శిక్షణలా ఉండాలి... శిక్షలా కాదు

శిక్షణలా ఉండాలి... శిక్షలా కాదు


ఆత్మీయం



ఆదివారం అయిపోయి, సోమవారం వచ్చిందనగానే చాలామంది స్కూలు పిల్లల్లో ఏదో బెంగ వచ్చేస్తుంది. మొహాలు దిగులుగా పెట్టి, వీపుమీద బండెడు పుస్తకాల సంచీలను పెట్టుకుని, భారంగా అడుగులు వేస్తూ స్కూలువు వెళుతుంటారు. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా పాఠశాలల్లో చాలా మంది ఉపాధ్యాయులు చేసే పొరపాటు ఏమిటంటే పిల్లలను ఆటపాటలకు దూరం చేస్తూ వారిని కేవలం పుస్తకాల పురుగుల్లాగా, మార్కులు తెచ్చుకునే మిషన్లలాగా, ర్యాంకులు సంపాదించే యంత్రాల్లాగా తయారు చేయడం. అది చాలా తప్పు. పిల్లలకు చదువుతోపాటు ఆటపాటలు కూడా అవసరమని గ్రహించి, వారిని ఆ దిశగా ప్రోత్సహించాలి. సంగీతం, చిత్రలేఖనం కూడా నేర్పించాలి. అలాగే కమ్మటి కథలు చెప్పాలి. వారి చేత చదివించాలి.



వారిని స్వంతగా కల్పించి చెప్పమనాలి. అప్పుడే వారిలోని సృజనాత్మకత పెరుగుతుంది. పిల్లల తరగతి స్థాయిని బట్టి విజ్ఞాన, విహార యాత్రలకు తీసుకువెళుతుండాలి. ఎందుకంటే పిల్లల్లో సృజనాత్మకత అనేది ప్రకృతిని, పరిసరాలను పరిశీలించినప్పుడే వారికి అలవడుతుంది. అది భవిష్యత్తులో వారి అధ్యయనాన్ని పెంచుతుంది. అయితే ఈ యాత్రలను కేవలం వినోదం, విరామం కోసమే కాకుండా పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించేలా, దానితో మమేకమై కొత్త విషయాలు తెలుసుకొనేలా చూడాలి.



ఈ క్రమంలో వారికి వచ్చే సందేహాలకు, అడిగే ప్రశ్నలకు కోపగించుకోకుండా, విసుక్కోకుండా జవాబివ్వాలి. అదేవిధంగా పిల్లలను దండించే  పద్ధతి వారిని మంచి మార్గంలో పెట్టేదిగా ఉండాలి కాని భయపెట్టి, బడి అంటే పారిపోయేటట్లుగా చేయకూడదు. మనం రోజూ వార్తాపత్రికల్లో చదువుతున్నట్లుగా వాళ్లని క్రూరమైన పద్ధతులతో శిక్షించడం, మనసు గాయపడేటట్లు ప్రవర్తించడం చేయనే కూడదు. పొగరుబోతు పోట్లగిత్తకు ముకుతాడు వేసినట్లుగా ఉండాలి. అల్లరి మానిపించి, బుద్ధిగా చదివించేటట్లు ఉండాలి. క్రమశిక్షణలో పెట్టాలి కాని అక్రమపూరితమైన శిక్షలా ఉండకూడదు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top