మైట్రల్‌వాల్వ్ అంటే..? | What maitralvalv ..? | Sakshi
Sakshi News home page

మైట్రల్‌వాల్వ్ అంటే..?

Mar 25 2014 12:00 AM | Updated on Jul 10 2019 8:00 PM

మైట్రల్‌వాల్వ్ అంటే..? - Sakshi

మైట్రల్‌వాల్వ్ అంటే..?

ఆ దంపతులు రోజుల పిల్లాణ్ణి దత్తత తీసుకున్నారు. నిజానికి అతడో అనాథ. సందీప్ (పేరు మార్చాం) అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

ఆ దంపతులు రోజుల పిల్లాణ్ణి దత్తత తీసుకున్నారు. నిజానికి అతడో అనాథ. సందీప్ (పేరు మార్చాం) అని పేరు పెట్టుకొని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. ఆ చిన్నారి తమ పెద్దవయసులో ఆసరాగా ఉంటాడనుకుంటే తామే అతడి గుండెకు అండగా ఉండాల్సి వచ్చింది. కానీ ఆ దంపతులొకటి తలిస్తే దైవం వేరొకటి తలచాడు. స్నేహితులతో కలిసి ఆటలాడబోయాడు. కానీ ఊపిరాడలేదు. ఆట మాట ఎలా ఉన్నా... గట్టిగా నాలుగు అడుగులు వేస్తే కూడా ఆయాసం వస్తోంది.
 
చిన్నారికి తొమ్మిదేళ్ల వయసులో ఓ విషయం తెలిసి ఆ దంపతులు హతాశులయ్యారు. కారణం... ఆ చిన్నారికి గుండెజబ్బు. మైట్రల్‌వాల్వ్ అనే కీలకమైన అవయవం పూర్తిగా పనిచేయడం లేదు. తొమ్మిదేళ్ల  ఆ చిన్నారికి ఆపరేషన్ చేయడం ఎంతో రిస్క్. పైగా గుండె పనితీరు కేవలం 20 శాతం మాత్రమే. ఆ టైమ్‌లో సర్జరీ చేస్తే ఆపరేషన్ టేబుల్ మీద తొమ్మిదేళ్లకే నూరేళ్లూ నిండే అవకాశం చాలా ఎక్కువ.
 
ఎలాగైతేనేం ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆపరేషన్‌కు సిద్ధపడ్డారు. పైగా ఆ గుండెకు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ అండ కూడా ఉంది. ఆ పేద తల్లిదండ్రులపై ఆర్థికభారం పడకుండా మిగతా ఇతర ఖర్చులను ఆసుపత్రివారే భరించాలని నిర్ణయించుకున్నారు. ఎంతో రిస్క్ తీసుకుని ఆపరేషన్ టేబుల్‌పై చిన్నారిని పడుకోబెట్టారు. ఇక సందీప్ పడుకున్న ఆ  శయ్య... మృత్యుశయ్యగా మారుతుందా, లేక అమృతతల్పం అవుతుందా అన్నది అందరిలో నెలకొన్న సందేహం. ఇక అత్యంత సంక్లిష్టమైన ఆ ఆపరేషన్ మొదలైంది.
 
నిజానికి పెద్దవాళ్లలో గుండె పూర్తిగా తన గరిష్ఠ పరిమాణానికి పెరుగుతుంది కాబట్టి ఆ తరహా పెద్ద ఆపరేషన్ అంత ప్రమాదకారి కాదు. కానీ సందీప్‌ది పెరిగే వయసు. ఇప్పుడు మైట్రల్ వాల్వ్ మార్చినా... అతడు ఎదుగుతున్న కొద్దీ గుండె కూడా పెరుగుతూ పోతుంది. దాంతో అమర్చిన వాల్వ్ కాస్తా చిన్నదిగా మారుతుంది. ఇక ఎలాగైనా ప్రమాదం తప్పనప్పుడు రిస్క్ తీసుకుంటే తప్పేముంది. ఈ నిర్ణయమే ఒక సర్జరీ చేస్తున్న డాక్టర్ల బృందాన్ని ఒక లక్ష్యం వైపునకు నడిపించింది. అత్యంత సంక్లిష్టమైన ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యింది.
 
అవును... ఇప్పుడా చిన్నారి తన తల్లిదండ్రుల కళ్లల్లో వెలుగులు నింపేలా మెరుగుపడ్డాడు. సందీప్ దేదీప్యంగా ఆరోగ్యంగా ఎదిగేలా తెరిపిన పడ్డాడు. ఇక అతడు ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడ్డాడు. అమ్మతో మాటల్లో, స్నేహితులతో ఆటల్లో పడ్డాడు.
 
ఈ ఆపరేషన్ పూర్తయ్యాక, సందీప్ గురించిన ఆ శుభవార్తను అతడి తల్లికి చెబితే... ఆ అమ్మ కళ్లలో వెలిగిన దివ్వెలు ఇన్నాళ్లు గడిచాక కూడా డాక్టర్‌గా నన్ను ఆనందపరుస్తూనే ఉన్నాయి. మరోసారి ఫాలోఅప్‌కు వచ్చినప్పుడు సందీప్ అప్పటివరకూ అత్యంత కఠినమైన ఆటలను అనాయాసంగా ఆడి వచ్చాడు. డాక్టరు గదిలోకి పరుగులాంటి నడకతో సునాయసంగా మెట్లెక్కి వచ్చాడు. నేను డాక్టర్‌గా మైట్రల్‌వాల్వ్ మార్చాను. అది సందీప్ జీవితాన్ని మార్చింది. అన్నట్టు... నా దృష్టిలో ఇప్పుడు మైట్రల్‌వాల్వ్ అంటే ఏమిటో తెలుసా? మైట్రల్ వాల్వ్ అంటే ఆటలకోసం మిత్రులను సంపాదించే మైత్రీగవాక్షం. చిక్కటి రక్తంలా ప్రవహించే గాఢస్నేహ ప్రవాహ మార్గం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement