నిర్వీర్యులవుతున్న తెలుగు రాష్ట్రాల యువకులు | Two telugu states men's sperm count falling sharply | Sakshi
Sakshi News home page

వీర్యుడికి కౌంట్‌ డౌన్‌!

Oct 23 2017 1:18 PM | Updated on Aug 1 2018 2:29 PM

Two telugu states men's sperm count falling sharply - Sakshi

తెలుగు రాష్ట్రాల్లోని యువకులు నిర్వీర్యులవుతున్నారు.. ఆధునికి జీవన శైలి వారిలో వీర్యకణాల సంఖ్యను క్రమేణా తగ్గించేస్తోంది. ఫలితంగా వారు సంతాన భాగ్యానికి దూరమవుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ తాజా గణాంకాల ప్రకారం 2010లో 15శాతం మందిలో వీర్య కణాల తగ్గుదల కనిపించగా.. 2014లో అది 25 శాతానికి పెరిగింది. ప్రస్తుతం 40 శాతానికి చేరుకుంది. ఈ లెక్కన 2020 నాటికి యాబైశాతం మంది యువకుల్లో వీర్యకణాలు తగ్గే ప్రమాదం పొంచి ఉంది.    

విశాఖపట్నంలో ఉద్యోగం చేస్తున్న మురళీధర్‌కి పెళ్లై ఐదేళ్లు గడిచినా పిల్లల్లేరు. భార్యాభర్తలిద్దరూ డాక్టర్ని కలిశారు. వీర్య కణాల సంఖ్య బాగా తగ్గిపోవడమే దీనికి కారణమని డాక్టర్లు తేల్చారు. హైదరాబాద్‌లో ఉండే వెంకటేశ్‌కి, విజయవాడలో ఉన్నవిజయ్‌కూ ఇదే సమస్య.. ఏళ్లు గడుస్తున్నా సంతాన భాగ్యం కలగడం లేదు. ఈ సమస్య వీళ్ల ముగ్గురిదే కాదు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది యువకులు ఇదే సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. క్రమక్రమంగా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతున్నారు. ఫలితంగా సంతాన సాఫల్య కేంద్రాలు పెరుగుతున్నాయి. అన్ని ప్రధాన పట్టణాల్లోనూ టెస్ట్‌ట్యూబ్‌ బేబీ సెంటర్లు వెలుస్తున్నాయి.  మారుతున్న ఆహార పద్ధతులు, ధరించే దుస్తులు, వాడే వాహనం, సెల్‌ఫోన్, కంప్యూటర్లు యువకుల్లో సంతాన సామర్థ్యాన్ని దెబ్బతీస్తున్నాయి.

15 మిలియన్ల కంటే తగ్గకూడదు
ఆరోగ్యవంతమైన 70 కిలోల యువకుడి వీర్యంలో ప్రతి మిల్లీలీటర్‌కీ 39 మిలియన్ల శుక్రకణాలుంటాయి. ఈ సంఖ్య 15 మిలియన్ల కంటే తగ్గకూడదు. ఒక వేళ తగ్గితే ‘లో స్పెర్మ్‌ కౌంట్‌’ అంటారు. ఈ లక్షణాలున్న యువకుడికి త్వరగా పిల్లలు పుట్టే అవకాశం ఉండదు. స్పెర్మ్‌ ఎనాలసిస్, స్కోట్రల్‌ అల్ట్రా సౌండ్‌ పరీక్షలతో ఈ సమస్యను వైద్యులు గుర్తిస్తారు. ఈ మధ్యకాలంలో ఖాసా పరీక్ష ద్వారా కూడా స్పెర్మ్‌ కౌంట్‌ను గుర్తిస్తున్నారు. సాధారణంగా మనిషి శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్‌ ఉంటుంది. వృషణాల (బీజాలు)కు ఇంతకన్నా ఒకట్రెండు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉండాలి. ఒకవేళ ఏదేని కారణంతో బీజాల దగ్గర వేడి పెరిగితే అందులో ఉండే శుక్రకణాల సంఖ్య తగ్గడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

వీర్య కణాలు ఎవరికి తగ్గుతాయంటే..

  •     స్థూలకాయులు.. ఆల్కహాల్‌ తీసుకునే వారు
  •     పొగ తాగడంతోపాటు, పొగాకు ఉత్పత్తులు తీసుకునేవారు
  •     ఆవేశపూరిత ఒత్తిడి ఉన్నవారు
  •     మందులు ఎక్కువగా తీసుకునేవారు
  •     పోషక విలువలు సమపాళ్లలో లేనటువంటి పిజ్జాలు, బర్గర్లు తినేవారు..
  • మాంసాహార పదార్థాలతో తయారైన జంక్‌ ఫుడ్‌ తీసుకునే వారు.
  •     హార్మోన్లలోపం, జెనెటిక్‌ సమస్యలున్నవారు
  •     ల్యాప్‌టాప్, కంప్యూటర్ల దగ్గర గంటలకొద్దీ పనిచేసేవారి బీజాలు రేడియేషన్‌కు గురై  వీర్య కణాలను కోల్పోతున్నాయి.
  •     స్కిన్‌టైట్‌ జీన్స్, నైలాన్‌ అండర్‌వేర్స్‌ వాడే యువకుల్లోనూ గాలి చొరబడక శుక్రకణాలు తగ్గుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
  •     గాయాలు తగిలినప్పుడు సరైన వైద్యం అందించకపోవడంతో రక్తం గడ్డకట్టడం వల్ల వీర్యకణాలు తగ్గిపోతాయి
  •     బీజం వాపు, ఇన్‌ఫెక్షన్, బీజకోశాలు లేకపోవడం, ఉన్నా అవి కడుపులోపలికి వెళ్లిపోవడం
  •     కొన్ని రకాల బీపీ, యాంటీ బయాటిక్స్‌ డ్రగ్స్,
  •     సైకియాట్రిక్‌ డ్రగ్స్‌తో పాటు.. రాన్‌టాక్, జిన్‌టాక్‌ వంటి మాత్రల వాడకం
  •     రైలు, బస్సు, ఇతర వాహనాల డ్రైవర్లు ఇంజిన్‌ దగ్గర కూర్చోవడం వల్ల బీజాలు వేడికి గురవుతున్నాయి.
  •     బీజాల వద్ద నరాల వాపుకారణంగా కణాలు తగ్గిపోతుంటాయి.  

     

యువకులు బిడియాన్ని వీడాలి
యువకులు ఆహారం, దుస్తుల విషయంలోనే కాకుండా అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్మోకింగ్, ఆల్కాహాల్‌ వాడకం పెరిగిపోయింది. చిన్న వయస్సులోనే స్థూలకాయం వస్తోంది. దీనివల్ల రక్తప్రసరణ సరిగా లేక వీర్యకణాల సంఖ్య పడిపోతోంది. వైద్యుల సలహాలు తీసుకుని జాగత్తలు పాటిస్తే సమస్య నుంచి బయటపడొచ్చు. కానీ చాలామంది బిడియంతో వైద్యుల్ని కలవడం లేదు. –  డాక్టర్‌ సిపాయి సుబ్రమణ్యం, ప్రముఖ యూరాలజిస్ట్, రష్‌ ఆస్పత్రి, తిరుపతి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement