పరి పరిశోధన

A Supercolony of Penguins Has Been Found Near Antarctica - Sakshi

వర్టికల్‌ ఫార్మింగ్‌తో 30 రెట్లు ఎక్కువ దిగుబడి
నేల అవసరం లేని నిట్టనిలువు వ్యవసాయం గురించి మనం చాలాసార్లు వినే ఉంటాంగానీ.. ఇందులోనూ రికార్డులు బద్దలు కొట్టేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయి. అమెరికాకు చెందిన బోవరీ విషయాన్నే తీసుకోండి. ఈ సంస్థ అతితక్కువ స్థలం, నీరు, వనరులు వాడుకుని బోలెడన్ని ఆకు కూరలు పండించేందుకు రంగం సిద్ధం చేసింది. సంప్రదాయ పద్ధతుల్లో ఎకరానికి పండించే దానికంటే బోవరీలో పండేది ఏకంగా 30 రెట్లు ఎక్కువ ఉండటం విశేషం. అత్యాధునిక టెక్నాలజీలను వాడుకోవడం ద్వారా తాము 95 శాతం తక్కువ నీరు.. క్రిమికీటక నాశినులు, రసాయన ఎరువులు ఏవీ వాడకుండానే అధిక దిగుబడులు సాధిస్తామని కంపెనీ ప్రతినిధి ఒకరు చెప్పారు.

ఒకే రకమైన పంట కాకుండా ఏకకాలంలో దాదాపు వంద రకాల ఆకు కూరలు, ఔషధ మొక్కలు పెంచడం ఇంకో విశేషం. ప్రత్యేకంగా తయారుచేసుకున్న కంప్యూటర్‌ సాఫ్ట్‌వేర్‌ ద్వారా మొక్కలకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మహానగరాలకు చేరువలో ఇలాంటి వర్టికల్‌ ఫార్మింగ్‌ చేపట్టడం ద్వారా నగరవాసులకు తాజా ఆకుకూరలు దొరుకుతాయి. ఇందువల్ల రవాణా చేయవలసిన అవసరం ఉండదు. ఇలా చేయడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చునని బోవెరీ అంటోంది. ప్రస్తుతం ఈ సంస్థ పంటలు న్యూయార్క్‌లోని ఫోరేజ్, హోల్‌సమ్‌ ఫుడ్స్‌ వంటి స్టోర్లలో లభ్యమవుతున్నాయి.

పెంగ్విన్ల కాలనీ బయటపడింది...
మంచుముద్ద అంటార్కిటికాలో ఓ పెంగ్విన్ల కాలనీని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆ.. ఇందులో విశేషమేముంది? అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే అంతరించిపోతున్నాయని అనుకుంటున్న అడిలీ రకం పెంగ్విన్లు ఇక్కడ ఉండటం ఒక విశేషమైతే.. ఏకంగా 15 లక్షల ప్రాణులు ఉండటం ఇంకో విశేషం. వుడ్‌హోల్‌ ఓషన్రోఫిక్‌ ఇన్‌స్టిట్యూషన్‌ శాస్త్రవేత్తలు ఉపగ్రహ ఛాయాచిత్రాలు, డ్రోన్లతో జరిపిన పరిశోధనల ద్వారా ఈ కొత్త కాలనీ గురించి ప్రపంచానికి తెలిసింది.

డాంగర్‌ ద్వీపంలో ఉన్న ఈ కాలనీని ఇప్పటివరకూ మనుషులెవరూ సందర్శించలేదని.. బహుశా అందుకే ఆ ప్రాంతంలో పెంగ్విన్లు బాగా వృద్ధి చెందుతూండవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త టామ్‌ హార్ట్‌ తెలిపారు. 1959లో తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లోనూ వీటి ఉనికి గురించి కొన్ని ఆనవాళ్లు కనిపించాయని, ఆ తరువాత డాంగర్‌ ద్వీపమున్న పశ్చిమ అంటార్కిటికా ప్రాంతంలో పెంగ్విన్లు క్రమేపీ తగ్గిపోతూ వచ్చాయని హార్ట్‌ వివరించారు. దాదాపు ఏడు లక్షల జంటలతో ప్రపంచంలోనే అతిపెద్ద పెంగ్విన్‌ కాలనీగా ‘హార్ట్‌’ నిలిచింది అంటున్నారు. ఆక్సఫర్డ్‌ విశ్వవిద్యాలయంతోపాటు అమెరికా, ఫ్రాన్స్‌లలోని ఇతర విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్నారు.

నిత్య యవ్వనం గుట్టు తెలిసింది...
నిండు నూరేళ్లూ... ఎలాంటి జబ్బులు, ఇబ్బందులు లేకుండా గడిపితే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది గానీ.. సాధ్యమయ్యేదెలా? అంటున్నారా? అరిజోనా స్టేట్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని ఈ దిశగా ఇంకో అడుగు ముందుకు పడింది. విషయం ఏమిటంటే.. మన క్రోమోజోమ్‌ల చివరన ఉండే టెలిమోర్లకు సంబంధించిన ఓ కీలక విషయాన్ని తెలుసుకున్నారు. డీఎన్‌ఏ పోగుల్లోని కొన్ని భాగాలను టెలీమోర్లుగా మార్చేందుకు టెలిమరేస్‌ అనే ఎంజైమ్‌లు ఎలా పనిచేస్తాయో వీరు గుర్తించారు. సాధారణంగా మన శరీర కణాలు కొన్నిసార్లు విభజితమైన తరువాత మరణిస్తాయి. ఈ క్రమంలో క్రోమోజోమ్‌ల చివర ఉండే టెలీమోర్ల పొడవు తగ్గుతూ వస్తుంది.

ఎప్పుడైతే టెలిమోర్ల పొడవు నిర్దిష్ట స్థాయికంటే తక్కువ అవుతుందో అప్పుడు కణ విభజన ఆగిపోతుంది. ఇంకోలా చెప్పాలంటే కణాలు.. వాటితోపాటు మనమూ వృద్ధులమవుతామన్నమాట. ఈ నేపథ్యంలో టెలీమోర్ల పొడవు తగ్గకుండా చూసేందుకు శాస్త్రవేత్తలు రకరకాల పరిశోధనలు చేస్తున్నారు. టెలీమెరేస్‌లో క్రోమోజోమ్‌ చివరల్లో ఉండే టెలీమోర్లకు సంబంధించిన డీఎన్‌ఏ ముక్కలను కచ్చితంగా తయారు చేసేందుకు ఒక వ్యవస్థ ఉందని.. ఇది.. ఆ ఎంజైమ్‌ మొత్తం పనితీరునూ ప్రభావితం చేస్తోందని వీరు తెలుసుకున్నారు ఈ వ్యవస్థను నియంత్రించగలిగితే టెలీమోర్ల పొడవు తగ్గకుండా ఉంటుంది.. తద్వారా కణాలు.. మనమూ నిత్యయవ్వనంతో ఉండవచ్చునని అంచనా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top