ఆ నామమే చాలు...

 Spiritually:  To clear up the confusion - Sakshi

ఆత్మీయం

ఒక వృద్ధుడు చేతిలో జపమాల, మెడలో రుద్రాక్షహారం ధరించి, ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపిస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. ఆ తరంగాలు కలిపురుషుని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానదీ తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. ‘ఇతన్ని చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి వస్తే ఎగిరేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను. ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా? లేక ఇదంతా శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా? అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవడు? శివుడా? విష్ణువా?’ అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న వేదవ్యాసుడు కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడి దగ్గరికి వెళ్లి ‘‘మహానుభావా! సమయానికి వచ్చావు.

నా సందేహాన్ని నివృత్తి చెయ్యి. అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు? ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి’’ అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ‘‘ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణుభక్తుడు. అయన జపించే నామం వలన విష్ణుశక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్ధిగా నిత్యం  ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకను కూడా తాకలేవు’ అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆనాటినుంచి కలిపురుషుడు వీలయినంత వరకు హరినామస్మరణ జరగకుండా అడ్డుపడుతూ, ఆటంకాలు సృష్టిస్తూ ఉన్నాడు. పుణ్యపురుషులు మాత్రం భగవన్నామ స్మరణ జరిగేలా చూస్తూనే ఉన్నారు. అందుకే ధర్మం ఈ మాత్రం ఒంటి కాలిమీదనైనా నిలబడగలుగుతోంది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top