రక్త ప్రసరణకు శీర్షాసనం | Sakshi
Sakshi News home page

రక్త ప్రసరణకు శీర్షాసనం

Published Wed, Jul 20 2016 11:52 PM

రక్త ప్రసరణకు శీర్షాసనం - Sakshi

లైఫ్
 
రక్తాన్ని గుండెకు చేర్చడానికి రక్తశుద్ధి జరగడానికిఈ ఆసనం చాలా మంచిది.   మనసుకి మంచి ఏకాగ్రతను అలవాటు చేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి ఒత్తిడి నుంచి దూరంగా ఉండటానికి లేదా ఉపశమించడానికి చాలా ఉపయోగకరమైనది ఈ ఆసనం.     
 
ఆసనాలన్నింటిలోకి ముఖ్యమైనది శీర్షాసనం. తలక్రిందులుగా చేసే ఆసనాలలో ఇది అత్యంత ప్రధానమైనది. ముందుగా మోకాళ్లు మడచి సీటు భాగం వెనుక పాదాల మీద ఆనేటట్లుగా వజ్రాసనంలో కూర్చోవాలి. తర్వాత శరీరాన్ని ముందుకు వంచుతూ మార్జాలాసనంలోకి వచ్చి (రెండు చేతులు మోకాళ్ల మీద వంగి) అక్కడ నుండి అర్థ అధోముఖ శ్వాసాసనం లోకి కావాలి. అటు నుంచి తలక్రిందకు ఉంచి అరచేతులు రెండూ (చేతి వేళ్లు లాక్ చేసి ఉంచి) తలకి వెనుక వైపుగా.. నేల మీద తలకి సపోర్ట్‌గా ఆనించాలి. అలాగే, వంగి ఉన్న మోకాళ్లను నెమ్మదిగా స్ట్రెయిట్‌గా చాపి లేదా అలానే కొంచెం మడిచి ఉన్న స్థితిలోనే ఉంచాలి. రెండు కాళ్లను ఒకేసారి నేల మీద నుండి గాలిలోకి పైకి లేపి.. కాళ్లు, నడుము భాగాలను కొంచెం కొంచెం నిటారుగా పైకి తీసుకువెడుతూ ఉండాలి. ఈ సమయంలో శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ పూర్తి స్థితిలోకి వెళ్ళాలి. పూర్తి ఆసన స్థితిలో రెండు లేదా ఐదు నిమిషాల పాటు ఉండటం వల్ల ఆసనం పూర్తి ఉపయోగాలు చేకూరుతాయి.

పూర్తి ఆసన స్థితిలో సాధారణ శ్వాస తీసుకుంటూ మనసుకు సహస్రారం మీద, తల సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ కేంద్ర నాడీ మండల వ్యవస్థ మీద ఉంచాలి. దీంట్లో సాధకులు రెండు కాళ్లను పక్కలకు స్లిట్ చేయవచ్చు. లేదా ఒక కాలును నిటారుగా ఉంచి రెండవకాలుని వృక్షాసన స్థితిలో ఉంచవచ్చు. లేదా రెండు కాళ్లను బద్ధ కోణాసనంలో లాగా లేదా పద్మాసనంలో కాని ఉంచవచ్చు.  ఆ తర్వాత సాధారణ స్థితికి వచ్చేటప్పుడు ఒక్కసారిగా శరీరాన్ని భూమి మీద పడవెయ్యకూడదు. వెనుకకు వచ్చేటప్పుడు కూడా చాలా నిదానంగా రావడం మంచిది.
 
 
ఉపయోగాలు: శరీరం క్రింది భాగాల్లో స్టాగినెంట్ అయిన రక్తాన్ని గుండెకు చేర్చడానికి రక్తశుద్ధి జరగడానికి ఈ ఆసనం చాలా మంచిది. దీని వల్ల తల, మెదడు, కార్నివాల్ నెర్వస్ సిస్టమ్‌కి రక్తప్రసరణ చాలా బాగా జరుగుతుంది. మాస్టర్ గ్లాండ్ అయిన పిట్యుటరీ గ్రంధిని ఉత్తేజపరచడం కారణంగా మిగిలిన ఎండోక్రైన్ గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది. కళ్లకు చాలా మంచిది. కోర్ మజిల్స్, భుజాలు, చేతులు బలంగా ఉండటానికి ఉపయోగపడుతుంది. లింఫటిక్ సిస్టమ్‌ని ఉత్తేజపరచడం వల్ల టాక్సిన్స్ ఎక్కువగా శరీరంలో నుంచి బయటకు పోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మనసుకి మంచి ఏకాగ్రతను అలవాటు చేయడానికి, జ్ఞాపకశక్తి పెరగడానికి ఒత్తిడి నుంచి దూరంగా ఉండటానికి లేదా ఉపశమించడానికి చాలా ఉపయోగకరమైనది ఈ ఆసనం. వర్టిగో సమస్య ఉన్నవారు, స్పాండిలైటిస్ సమస్య వున్నవారు ఈ ఆసనం వేయకపోవడమే మంచిది. శీర్షాసనం పూర్తి అయిన తరువాత శవాసనంలో విశ్రాంతి పొందాలి. లేదా ధ్యానంలో కూర్చొని వచ్చే మార్పులు గమనించాలి.
 
జాగ్రత్తలు: ఇది కష్టమైన ఆసనం కనుక యోగనిపుణుల పర్యవేక్షణలో చేయాలి. మొదటిసారిగా సాధన చేసేవారు తోటి సాధకుల సపోర్ట్ తీసుకుని చేయడం మంచిది. గోడని ఆధారంగా చేసుకుని కూడా సాధన చేయవచ్చు. తలకింద ఒక కుషన్ (దిండు)ను ఉంచి సాధన చేస్తే కొంచెం తేలికగా ఉండి, ఒక వేళ బ్యాలెన్స్ తప్పి పక్కలకు కాని, వెనుకకు కాని పడిపోయినప్పటికీ ప్రమాదం అంతగా ఉండదు. ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా మెడ, భుజ భాగాలకు గాయలు కావచ్చు.

ముఖ్యగమనిక: పూర్తి ఆసనస్థితిలో ఉండగలిగినవారు అను నిత్యం సాధన చేసేవారు మాడు భాగాన్ని నేలమీద ఉంచడం కాకుండా నుదురుకి మాడు భాగానికి మధ్యలో ఉండే కపాల భాగం (ప్రీ పోర్షనల్ కార్టెక్స్ భాగాన్ని) నేల మీద ఉంచి అక్కడ లోడ్ పెట్టడం మంచిది.
సమన్వయం: ఎస్. సత్యబాబు,  సాక్షి ప్రతినిధి
 
ఎ.ఎల్.వి కుమార్ ట్రెడిషనల్
యోగా ఫౌండేషన్
 
 

Advertisement
Advertisement