రావణా! నిన్ను చంపింది రాముడు కాదు!

story on Chaganti Koteshwara Rao pravechanalu - Sakshi

స్త్రీ వైశిష్ట్యం–25

సాధారణంగా ఎటువంటి స్త్రీఅయినా  తట్టుకోలేని శోకం ఎప్పుడు అనుభవిస్తుందంటే... భర్త అలాగే కడుపున పుట్టిన కొడుకు దిగజారిపోయినప్పుడు... ఆ దుఃఖానికి అవధి ఉండదు. మండోదరి మహా పతివ్రత. మయుడు, హేమల కుమార్తె. పది తలలు ఉన్న రావణాసురుని పట్టమహిషి. ఇంత గొప్పది. రావణుడి వక్షస్థలాన్ని చీల్చుకుని, గుండెను ఛేదించుకుని బాణం బలంగా భూమిలోకి దిగి తిరిగి రామచంద్రమూర్తి అక్షయ తూణీరంలోకి ప్రవేశిస్తే నెత్తురోడుతూ రావణుడు భూమ్మీద పడిపోయి ఉంటే... గద్దలు, రాబందులు పైన ఎగురుతుంటే... దేవతలందరూ జయజయధ్వానాలు  చేస్తుంటే... మండోదరికి కబురందించి పల్లకి పంపి పిలిపించారు. ఆవిడ యుద్ధభూమికొచ్చింది. రావణుడి శరీరానికి కొద్దిదూరంలో ఒక చెట్టుకింద రామలక్ష్మణులు, పక్కన విభీషణుడు నిలబడి ఉన్నాడు. సాధారణంగా ఆ పరిస్థితులలో ఉన్న ఏ స్త్రీ అయినా  వెంటనే... రాముడెక్కడ? అని అడుగుతుంది లేదా తన భర్తను చంపేసాడన్న కోపంతో రాముడిని నింద చేస్తూ విరుచుకుపడుతుంది.. అని అనుకుంటారు.

కానీ మండోదరి ఎంత ధర్మాత్మురాలంటే...పల్లకీ దిగి రావణుడి దగ్గరకెళ్ళి... ఏడుస్తూ...‘‘వీళ్లందరికీ అమాయకత్వంతో తెలియని విషయం ఒకటున్నది రావణా! రాముడు నిన్ను చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నీ భార్యను కనుక నాకు తెలుసు... నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. ఒకానొకనాడు నీవు తాచుపామును తొక్కిపెట్టినట్లు నీ ఇంద్రియాలను తపస్సు కోసం తొక్కిపట్టావు. నువ్వు బలవంతంగా వాటిని కోరికలకోసం తొక్కిపెట్టావు. తొక్కి పెట్టిన కాలుకింద నుంచి తప్పించుకున్న పాములా పగతో నీ ఇంద్రియాలు నిన్ను కాటేసాయి. యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు... అయినా నాలోలేని ఏ అందం నీకు సీతమ్మలో కనిపించింది?’’ ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంత శోకంలో కూడా అలా మాట్లడడం భార్యగా ఒక్క మండోదరికే సాధ్యపడింది.

ఎటువంటి నిష్పక్షపాత తీర్పు చెప్పిందో చూడండి! అదీ ఈ జాతివైభవం. ఈ ఒక్కమాట లోకానికి అందితే జాతి చేయకూడని పొరబాట్లు చేయదు. పిల్లలకు పాఠశాలల్లో రామాయణం చెపితే తప్పు, భారత భాగవతాలు చెపితే తప్పు. మంచి శ్లోకం ఉండకూడదు... అన్నప్పుడు సంస్కారం ఎక్కడినుంచి అందుతుంది?  ఒక పాత్రలో పాయసం పోశారు. అది రాగిపాత్ర. మరొక బంగారు పాత్రలో పాయసం పోసారు. బంగారు పాత్రలోది తాగినా, రాగిపాత్రలోది తాగినా పాయసానికి రుచి ఒకటే. రాగి పాత్ర నీదయినప్పుడు ధర్మం తప్పకుండా రాగిపాత్రలోనే తాగు. నీది కాని బంగారు పాత్రలోది తాగాలని మాత్రం అలమటించకు. పాత్ర మెరుగులు, మిలమిలలు చూసి గీత దాటితే భ్రష్టుడవయిపోతావు. కొన్ని కోట్ల జన్మలు కిందకు జారిపోతావు. మండోదరిలాంటి స్త్రీల వారసత్వం ఈ జాతి సంపద. ఎక్కడున్నా వాళ్లు భర్తకు శాంతి స్థానాలు. వాళ్ళు భర్తలకు మంచి మాటలు చెప్పారు తప్ప భర్త పరిధి దాటి అక్కరలేని విషయాల జోలికి వెళ్ళి పైపై మెరుగులకోసం, తాత్కాలిక సుఖాలకోసం కష్టాలను కౌగిలించుకోవాలని ఎన్నడూ ప్రబోధం చేయలేదు..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top