అలర్జిక్‌ రైనైటిస్‌కు చికిత్స ఉందా?

there treatment for allergic rhinitis? - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

నా వయసు 29 ఏళ్లు. చాలాకాలంగా చల్లగాలి, దుమ్ముధూళి సోకిన వెంటనే ముక్కుకారడం, వెంటనే తుమ్ములు ఎక్కువగా రావడం జరుగుతోంది. కళ్లలో దురద, నీరుకారడం వంటి సమస్యలతో బాధపడుతన్నాను. డాక్టర్‌ను సంప్రదించాను. అలర్జిక్‌ రైనైటిస్‌ అన్నారు. మందులు వాడినా ప్రయోజనం కనిపించడం లేదు. హోమియోలో  శాశ్వత చికిత్స ఉందా?  – వినయ్‌కుమార్, నెల్లూరు 
అలర్జిక్‌ రైనైటిస్‌తో బాధపడే వారి పరిస్థితిని వాతావరణంలో మార్పులు, చల్లగాలి, దుమ్ముధూళి, ఇతర వాతావరణ కాలుష్యం వంటి సమస్యలు మరింత దుర్భరం చేస్తాయి. ఈ సమస్య ఉన్నవారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తరచూ దీని  బారిన పడుతూనే ఉంటారు. మనకు సరిపడని పదార్థాలు శ్వాస ద్వారా శరీరంలోకి ప్రవేశించినప్పుడు ముక్కులోని శ్లేష్మం పొర వాపునకు గురవుతుంది. ఇలా ఈ పొరలు వాపునకు గురికావడాన్ని అలర్జిక్‌ రైనైటిస్‌ అంటారు. 

కారణాలు : ∙అలర్జీని కలిగించే పదార్థాలు మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక వ్యవస్థ సాధారణ స్థాయికి మించి ప్రతిక్రియ జరుపుతుంది. దాని వల్ల అలర్జిక్‌ రైనైటిస్‌ సమస్య వస్తుంది. ∙పూలమొక్కల నుంచి వెలువడే పుప్పొడి రేణువులు ఈ సమస్యకకు ప్రధానమైన కారణం ∙దుమ్ము ధూళి జంతుకేశాలు, బూజు, కుటుంబ చరిత్ర వంటి అంశాలు ఈ సమస్యకు ఇతర కారణాలు ∙పొగతాగే అలవాటు, కొన్ని రసాయనాలు, వాతావరణంలోని కాలుష్యాలు, సుగంధద్రవ్యాల వంటివి అలర్జిక్‌ రైనైటిస్‌ సమస్యను ప్రేరేపిస్తాయి. లక్షణాలు : ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, విపరీతంగా తుమ్ములు, ముక్కులో అంగిలిలో దురద, కళ్ల నుంచి నీరుకారడం, కళ్లు దురదగా ఉండటం, ముఖంలో వాపు, దగ్గు, తరచూ తలనొప్పి, నీరసం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. చికిత్స :  జెనెటిక్‌ కన్‌స్టిట్యూషన్‌ పద్ధతిలో అందించే ఈ చికిత్సలో రోగి శారీరక, మానసిక లక్షణాలను, శరీర తత్వాన్ని పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. రోగనిరోధక వ్యవస్థలలో గల అసమతౌల్యతను సరిచేయడం ద్వారా అలర్జిక్‌ రైనైటిస్‌ సమస్యను మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయడం సాధ్యమవుతుంది. 
డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌
సీఎండీ, హోమియోకేర్‌ 
ఇంటర్నేషనల్, హైదరాబాద్‌

కాలు తిమ్మిరి, లాగుతోంది... ఎందుకిలా? 
నా వయసు 52 ఏళ్లు. ఈమధ్య ఒక కాలు తిమ్మిరిగా ఉంటోంది. కాలు లాగుతోంది. ఎక్స్‌–రే తీయిస్తే డిస్క్‌ ప్రాబ్లమ్‌ అన్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా?  – రమణారావు, నిడదవోలు 
మన శరీరంలో వెన్నెముక నిర్మాణం చాలా విశిష్టంగా, సంక్లిష్టంగా ఉంటుంది. మన దైనందిన జీవితంలో శారీరకంగా ఎదురయ్యే ఎన్నో ఒత్తిడులను తట్టుకొని నరాల మీద ఏ విధమైన ఒత్తిడీ పడకుండా కాపాడుకోవడం ఈ వెన్నెముక ప్రధాన లక్షణం. దీనికి వెన్నునొప్పితో డిస్క్‌ సమస్యలు, స్పాండిలోసిస్, కణుతులు, స్కోలియోసిస్, ట్యూమర్స్, సయాటికా సమస్యలు ఎక్కువగా ఉంటాయి. మన శరీర వ్యవస్థలో వెన్నెముక మూలస్తంభం మాదిరిగా పనిచేస్తుంది. వెన్నెముకకు తోడుగా కండరాలు, లిగమెంట్లు, డిస్క్‌లు పనిచేస్తాయి. వెన్నెముక సులభంగా వంగడానికి డిస్క్‌లు,  లిగమెంట్లు తోడ్పడతాయి. వెన్నుపూసల మధ్య రబ్బరు కుదురులాంటి పదార్థం ఉంటుంది. దాన్ని డిస్క్‌ అంటారు. సాధారణంగా డిస్క్‌ సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి డిస్క్‌ ప్రొలాప్స్, రెండు డీజనరేటివ్‌ డిస్క్‌ డిసీజ్‌. డిస్క్‌కు బయట ఉన్న పొర బలహీనమవడం వల్ల డిస్క్‌ పక్కకు జరుగుతుంది. దాంతో అది వెన్నుపాము నుంచి బయటకు వచ్చే నరాలపై ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల కాళ్లలో తిమ్మిర్లు, మొద్దుబారినట్లు ఉండటం జరుగుతుంది. దీన్ని స్లిప్‌ డిస్క్‌ అంటారు. ఒక్కోసారి డిస్క్‌ పొర చిట్లి జెల్లీ లాంటి ద్రవం (డిస్క్‌ మెటీరియల్‌) కూడా బయటికి రావచ్చు. కాలును వంచకుండా తిన్నగా ఉంచి, పైకి ఎత్తినప్పుడు కాలిలో నొప్పి పెరిగితే అది ‘డిస్క్‌ ప్రొలాప్స్‌’ అనే సమస్య వల్ల కావచ్చు. 

మీ సమస్యకు సాధారణ కారణాలు : ∙అధిక బరువు, శక్తి  మించిన బరువులు ఎత్తడం ∙ఎక్కువ దూరం పరుగెత్తడం ∙రోజంతా వంగి పనిచేయడం ∙వెన్నెముకకు దెబ్బ తలగడం ∙బైక్‌ ఎక్కువగా నడపడం. లక్షణాలు : ∙నడుమునొప్పి ∙తిమ్మిర్లు ∙స్పర్శ తగ్గడం ∙వంగినా లేచినా నొప్పి ఎక్కువ కావడం ∙అరికాళ్లలో మంటలు. వ్యాధి నిర్ధారణ : సీటీ స్కాన్, ఎమ్మారై, ఎక్స్‌రే, సీబీపీ చికిత్స: మీ సమస్యకు హైపరికం, కాల్కేరియా ఫ్లోర్, బ్రయోనియా ఆల్బ్, సిమిసిఫ్యూగా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని అనుభవజ్ఞులైన హోమియో డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. 
డాక్టర్‌ మురళి కె. అంకిరెడ్డి, 
ఎండీ (హోమియో) స్టార్‌ హోమియోపతి, హైదరాబాద్‌ 

ఒళ్లంతా తెల్లమచ్చలు... తగ్గుతాయా? 
నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. డాక్టర్‌ను సంప్రదిస్తే బొల్లి అని చెప్పారు. వీటితో నలుగురిలో వెళ్లడానికి ఇబ్బందిగా ఉంది. ఈ సమస్య ఎందుకు వస్తుంది?  హోమియో మందులతో తగ్గుతుందా?
– నాగాంజనేయులు, మార్కాపురం 

చర్మంలో రంగునిచ్చే మెలనోసైట్స్‌ అనే కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్‌ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్‌’ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైమ్‌ అనేక కారణాల వల్ల క్షీణిస్తుంది. ఫలితంగా మెలనిన్‌ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంంది. ఈ టైరోసినేజ్‌ అనే ఎంజైమ్‌ తగ్గుదలకు ఈ కింది పరిస్థితులు కారణం కావచ్చు. 

కారణాలు : ∙దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి ∙కొన్నిసార్లు కాలిన గాయాలు ∙పోషకాహారలోపం ∙జన్యుపరమైన కారణాలు ∙దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్‌ సమస్యలు ∙మందులు, రసాయనాలు ∙కొన్ని ఎండోక్రైన్‌ గ్రంథులు స్రవించే హర్మోన్‌లలో లోపాలు ∙వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం లేదా మన సొంత వ్యాధి నిరోధక కణాలు మనపైనే దాడి చేయడం వంటి అంశాలు బొల్లి వ్యాధి వచ్చేందుకు కొన్ని కారణాలు. 

లక్షణాలు : మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాళ్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. 

చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ఇందుకు దీర్ఘకాలిక చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. మానసికంగా, శారీరకంగా రోగిని పూర్తి స్థాయిలో అవగాహన చేసుకున్న తర్వాత వ్యాధికి అవసరమైన కాన్‌స్టిట్యూషనల్‌ మెడిసిన్‌ను ఇస్తారు. తూజా, నైట్రిక్‌ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్‌ ఆల్బమ్, లాపిస్‌ అల్బా, రస్టాక్స్‌ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు.

డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్, డైరెక్టర్, పాజిటివ్‌ హోమియోపతి, విజయవాడ, వైజాగ్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top