
హిందీలో తమన్నా అంటే కోరిక.కోరికలు తీరాలి.తాము కోరిన కోరికలు తీరాలి.తమ కోరికలు తీరాలి.మన కోరికలు తీరాలి.తమన్నా అంటున్నది కూడా అదే.ఆశ నుంచి కాకుండా విలువలతో కూడిన కోరిక ఎవరిదైనా తీరాల్సిందే.కొత్త సంవత్సరం వస్తోంది.ప్రతి ఒక్కరి మనసులో ఒక మంచి కోరిక నిండే సమయం వస్తోంది.కోరికలు విరబూసే వేళ ఒక విరబూసిన కోరికతో స్పెషల్ ఇంటర్వ్యూ.
డైరెక్షన్ చేయాలని ఎప్పుడైనా అనుకున్నారా?
నాకు డైరెక్షన్ చేసే ఆలోచనే లేదు. డైరెక్షన్ అనేది డిఫరెంట్ టాస్క్. డైరెక్టర్ సీట్‌లో కూర్చోవాలంటే చాలా మందిని ఒకే క్రమంలో పెట్టి వాళ్ల నుంచి కావల్సింది తీసుకోగలగాలి. సినిమాకు ఏది బావుంటుందో ఊహించగలగాలి. డైరెక్టర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. నాకు పర్సనల్‌గా ఎడిటింగ్ అంటే చాలా ఇష్టం. నేను చేసే సినిమాలు ఎడిటింగ్ ఎలా చేస్తున్నారో గమనిస్తుంటాను. త్వరలోనే ఏదైనా మంచి స్కూల్‌లో జాయిన్ అయి ఎడిటింగ్ నేర్చుకుంటా (నవ్వుతూ).
ప్రస్తుతం హీరోయిన్స్‌లో చాలా మంది క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటున్నారు. దాని మీద అభిప్రాయం?
ఒక సినిమా కోసం నిర్మాత ఎన్నో కోట్లు ఖర్చు పెడుతుంటారు. ఒక ప్రాజెక్ట్‌లో చాలా మంది టెక్నీషియన్స్ ఇన్వాల్వ్ అయి ఉంటారు. అలాంటి సమయంలో కేవలం ఇలాంటి అవకాశం తీసుకొని హీరోయిన్స్‌ని ఫేవర్ అడుగుతారని నేను అనుకోను.అంటే మీకు అలాంటì ఎక్స్‌పీరియన్సెస్ ఏమీ లేవంటారు?లేదు. అంత ఖర్చు పెట్టి సినిమాలు తీస్తూ ఇలాంటి పనులు చేస్తారు అనుకోను. కెరీర్‌వైజ్‌గా చేతినిండా సినిమాలున్నాయి. పర్సనల్‌గా మీ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా?(నవ్వేస్తూ). అమ్మానాన్న, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ ఉన్నారు. ఎవరైనా స్పెషల్ పర్సన్ ఉంటే ఆ న్యూస్‌ని నేనే హ్యాపీగా అందరితో షేర్ చేసుకుంటాను.
లవ్ మ్యారేజ్ చేసుకోవాలని ఉందా? అరేంజ్‌డా?
లైఫ్‌లో అన్నీ మనం అనుకున్నట్లుగా జరగవు. చూద్దాం. ఏం జరుగుతుందో.
‘హ్యాపీడేస్’ సినిమా తర్వాత ఎంత బిజీ అయ్యారో ఇప్పుడూ అంతే బిజీగా ఉన్నారు?
తమన్నా: అవును. ఈ సంవత్సరం ఎక్కువ షూటింగ్స్ చేశాను. ‘నెక్స్›్ట ఏంటి?’ రిలీజైంది. ఎఫ్ 2, సైరా, తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. హిందీ సినిమా ‘క్వీన్’ తెలుగు రీమేక్ ‘దటీజ్ మహాలక్ష్మీ’ రిలీజ్‌కు రెడీగా ఉంది. విశాల్‌తో ఓ సినిమా ఒప్పుకున్నాను. ఇక వరుసగా నా సినిమాలు విడుదలవుతాయి. ఇప్పుడున్న యాక్టర్స్ అందరికీ కాంపిటీటివ్ స్పిరిట్, క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. ఇవి లేకుండా సక్సెస్ ఉండదు. సక్సెస్‌కు లాంగ్విటీ ఉండాలంటే కచ్చితంగా క్రమశిక్షణ ముఖ్యం. అందుకే ఒకేసారి ఎన్ని సినిమాలు చేసినా ఏ షూటింగ్‌కీ ఇబ్బంది లేకుండా ప్లాన్ చేసుకుంటాను.
సో.. వచ్చే ఏడాది 2, 3 నెలలకోసారి థియేటర్స్‌లో కనిపించి మీ ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తారన్న మాట?
అవును. ఇది నాక్కూడా ఖుషీగానే ఉంది. కానీ ఇన్ని సినిమాలు కమిట్ అవ్వడం వల్ల తీరిక లేకుండా పని చేస్తున్నాను. అది గుడ్, బ్యాడ్ కూడా. కెరీర్ వైజ్‌గా మంచిదే. కానీ రెస్ట్ లేకుండా ఒళ్ళు హూనం చేసుకొని పని చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదేమో కదా. అందుకే వచ్చే సంవత్సరం షూటింగ్స్‌కి మధ్యలో చిన్ని చిన్ని బ్రేక్ తీసుకోవాలనుకుంటున్నా.
ఇన్ని సినిమాలు చేస్తుంటే ఇంటిని మిస్సవుతున్న ఫీలింగ్ చాలా ఉంటుందేమో?
చాలా అంటే చాలా. సినిమాలు చేయడం, ప్రమోషనల్ యాక్టివిటీస్.. ఇలా ఫుల్ బిజీ. అందుకే ఏమాత్రం వీలు దొరికినా రెస్ట్ తీసుకోకుండా ముంబై వెళ్లిపోతున్నాను. అమ్మానాన్నలను చూసి, వెంటనే షూటింగ్‌కి అటెండ్ అయిపోతున్నాను.
అమ్మానాన్న ఇంకా మీతోపాటు షూటింగ్స్‌కు వస్తున్నారా?
లేదు. కెరీర్ స్టార్టింగ్‌లో చాలా కాలం వచ్చారు. ఇప్పుడు నాతో పాటు ఎక్కడికి పడితే అక్కడికి ట్రావెల్ చేయాలంటే వాళ్ల ఆరోగ్యం కూడా సహకరించాలి కదా. ఇప్పటికే ఇద్దరూ నాకోసం చాలా చేశారు. ఇంకా ఎంతకాలం చేస్తారు? అందుకే నేను మ్యానేజ్ చేసుకుంటా.. మీరు ఇంట్లో హ్యాపీగా రెస్ట్ తీసుకోండని చెప్పేశా.
హీరోయిన్ అయి పదేళ్లకు పైనే అయినా ఇంకా అదే ఫామ్‌లో ఉన్నారు. ఒక రీజన్ క్రమశిక్షణ అన్నారు. వేరే సీక్రెట్స్?
నన్ను నేను ఎప్పుడూ స్టార్‌గా, హీరోయిన్‌గా చూసుకోలేదు. నేనో యాక్టర్‌గానే ఫీల్ అవుతాను. ఎప్పటికప్పుడు డిఫరెంట్ సినిమాల్లో కనిపించాలని అందుకు తగ్గట్టుగా సెలక్ట్ చేసుకుంటున్నా. సరికొత్త పాత్రలు చేయాలని తాపత్రయపడుతుంటాను. ‘బాహుబలి’ సినిమాలో చేసిన అవంతిక పాత్ర కొత్త కొత్త పాత్రలు వచ్చేలా చేసింది. ఇంకా డిఫరెంట్ రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. నా కెరీర్‌కి ఓ కొత్త పుష్‌లా అనిపించింది అవంతిక పాత్ర.
డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా?
ఈ ప్రశ్నకు ఇప్పటి వరకూ సరిగ్గా సమాధానం చెప్పలేదనుకుంటాను. కానీ నాకో ఫుల్ లెంగ్త్ డ్యాన్స్ మూవీ చేయాలనుంది. ప్రభుదేవాగారు చేసిన హిందీ సినిమా ‘ఏబీసీడీ’ లాంటిది. ఆ సినిమాలా స్టార్ట్ టు ఎండ్ డ్యాన్స్ బేస్డ్ మూవీకి అవకాశం వస్తే చాలా ఆనందపడతాను.
పెళ్లి కాని హీరోయిన్ల గురించి కొంతమంది ‘పెళ్లయితే కెరీర్ ఎండ్ అవుతుంది కాబట్టే పెళ్లి చేసుకోవడంలేదు’ అంటున్నారు. మీరేమంటారు?
ఈ జనరేషన్‌లో కొందరు మాత్రమే అలా ఆలోచిస్తున్నారని నా అభిప్రాయం. సమంతనే చూడండి. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో యాక్ట్ చేస్తూనే ఉంది. అలాగే హిందీ వైపు వెళదాం. కరీనా కపూర్‌కి పెళ్లయింది, బాబు ఉన్నాడు. అయినా సినిమాలు చేస్తోంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అబ్బాయిని ‘కెరీర్ వదిలేస్తావా?’ అని అడగం. మరి.. అమ్మాయిలకు మాత్రం రూల్స్ ఎందుకో? పెళ్లయితే కెరీర్‌ని వదిలేయాలి? పిల్లల కోసం కెరీర్‌ని వదిలేయాలి.. ఇలాంటివి విన్నప్పుడు వింతగా ఉంటుంది. కెరీర్‌ని వదిలేయడం అనేది ఆ అమ్మాయి ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ‘మ్యారేజ్ అనేది ఎండ్ ఆఫ్ ది కెరీర్’ అనే ఆలోచన తీసేయాలి ముందు.
అలాగే హీరోయిన్ అనగానే ఈజీగా కామెంట్ చేసేస్తారు. ఆ మధ్య తమిళ దర్శకుడు సురాజ్ ‘నా సినిమాల్లో హీరోయిన్స్‌ని షార్ట్ డ్రెసుల్లోనే చూపిస్తాను. వాళ్లను అలా చూడ్డానికే ఆడియన్స్ వస్తారు’ అని ఓపెన్‌గా అన్నారు..
ఆయనతో సినిమా చేశాను నేను. ఇప్పటి వరకూ నా కెరీర్‌లో ఏ డ్రెస్ వేసుకున్నా నాకు కంఫర్ట్‌గా ఉంటేనే వేసుకున్నాను. అంతేకానీ వాళ్లు అన్నారనో వీళ్లు అన్నారనో అలాంటి డ్రెస్సులు వేసుకోలేదు. సురాజ్ అన్న దానికి నేను అప్పుడే సమాధానం ఇచ్చాను. అది కచ్చితంగా తప్పు స్టేట్‌మెంటే. ఆ తర్వాత ఆయన మాట్లాడినదాంట్లో తప్పు తెలుసుకొని వెంటనే అపాలజీ కూడా కోరారు. కొంతమంది తాము ఏం మాట్లాడుతున్నామో, అది ఎటు దారి తీస్తుందో ఆలోచించకుండా మాట్లాడుతుంటారు. వాళ్ల ఉద్దేశం కూడా అది కాకపోవచ్చు.
ఎవరైనా స్త్రీ సక్సెస్ సాధిస్తుంటే ఎలాగైనా కిందకి లాగాలని ప్రయత్నిస్తుంటారు. మిమ్మల్ని అలా ఎవరైనా?
లేదు. అటువంటి అనుభవాలేవీ ఎదురవ్వలేదు. నా 15 ఏళ్ల వయసు నుంచే వర్క్ చేయడం మొదలుపెట్టాను. షూటింగ్ లొకేషన్‌లో ముగ్గురు నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉంటాం. మిగతా అందరూ అబ్బాయిలే. నా అదృష్టమో ఏమో కానీ ఇప్పటివరకూ నాతో కలిసి వర్క్ చేసిన అబ్బాయిలెవరికీ ఇన్‌సెక్యూర్టీ లేదు. అందరూ రియల్లీ స్ట్రాంగ్ పీపుల్. అభద్రతాభావంతో ఉన్నవాళ్లే స్త్రీ ఎదుగుదలను ఓరవలేరని నా ఫీలింగ్.
ఓకే.. ‘సైరా’లో చిరంజీవిగారితో వర్క్ చేయడం ఎలా అనిపిస్తుంది?
చిరంజీవిగారు ఎప్పుడూ ఎంకరేజింగ్‌గా ఉంటారు. చాలా సందర్భాల్లో మెచ్చుకున్నారు. రామ్‌చరణ్‌తో ‘రచ్చ’ సినిమా చేస్తున్నప్పుడు ‘వానా వానా వెల్లువాయే..’ సాంగ్ షూట్ సమయంలో ఆయన లొకేషన్‌లోనే ఉన్నారు. చిరంజీవిగారు చాలా సపోర్ట్ చేస్తారు. ఆయనతో కలిసి వర్క్ చేయడం చాలా ఎగై్జటింగ్‌గా ఉంది.
ఒకవైపు చిన్న హీరోలతో చేస్తూనే మరోవైపు సీనియర్ హీరోల సరసన సినిమాలు చేయడం ఎలా ఉంది?
మేమంతా యాక్టర్స్. ఆ సినిమాల్లో ఆ పాత్రలను పోషిస్తున్నాం. ఏజ్ గురించి మా మైండ్‌లో ఉండదు. ఈ పాత్రను ఎంత బాగా చేయాలా? అనే ఆలోచన మాత్రమే ఉంటుంది.
మీ కెరీర్‌లో చాలా కష్టంగా అనిపించిన పాత్ర?
ప్రతి సినిమా ఓ చాలెంజ్‌లానే ఉంటుంది. కానీ ‘దటీజ్ మహాలక్షీ’ సినిమాకి కష్టపడ్డాను. ఎందుకంటే స్ట్రయిట్ సినిమా చేసేయడం ఈజీ. రీమేక్ చేసేటప్పుడు ఇంకా చాలెంజింగ్‌గా ఉంటుంది. పోల్చి చూస్తారు. ‘క్వీన్’లో కంగనా చేసిన పాత్ర నాకు చాలా నచ్చింది. కానీ మళ్లీ తనలా యాక్ట్ చేయకుండా నా స్టైల్‌లో చేయాలి. లేకపోతే కంగనాలా చేసింది అంటారు. అందుకే ఆ క్యారెక్టర్‌ని అర్థం చేసుకుని నా స్టయిల్‌లో ‘దటీజ్ మహాలక్ష్మీ’ చేశాను.
‘100% లవ్’ సినిమాలో ‘దటీజ్ మహాలక్ష్మీ’ అంటుంటారు.. ఈ సినిమా టైటిల్‌కి అదేమైనా కారణమా?
నిజానికి ‘100% లవ్’ సినిమాకు ఫస్ట్ ‘దటీజ్ మహాలక్ష్మీ’ అనే టైటిలే అనుకున్నాం. కానీ కుదర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు యాప్ట్ అవుతుందని ఆ టైటిల్ ఫిక్స్ చేశాం. ఎందుకంటే ఇందులో హీరోయిన్ చాలా స్ట్రాంగ్‌గా, బోల్డ్‌గా జీవితంతో పోరాడుతుంది.
ప్రస్తుతం సమాజంలో ఉమెన్ కూడా బోల్డ్‌గా ఉండాలంటారా?
ఆ విషయం గురించి నేను చెప్పను. ఎందుకంటే ‘నువ్విలా ఉండాలి.. అలా ఉండాలి’ అని ఒకళ్ల తీరుని మార్చాలనుకోవడం సరి కాదని నా అభిప్రాయం. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లుండాలి. స్ట్రాంగ్‌గా ఉన్నా, సెన్సిటివ్‌గా ఉన్నా.. తీసుకునే నిర్ణయాల విషయంలో చాలా క్లారిటీగా ఉండాలని చెబుతాను. డెసిషన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే.. అమ్మాయిలు అమ్మాయిలను సపోర్ట్ చేసుకోవాలి. అప్పుడు అమ్మాయిలను ఎవరూ ఆపలేరు. అలా కాకుండా మనల్ని మనమే హేళన చేసుకుంటే వేరేవాళ్లకు తేలికైపోతాం.
సినిమాల్లో గ్లామరస్ పాత్రల్లో కనిపిస్తుంటారు కాబట్టి మీ లైఫ్ కూడా గ్లామరస్‌గా ఉంటుందని కొందరి ఊహ..
అస్సలు ఉండదు. మీరు పని చేసి వచ్చి ఇంట్లో ఎలా ఉంటారో మేమూ అంతే. కానీ, మాకు కొత్త కొత్త పాత్రలు, కొత్త కొత్త కాస్ట్యూమ్స్ ఉంటాయి. కంటిన్యూస్‌గా ఒకేచోట ఉండం. షూటింగ్స్ కోసం ఎక్కడెక్కడికో వెళుతుంటాం. అయితే షూటింగ్ అయిపోయాక అంతా మామూలే. నార్మల్‌గానే ఉంటాం. అందరిలానే తింటాం. ఇంట్లోవాళ్లతో కష్టసుఖాలు చెప్పుకుంటాం. మంచి విషయం జరిగితే ఆనందపడతాం. జరగకూడనిది జరిగితే బాధపడతాం. మేం కూడా మనుషులమే.
మీ ప్రొఫెషన్ టైమింగ్స్ రోజూ ఒకేలా ఉండవు కాబట్టి ఎప్పుడైనా ఈ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాం అనుకున్నారా?
అలా అనుకోలేదు. 24 గంటలు బదులు 26 గంటలు ఉంటే బావుండు అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎనర్జీ కావాలి అనుకుంటున్నాను. బాక్సాఫీస్ సక్సెస్ నా చేతిలో ఉండదు. నా చేతిలోఉండేది ఏంటి? కష్టపడి పని చేయడం. ఇంకా బాగా యాక్ట్ చేయగలగడం. ఫ్రైడే రిజల్ట్ గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే రిజల్ట్ మనతోఎక్కువ సేపు ఉండదు. కానీ ఆ ప్రాసెస్ (వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్) లో ఎక్కువ సేపు ఉంటాం. అందుకే ఎవ్వరైనా ఆ ప్రాసెస్‌ని ఎంజాయ్ చేయాలని చెబుతాను.
కెరీర్ స్టార్టింగ్ నుంచి సేమ్ ఫిజిక్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఎలా?
దానికి ఒకటే సూత్రం. దేన్నీ అతిగా చేయకూడదు. అది వ్యాయామం అయినా, డైట్ అయినా సరే. నార్మల్‌గా, బ్యాలెన్స్›్డ లైఫ్ లీడ్ చేస్తాను. డైట్ కూడా మామూలుగా చేస్తా. అలాగే ఎక్సర్‌సైజ్‌ల విషయానికొస్తే.. ఈ రోజు వంద పుషప్స్ చేయాలి అని లెక్క పెట్టి చేయను.
చాలామంది తమన్నా లాగా ఉండాలి అంటుంటారు. తమన్నా లాగా ఉండాలంటే ఏం చేయాలి?
అయినా నాలాగా ఎందుకు ఉండాలి? ఎవరిలా వాళ్లు ఉండాలి. వాళ్ల శరీరతత్వాన్ని అర్థం చేసుకుని డైట్, ఎక్సర్‌సైజులు ప్లాన్ చేసుకోవాలి. దేనికీ షార్ట్ కట్ ఉండదు. అది బాడీ విషయంలో అయినా పని విషయంలో అయినా సరే. అతిగా చేసేయడం ప్రకృతి విరుద్ధం. చేసే పనిలో బ్యాలెన్స్ ఉండాలి. యోగా మన సంప్రదాయాల్లో ఉంది. నేను యోగా ఎక్కువగా చేస్తాను. ఆయుర్వేదం కూడా ఫాలో అవుతున్నాను. ఇంట్లో చేసే ఫేస్ ప్యాక్‌లు వాడతాను. యోగా మనల్ని ప్రశాంతంగా ఉంచుతుందని తెలుసుకున్నాను.
యోగాలో ఎన్ని సూర్య నమస్కారాలు చేయగలరు?
ఇన్ని చేయాలని లెక్క పెట్టుకోను. ‘బాహుబలి’ కెమెరామేన్ సెంథిల్ వాళ్ల భార్య నా యోగా గురువు. తనే నేర్పిస్తుంది. చాలా బాగా చేయిస్తుంది. యోగా అనేది మన కల్చర్‌లోనే ఉంది.
రీసెంట్‌గా వెజిటేరియన్‌గా మారారని కూడా విన్నాం. ఎందుకు?
నా బుజ్జి కుక్కపిల్ల అనారోగ్యం పాలైంది. అది త్వరగా కోలుకోవాలని ప్రార్థించాను. అప్పటివరకూ మాంసాహారం తినకూడదనుకున్నాను. వెంటనే కోలుకుంది. వెజిటేరియన్‌గా ఉండటం బాగానే ఉంది. నాన్‌వెజ్ తిని 9 నెలలు అవుతోంది. ఫుల్‌టైమ్ వెజిటేరియన్‌గా మారిపోదాం అనుకుంటున్నాను.
చిన్నప్పటి నుంచీ ఉన్న అలవాటుని సడెన్‌గా మానేయడమంటే కష్టమే కదా?
అవును కష్టమే. కానీ మనసులో బలంగా అనుకుంటే కష్టం కాదు. ఆహారం అయినా పనైనా.. ఈ ప్రకారం ఫాలో అవ్వాలి అనుకుంటే అయిపోవాలి. అలా అవ్వాలంటే మనల్ని మనం కరెక్ట్‌గా పుష్ చేసుకోవాలి.
ఫైనల్లీ.. 2019 మీద మీ ఎక్స్‌పెక్టేషన్స్ ఏంటి?
2018 బిజీ బిజీగా గడిచింది. 2019 కూడా అలానే ఉండాలని కోరుకుంటున్నాను. రోజుకు 24 బదులు 36 గంటలు ఉండే సూపర్ పవర్ ఏదైనా ఉంటే బావుండూ అనుకుంటున్నాను. ఆడియన్స్‌ను ఇంకా ఎంటర్‌టైన్ చేయాలి.
– డి.జి. భవాని