క్షమించుకుందాం రా! | Today is the Day of the forgiveness | Sakshi
Sakshi News home page

క్షమించుకుందాం రా!

Jul 6 2014 11:02 PM | Updated on Sep 2 2017 9:54 AM

క్షమించుకుందాం రా!

క్షమించుకుందాం రా!

సరిగ్గా 2014 యేళ్ల క్రితం... రాతి కట్టడాల నడుమ రోమ్ నగరంలోని దారుల మీద అక్కడక్కడా రక్తపు చారల ఆనవాళ్లు. తమకు అతి దగ్గరగా ఉన్న ‘వ్యక్తి’ని అరాచకంగా చంపేశారని కొందరు ఏడుస్తున్నారు.

నేడు ప్రపంచ క్షమా దినం
 
సరిగ్గా 2014 యేళ్ల క్రితం... రాతి కట్టడాల నడుమ రోమ్ నగరంలోని దారుల మీద అక్కడక్కడా రక్తపు చారల ఆనవాళ్లు. తమకు అతి దగ్గరగా ఉన్న ‘వ్యక్తి’ని అరాచకంగా చంపేశారని కొందరు ఏడుస్తున్నారు. ‘‘తప్పు చేశామా?’’... ఇనుప కవచాల వెనుక ఉన్న కరకు గుండెల్లో అపరాధభావం మొలకెత్తసాగింది. మూడు రోజులుగా నగరంలో ఈ పెనుగులాట జరుగుతుండగా... ఊహకందని విధంగా చావుని చీల్చుకుని వారి మధ్యకు వచ్చాడు ఆ వ్యక్తి ‘క్షమించడానికి’! ఆ ఒక్క క్షమాపణ... ఆ వ్యక్తిని దేవుణ్ని చేసింది. ఆ ఒక్క క్షమాపణ... ఒక కొత్త శకానికి నాంది పలికింది.
 
మనం చేసిన పనిని తనదని చెప్పి క్రెడిట్ కొట్టేసే పై ఆఫీసర్ ఇంకా పెకైదుగుతాడు. అర్ధ రూపాయికే ఆకాశాన్ని నేలకు దింపి, అక్కడ నీకు ఇల్లిప్పిస్తానని ఎన్నికలప్పుడు వాగ్దానం చేసిన నాయకుడు... తీరా ఎన్నికలయ్యాక వెండికంచంలో బంగారాన్ని భోంచేస్తూ మొండి చేయి చూపిస్తాడు.

నిన్నే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి, నువ్విచ్చిన కాస్ట్‌లీ గిఫ్టును చక్కగా తీసుకుని, మర్నాడు సెంటీమీటరు మందమున్న పెళ్లికార్డును చేతిలో పెట్టి... ‘మా ఇంట్లో నాకు తెలీకుండా పెళ్లి కుదిర్చేశారు, చేసుకోకపోతే చచ్చిపోతామంటున్నారు, అందుకే చేసుకోక తప్పడం లేదు’ అని చెప్పేసి చేతులు దులుపుకుంటారు. వీరందరి మీద పగ.. కోపం.. ఉద్రేకం. దాచుకోవడమెందు? పగ తీర్చేసుకోండి. మనసు అనే గన్ తీసుకుని, క్షమాపణ అనే బుల్లెట్‌ని వారి గుండెల్లోకి దింపండి.

బిక్కచచ్చిపోతారు దెబ్బకి. మీరు చూపించే దయకి, ఒక్కసారిగా వణుకు పుడుతుంది వారికి.  ‘వాడిని క్షమించు. అంతకు మించిన శిక్ష ప్రపంచంలో మరేదీ లేదు’ అంటాడు ఆస్కార్ వైల్డ్. నిజమే. క్షణికావేశంలో నీ కోపం బయటపడితే, క్షమాపణ నీ క్యారెక్టర్‌ని బయటకు తెస్తుంది. క్షమాపణ ఓ మందులాంటిది. అది అవతలివాడిలోని అపరాధభావంతో కలిసి ఒక కెమికల్ రియాక్షన్ జరిగినట్టు వాడిలోని క్రూరత్వాన్ని నశింపజేసి, మంచితనాన్ని బయటకు తెస్తుంది.

ఉదాహరణల కోసం వెతక్కండి. మీరే ఉదాహరణగా నిలవండి. మిమ్మల్ని తిట్టినా, కొట్టినా, అష్టకష్టాలు పెట్టినా క్షమించి చూడండి. కృష్ణుణ్ని కర్ణుడు క్షమించినట్టు, బిడ్డని తండ్రి క్షమించినట్టు, ప్రకృతి మనుషుల్ని క్షమించినట్టు, మీకు చేయిచ్చిన వారందరినీ చెయ్యెత్తి క్షమించండి... చెంపదెబ్బ కన్నా గట్టిగా తగులుతుంది. మిమ్మల్ని వద్దనుకున్నవారిని కూడా మీకు మరింత దగ్గర చేస్తుంది!
 
- జాయ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement