కోకిల గీతం... తుమ్మెద రాగం

Traditions, attire, music are all different - Sakshi

అన్వేషణ

‘అన్వేషణ’ సినిమాలో భానుప్రియ, కార్తీక్‌ లాంటివాళ్లు.. అక్షిత, పీయూష్‌! ఆ సినిమాలో భానుప్రియ చెట్టూ పుట్టా తిరిగి శ్రావ్యమైన శబ్దాలను అన్వేషిస్తూ ఉంటే, కార్తీక్‌ ఆమెకు హెల్ప్‌ చేస్తుంటాడు. ఇక్కడా అంతే. అక్షితకు ఆమె భర్త పీయూష్‌ పరిశోధన సహకారం అందిస్తున్నారు. ఈ దంపతులకు వినాయక్‌ అనే మరో ప్రకృతి ప్రేమికుడు కూడా తోడయ్యాక.. అంతరించిపోతున్న గిరిజన గీతాలన్నీ ఒకటొకటిగా మళ్లీ ప్రాణం పోసుకుంటున్నాయి. 

భారతదేశంలో కొన్ని వేల గిరిజన జాతులు ఉన్నాయి. వారి సంప్రదాయాలు, వేషధారణ, సంగీతం అన్నీ వేటికవే ప్రత్యేకం. అటువంటి జాతులలో కొన్ని జాతులు రానురాను అంతరించిపోతున్నాయి. వాటికి సంబంధించిన సమాచారాన్ని  ఎవరో ఒకరు జాగ్రత్త చేయకపోతే, కొంతకాలానికి ఈ జాతుల గురించి ప్రపంచానికి తెలిసే అవకాశం ఉండదనే ఉద్దేశంతో పీయూష్‌ గోస్వామి, అక్షిత దంపతులు ‘ది పార్‌గాటెన్‌ సాంగ్స్‌’ అనే ఒక ప్రణాళిక రూపొందించారు! 

బియాట్‌ పాట ‘బీట్‌’ ఆగింది!
పీయూష్, అక్షిత దంపతులు నిరంతరం ప్రయాణిస్తూనే ఉంటారు. అలా ఒకసారి అస్సాంలోని డిమో హసావ్‌ జిల్లాను సందర్శించారు. అక్కడ ‘ఎపా లల్లురా’ అనే బియాట్‌ గిరిజన తెగ నాయకుడిని కలిశారు.ఆయనతో మాట్లాడుతూండగా ఆ తెగ వారి సంగీతం కాలగర్భంలో కలిసిపోతోందన్న బాధ ఆ నాయకుడి ముఖంలో కనిపించింది. వారు బియాట్‌ భాషతో పాటుగా యాసతో కూడిన హిందీ, బెంగాలీ, అస్సామీ, థింసా భాషలు, నాగాలాండ్‌లోని మాండలికాలు మాట్లాడగలరని లల్లూరా మాటల నుంచి తెలుసుకున్నారు. వారి భాష కేవలం మౌఖికంగా మాత్రమే మిగిలే స్థితికి వచ్చింది. వారిలోని కొత్తతరానికి.. బియాట్‌ భాష రాకపోవడం వల్ల సంప్రదాయ సంగీతానికి కాలం చెల్లుతోందని ఈ దంపతులకు లల్లూరా చెప్పారు. బియాట్‌ జాతి వారు ఈశాన్య భారతంలో ఉంటారు. వీరు చైనా నుంచి ఇక్కడకు వలస వచ్చినట్లుగా భావిస్తారు. అక్కడ వారు మైనారిటీలే అయినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం ఇంకా గుర్తించలేదు. ఈ విషయం గోస్వామి దంపతులను కదిలించింది. వీరు అప్పటికే ‘రెస్ట్‌ ఆఫ్‌ మై ఫ్యామిలీ’ (ఈ ఊరు, ఈ నేల) అనే ఒక లాభాపేక్ష లేని సంస్థను స్థాపించారు. గ్రామీణ ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక, ఆర్థిక సమస్యలను తెలుసుకుని, పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నారు. లల్లూరా మాటలు విన్నాక ‘‘ఏదో ఒకటి చేద్దాం’’ అన్నారు గోస్వామి. 

ఎక్కడ దొరికితే అక్కడ 
2018 లో ఈ దంపతులు గిరిజన సంప్రదాయ గీతాల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఎక్కడ బియాట్‌ పాటలు దొరికితే అక్కడ, ఎవరు పాడుతుంటే వారివి అక్కడికక్కడే రికార్డు చేయడం మొదలుపెట్టారు.ఈ జాతి వారికి సంబంధించి తాము సేకరించినవాటిని ఒక డాక్యుమెంటరీ సినిమాగా రూపొందించారు. ‘ద ఫర్‌గాటెన్‌ సాంగ్స్‌’ అని పేరు పెట్టి ఈ ఏడాది జనవరి 8వ తేదీన విడుదల చేశారు. గోస్వామి దంపతులతో గ్రామీణ కళాకారులు చాలామంది ప్రయాణిస్తున్నారు. దారిలో వారు వింటున్న కొత్త కొత్త శబ్దాలను, కథలను రికార్డు చేస్తూ, పాటలకు జోడిస్తున్నారు. అలాగే ఆయా జాతుల వారు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. గిరిజనుల జానపదాలను షార్ట్‌ ఫిల్మ్‌లుగా తీసి, ఆడియో రిలీజ్‌లు కూడా పెడుతున్నారు.

సంగీత శంఖంలో కథల తీర్థం
చెన్నైలో నివసిస్తున్న వినాయక్‌ అనే మరో యువకుడు గోస్వామి దంపతులతో కలిసి, వారు చేపట్టిన  ప్రాజెక్టును విజయవంతంగా నడుపుతున్నారు. ప్రకృతిలో ఉండే శబ్దాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కలిపి, జానపదులకు సంబంధించిన కథలను సంగీతం ద్వారా చెబితే అందరికీ త్వరగా చేరుతుందని, సమాజంలో అందరికీ అవేర్‌నెస్‌ కలుగుతుందని భావించాడు వినాయక్‌. 

బియాట్‌ తర్వాత.. బోండా, బస్తర్‌ 
కనుమరుగైపోతున్న సంస్కృతిని కాపాడటం కోసం లల్లూరా పాడుతున్న పాటలను ఒకచోట  పొందుపరచడం కోసం గోస్వామి, వినాయక్‌లు అడవుల్లో అడుగులు వేస్తున్నారు. భయంకరమైన రోడ్ల మీద ప్రేమగా ప్రయాణిస్తున్నారు. వినాయక్‌కి వారి గురించిన విశేషాలు అర్థమయ్యాక, పాటలు, వివిధ శబ్దాలను సేకరించారు. అనేకమంది గాయకులను కలుసుకుంటున్నారు. బియాట్‌  సంప్రదాయ గీతాలను ఎపా లల్లూరా, ఎపా రొయిలియానాలు పాడుతుండగా వినాయక్‌ రికార్డు చేస్తున్నారు. ఇక్కడ పని పూర్తయ్యాక, ఒరిస్సాకు చెందిన బోండా జాతివారి గురించి, బస్తర్‌లో ఉన్న గోండు జాతి గురించి పరిశోధన చేయనున్నారు.
– జయంతి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top