...
 ‘ఇవాళ నొప్పితల- ఐశ్వర్యా నుంచి ఏమైనా’...
 ‘ఇవాళ బొప్పి- భానుప్రియకు వెళ్లి’....

 సుకన్యా, ఐశ్వర్యా, భానుప్రియ... హు... పాండీబజారులో ఏ లాటరీలు కొట్టయినా వీళ్లనే చేసుకునుంటే పోయుండేది. ఈ ఇలవేల్పు అవసరం ఏముండేది?
 మా ఆవిడ బంగారం. నా తోడిదే లోకం. బాగా చూసుకుంటుంది. పిల్లల్ని ప్రాణం పెట్టి సాక్కుంటుంది. ఉద్యోగం చేసి- మంచి జీతమే కనుక- వేణ్ణీళ్లకు వేణ్ణీళ్లే తోడు చేస్తుంది. శబాసే. మరి ఈ షిఫ్ట్ సిస్టమ్ మాటేమిటి? ఎంతో గోముగా నా నెత్తి మీద ఇంటి పనులన్నీ పడేయడం ఏమిటి? మేం ఇలా ఉంటే లేజీ హజ్బెండ్స్ అని క్యాబేజీలా తరిగేస్తారు.  లేజీ వైవ్స్ ఉంటారని ఏ చానెల్ వాళ్లు బ్రేకింగ్ న్యూస్ ఇస్తారు?
 అంటే? ఉద్యోగం చేసి మళ్లీ ఇంటి పని కూడా చేయాలా?
 ఏం... మేం చేయట్లేదా? మాకు సమాన హక్కులు లేవా? మేం మనుషులం కామా? మేం మగవాళ్లం కామా?
 కాని ఈ గోడు వినేదెవరు?

 ‘ఇదిగో... మిమ్మల్నే’...
 ‘వచ్చే వచ్చే... ఏంటి కరివేపాకు తేవాలా?’
 - భా.బా (భార్యా బాధితుడు)
 గమనిక: చాలా మంది భా.బాలు మా అనుభవాలు రాస్తాం మా అనుభవాలు చెప్తాం అని వెంటపడుతున్నారు. కొందరైతే తమకో వాహిక దొరికిందని ఆనంద బాష్పాలు రాలుస్తున్నారు. నా ఏడుపయ్యాక మీ సంగతికి వద్దాం..!
 

Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement