కోడలి క్వశ్చన్స్‌..మెగాస్టార్‌ ఆన్సర్స్‌

Upasana Special Interview With Chiranjeevi - Sakshi

ఇండస్ట్రీలో మెగాస్టార్‌ని ఎవరైనా క్వశ్చన్‌ చేస్తారా? ఆయన ఏది చేస్తే అదే రైట్‌. ఏది చెబితే అదే ఆన్సర్‌.  ఎప్పుడు చేస్తే అప్పుడే ట్రెండ్‌.. ఎలా చేస్తే అదే ఇన్‌స్పిరేషన్‌.మళ్లీ 20 ఏళ్ల బ్యాక్‌ లుక్‌తో చిరంజీవి ట్రెండ్‌ని చిరంజీవే మారుస్తున్నారు.అలాంటి మెగా మామగారిని కొణిదెలవారి కోడలు క్వశ్చన్లు అడిగితే? సైరా ఫ్యాన్స్‌... వెయ్యండి ఈలలు... కొట్టండి సిక్సర్లు!

ఉపాసన : ‘సైరా’లో మీరు ఎన్నో సాహసాలు చేశారు. గుర్రపు స్వారీ చేశారు. కోట పైనుంచి దూకారు. తీవ్రమైన కత్తి యుద్ధం సన్నివేశాలు చేశారు. ఇలా ఎన్నో ధైర్యసాహసాలను ప్రదర్శించారు. గాయాలు లేకుండా అలవోకగా చేయడం మీకెలా సాధ్యమైంది? 
చిరంజీవి : షూటింగ్‌ సమయంలో చాలా శారీరక శ్రమ, కష్టం సహజమే. అయితే నటనపై నాకున్న ఇష్టం ఆ ఒత్తిడిని అధిగమించేలా చేసేస్తుంది. స్ట్రెస్‌ అనే దాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వను. ఇంకో విషయం ఏంటంటే.. యాక్షన్‌ సీక్వెన్స్‌ చేస్తున్నప్పుడు నేనెప్పుడూ నా వయసు గురించి ఆలోచించను. ఇది చెయ్య గలుగుతానా? లేదా అని నా మీద నాకెప్పుడూ డౌట్‌ రాలేదు. సినిమా కోసం ఏదైనా చేయగలననే నమ్మకం నాకుంది. కత్తి యుద్ధం కావొచ్చు, గుర్రం పైకి దూకడం లాంటివి కావొచ్చు, వేరే ఏ రిస్క్‌ అయినా కావొచ్చు. సినిమా చూస్తున్నప్పుడు మేం ఎక్కడా డూప్‌ షాట్‌లు ఉపయోగించకుండా నేనే చేశానని మీకు అర్థం అవుతుంది. సాహసాలు చెయ్యటం అనేది మన మనసుకి సంబంధించిన విషయం. మనల్ని మనం ఎలా ప్రొజెక్ట్‌ చేసుకుంటాం అనేది మన మీదే ఆధారపడి ఉంటుంది. మీ మనసు బలంగా ఉంటే మీ ఆత్మవిశ్వాసాన్ని మీరెప్పుడూ కోల్పోరు.

ఉపాసన : యూత్‌ ఈ సినిమాని ఎందుకు చూడాలి అంటే ఏం చెబుతారు?
చిరంజీవి : ‘సైరా’ యువతకు చాలా ముఖ్యమైన సినిమా. ఈ రోజు మనందరం, మన దేశ స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని ఆస్వాదిస్తున్నామంటే దానికోసం మన పూర్వికులు ఎన్నో మూల్యాలను చెల్లించారు. త్యాగాలు చేశారు. అయితే వాటిని మనం నెమ్మదిగా మరచిపోతున్నాం. భావి తరాల కోసం, లక్షలాది మంది తమ ప్రాణాలు ఎలా కోల్పోయారో తెలుసుకుంటున్నప్పుడు ఉద్వేగానికి లోనవుతాం. వారి పోరాటం గురించి వింటున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, వారందరి పోరాటాలు, త్యాగాల ఫలమే అనే విషయాన్ని ‘సైరా’ మరోసారి గుర్తు చేస్తుంది. 

ఉపాసన : ఇంతటి ప్రతిష్టాత్మకమైన సినిమాలో నటించడం గురించి?
చిరంజీవి : ఓ మహోన్నతమైన సినిమాలో నటించినప్పుడు ఏ నటుడికైనా చాలా ఆనందంగా ఉంటుంది. సంతృప్తి మిగులుతుంది. ఆ తరం చేసిన అన్ని త్యాగాలను తిరిగి పరిచయం చేసుకోవడం చాలా ముఖ్యం. సినిమా చూశాక యువతరం దేశభక్తి పట్ల దృష్టి ఆకర్షితులైనా, తమ స్వేచ్ఛను గౌరవించుకోవాలన్న ఆలోచన కలిగినా ‘సైరా’ విజయవంతమైనట్టే. ఈ సినిమా కచ్చితంగా తరాల మధ్య వారధిలా వారి అంతరాన్ని తగ్గిస్తుంది. అక్టోబర్‌ 2వ తేదీన మహాత్మా గాంధీ 150వ జన్మదినం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయటం ఒక గొప్ప అనుభూతి. 

ఉపాసన : ఓకే.. మవయ్యా... మన ఇంటి గురించి మాట్లాడుకుందాం.. మన దైనందిన జీవితంలో ముఖ్యభాగమైన ‘చిరు దోసె’, ‘చిరు కాఫీ’ల వెనక ఉన్న రహస్యాలను మాతో పంచుకోగలరా? ముందు కాఫీ గురించి చెబుతారా?
చిరంజీవి : కాఫీకి సంబంధించిన క్రెడిట్‌ మొత్తం మీ అత్తమ్మ సురేఖదే (నవ్వుతూ). సురేఖ మద్రాస్‌లో ఉండేది కదా. మద్రాస్‌ అంటే రుచికరమైన ఫిల్టర్‌ కాఫీకి చాలా పాపులర్‌. సురేఖ డైలీ లైఫ్‌ ‘మంచి ఫిల్టర్‌ కాఫీ’తోనే మొదలవుతుంది. నిజానికి మొదట్లో నేను కాఫీని ఇష్టపడేవాడిని కాదు. కానీ ఆ తర్వాత సురేఖ మహిమ వల్ల కాఫీ ప్రేమికుడిని అయిపోయాను (నవ్వులు). మద్రాస్‌లో ఉన్నప్పుడు తను నీలగిరి నుంచి స్వయంగా ‘రోస్టెడ్‌ కాఫీ గింజ’లను తెప్పించేది. హైదరాబాద్‌ వచ్చిన తరువాత కూడా అక్కడి నుంచి తెప్పించి, ఆ కాఫీ పౌడర్‌నే వాడుతోంది, అందుకే మన ఇంటి కాఫీని అందరూ ఇష్టపడతారు.

ఉపాసన : ఇప్పుడు టేస్టీ టేస్టీ ‘చిరు దోసె’ గురించి కూడా చెబుతారా?
చిరంజీవి : కాఫీ క్రెడిట్‌ అయితే సురేఖదే కానీ దోసె క్రెడిట్‌ మొత్తం నాదే. ‘చిరు దోసె’ నా ఆవిష్కరణ అని గర్వంగా చెప్పగలను. ఒకసారి షూటింగ్‌ సందర్భంగా చిక్‌మగళూరులోని ఒక చిన్న హోటల్‌లో ఓ రకమైన దోసె తిన్నాను. అంత రుచికరమైన దోసెని అంతకుముందు ఎప్పుడూ తినలేదు. ఎలా తయారు చేశారో తెలుసుకుందామని ఆ హోటల్‌ సిబ్బందిని పంపి, హోటల్‌ యజమానితో ‘రెసిపీ’ (తయారు చేసే విధానం) చెప్పమని అడిగాను. అయితే అది తమ సంప్రదాయ వంటకం అన్నారు. రెసిపీ చెప్పడానికి ఇష్టపడలేదు. అయినా నేను ఎలాగైనా తెలుసుకోవాలనుకున్నాను.

ఇంటికెళ్లాక ఆ దోసె గురించి సురేఖకు చెప్పాను. ఎలాగైనా రెసిపీ కనిపెట్టాలని ఇద్దరం అనుకున్నాం. ప్రయోగాలు మొదలుపెట్టాం. ఏదైనా ట్రయల్‌ వేసేటప్పుడు తప్పులు జరుగుతాయి. ఆ తప్పుల నుంచి మనకు కావాల్సింది వస్తుంది. అలా మేం ప్రయత్నాలు మొదలుపెట్టాం. చివరికి రుచికరమైన దోసె తయారు చేశాం. విశేషం ఏంటంటే.. చిక్‌మంగళూరు దోసెకన్నా ఇది ఇంకా రుచిగా కుదిరింది. నూనె లేకుండా మెత్తని దోసెలు తయారు చేశాం. రుచికి రుచీ ఆరోగ్యానికి ఆరోగ్యం. చెన్నైలో ఉంటూ అప్పుడప్పుడూ ఇక్కడికొచ్చే కొందరు సినిమా స్టార్స్‌ ఆ దోసె తినడం కోసం మన ఇంటికి వస్తారు. ప్రభుదేవా, జయసుధ ఇలా.. నా దోసెను ఇష్టపడే స్టార్స్‌ చాలామంది ఉన్నారు.

ఉపాసన : చిక్‌మంగళూరులో హోటల్‌ యజమానిని రెసిపీ అడిగితే చెప్పలేదు. మరి.. మీ దోసె రెసిపీని ఎవరికైనా చెప్పారా?
చిరంజీవి : చట్నీస్‌ రెస్టారెంట్‌ ఓనర్‌ మన ఇంట్లో దోసె తిన్నారు. బాగా నచ్చడంతో తమ హోటల్‌ మెనూలో ఆ దోసె పెట్టుకోవచ్చా అని అడిగారు. హ్యాపీగా సరే అని, నా చెఫ్‌ని పంపి వారికి ఆ రెసిపీ తయారు చేయడానికి శిక్షణ ఇప్పించాను. వాళ్లు దానికి ‘చిరు దోసె’ అని పేరు పెట్టారు. దూరప్రాంతాల నుండి, విదేశాల నుండి వచ్చిన వారు కూడా ‘చిరు’ దోసెని ఇష్టంగా తింటారని తెలిసి నాకు చాలా ఆనందంగా ఉంటుంది.

ఉపాసన : అత్తమ్మలో ఇప్పటి స్త్రీలు నేర్చుకోవలసిన లక్షణాల గురించి? తల్లిగా, కుమార్తెగా, అత్తగా ఆమె గురించి మీ మాటల్లో...
చిరంజీవి : సురేఖ లాంటి చక్కని అవగాహన ఉన్న భార్యను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ‘స్వార్థం’ అనేది తనకు తెలియదు. ఇంటిల్లిపాదికీ ప్రేమను పంచడం మాత్రమే తనకు తెలుసు. ప్రేమను పంచడంలోనే తన ఆనందం చూసుకుంటుంది. ఒకప్పుడు నేను రోజుకి మూడు షిఫ్టులు షూటింగ్స్‌ చేస్తూ ఫ్యామిలీ టైమ్‌ని బాగా మిస్సయేవాడిని. అప్పుడు నా అమ్మానాన్నలను, తోడబుట్టినవాళ్లను తనే చూసుకునేది. అందరి అవసరాలు తెలుసుకుని, వాళ్లు సౌకర్యవంతంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునేది. వాళ్ల ఇష్టాలకు ఏ లోటూ రానివ్వలేదు. కుటుంబాన్ని సురేఖ ఎంత బాగా చూసుకుందో చెప్పడానికి ఒక్క చిన్న ఉదాహరణ చెబుతాను. మా నాన్నగారు తనని ఎప్పుడూ పేరుతో పిలిచేవారు కాదు.. ‘అమ్మా’ అని పిలిచేవారు. కోడలంటే ఆయనకు ఎంతో అభిమానం, గౌరవం ఉండేవి.

ఉపాసన : మరి... మీ అమ్మగారు మా అత్తమ్మతో ఎలా ఉండేవారు?
చిరంజీవి : (నవ్వుతూ). అమ్మకు సురేఖ అంటే చాలా ప్రేమ. నా తోడబుట్టినవాళ్లకైతే సురేఖ వదిన కన్నా ఎక్కువ. అందరూ సురేఖ సలహాలను పాటిస్తారు. ఇన్‌పుట్స్‌ తీసుకుంటారు. మా కూతుళ్లు సుస్మిత, శ్రీజలు కూడా తల్లి సూచనలు తీసుకుంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే కుటుంబం మొత్తానికి మీ అత్తమ్మ కేంద్రబిందువు.

ఉపాసన : మీ గురించి చెప్పండి.. అత్తమ్మ సలహాలు వింటారా? మీ సినిమాల గురించి ఆమె ఏమంటారు?
చిరంజీవి : నేను కచ్చితంగా సురేఖ సలహాలు వింటాను. నా సినిమాల గురించి మంచీ చెడూ రెండూ చెబుతుంది. మంచి విశ్లేషకురాలు. సినిమా చూశాక అందులోని సీన్స్‌ అన్నీ ‘అప్‌ టు ది మార్క్‌’ ఉన్నాయా? లేవా? అనే విషయం కూడా స్పష్టంగా చెబుతుంది. సురేఖ ఒక సూపర్‌ స్టార్‌ భార్య, గొప్ప తల్లి మాత్రమే కాదు.. అల్లు రామగలింగయ్య గారిలాంటి లెజెండ్‌ కుమార్తె. ఒక మహానటుడి కుమార్తె. నేను ఆమెను నా ‘స్టార్‌’ అని భావిస్తాను. 

ఉపాసన : ఫిట్‌నెస్‌ విషయంలో మీరు ఎవర్ని రోల్‌ మోడల్‌గా భావిస్తారు?
చిరంజీవి :ఫిట్‌నెస్‌ విషయంలో నాకు చాలామంది స్ఫూర్తి. ఫిట్‌గా ఉండటం అనేది ఒక మంచి అనుభూతి. నా చుట్టుపక్కల ఉండే వాళ్ల దగ్గర్నుంచి, నేను కలిసేవాళ్లు, చూసేవాళ్ల నుంచి ఇన్‌స్పైర్‌ అవుతుంటాను. హాలీవుడ్‌లో సిల్వెస్టర్‌ స్టలోన్, ఆర్నాల్డ్‌ స్క్వార్జేనెగ్గెర్‌లు నాకు స్ఫూర్తిదాయకం. బాలీవుడ్‌లో అమితాబ్‌ బచ్చన్‌గారి గురించి చెప్పాలంటే ఈ రోజుకీ ఆయన ఎంతో చలాకీగా వుంటారు. ఆయనలో కనిపించే ఉత్సాహం, ఆయన స్టామినాతో పోటీపడటం ఇప్పటి యువకులకి కూడా చాలా కష్టం. అలాగే నా చుట్టూ ఉండేవాళ్లలో టి. సుబ్బిరామిరెడ్డిగారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాలి. 76 ఏళ్ల వయసులో కూడా ఆయనకి ఉన్న చురుకుదనం, మానసిక ఉత్సాహం మెచ్చుకోదగ్గవి. అలాగే మురళీమోహన్‌ గారు ఎంతో దృఢంగా, ఆరోగ్యంగా వుంటారు. నేను వారందర్నీ గమనిస్తుంటాను. ఫిజికల్‌గా, మెంటల్‌గా వారి నుంచి నేర్చుకోదగ్గ విషయాలను నేర్చుకుంటుంటాను. ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఆచరిస్తుంటాను.  

కుటుంబంకలిసికట్టుగా ఉండాలంటే ఉపాసన ఏమంటున్నారంటే... 
కేవలం సంపాదన మాత్రమే కాకుండా మీ కుటుంబ విలువలను పెంచే విధంగా ఏం చేస్తున్నారు? 
ఉపాసన : కుటుంబాన్ని ఎప్పటికీ కలిసుండేలా చేసేందుకు నన్ను నేను ఎడ్యుకేట్‌ చేసుకుంటున్నాను. పర్సనల్‌గా, ఫ్రొఫెషనల్‌గా తాతయ్య అంచనాలను అందుకునేందుకు, వాటిని నిలబెట్టేందుకు కృషి చేస్తుంటాను. ఎడ్యుకేషన్, కష్టపడే తత్వం, అంకితభావం, ప్రేరణ, మన దేశానికి తిరిగివ్వాలి అనే ఆలోచనలతో ముందుకువెళుతున్నా.

మీ కుటుంబ వారసత్వాన్ని ఏర్పరచడం లేదా కాపాడటంలో మీ సహకారం ఎంత?
ఉపాసన : కుటుంబ విలువలకు నిజాయితీగా ఉండాలి. మారుతున్న కాలంతో పాటు ఫ్యామిలీ గోల్స్‌ ఎప్పటికప్పుడు కొత్తవి ఏర్పరచుకోవాలి. అభిప్రాయాలకు, సలహాలకు ఎప్పుడూ ఓపెన్‌గా ఉండాలి. ఫ్యామిలీ సక్సెస్‌ఫుల్‌గా, స్ట్రాంగ్‌గా ఉండటానికి మంచి అలవాట్లను ఆచరణలో పెట్టడం ముఖ్యం. చిన్న చిన్న ఫ్యామిలీ ఇష్యూల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుకునే వాతావరణం మన ఇంట్లో ఉండాలి. అంతే కానీ దాన్ని పక్కన పెడుతూ దాని వల్ల నెగటివిటీ పెరిగేలా చేయకూడదు. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలను ఎప్పుడూ మొగ్గలోనే తుంచేస్తూ అందరి మధ్య బంధాన్ని మరింత బలపరుస్తుండాలి. 

మీ కుటుంబంలో అతిముఖ్యమైన విలువలేంటి? మిగతావారితో అది ఎలా విభిన్నంగా ఉంటుంది? 
ఉపాసన : అనుభవం, అవగాహనలు తెచ్చే గౌరవం. బాధ్యత, ఆధ్యాత్మికత వల్ల వచ్చే వినయం. నిజాయితీ, పాజిటివిటీ ఏర్పరిచే విజయం. ప్రేమ, పట్టుదల మనల్ని నడిపించే ధైర్యం.. ఇవే మా కుటుంబంలో అతిముఖ్యమైన విలువలు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top