కంటికి కన్ను

Special story to Spy cameras specialist varalakshmi - Sakshi

యాంటీ రెడ్‌ ఐ 

చిల్లర సరుకుల్లా.. స్పై కెమెరాలు ఫుట్‌పాత్‌ మీద కూడా దొరుకుతున్నాయి. కొనేవారికి హద్దులు లేవు, అమ్మేవారికి పరిమితులు లేవు.  ఫలితం.. మన అమ్మ, అక్క, చెల్లి, వదిన.. వీళ్ల నగ్నచిత్రాలు వీధికెక్కుతున్నాయి. అవమానంతో కృంగిపోయి.. వాళ్ల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ఇలాంటి మరణాలను అరికట్టడానికే ‘హెవెన్‌ హోమ్‌ సొసైటీ’ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి ‘యాంటీ రెడ్‌ ఐ’ పేరుతో ఓ ఉద్యమ పోరాటం చేస్తున్నారు వరలక్ష్మి. అందులో భాగంగా షార్ట్‌ఫిల్మ్‌లు తీసి ప్రజల్లో ఈ సమస్యపై చైతన్యం తెస్తున్నారు.  మిస్డ్‌ కాల్‌తో ఓటింగ్‌ ద్వారా సమస్యను చట్టసభల్లోకి తీసుకెళ్లబోతున్నారు. ‘‘నరకాసుర వధకు ఓ స్త్రీ శక్తి సరిపోయిందేమో కాని, ఈ స్పై కెమెరా విష సంస్కృతిని సమూలంగా ఛేదించడానికి అందరి చేయూత కావాలి’’ అంటున్నారు వరలక్ష్మి. 

ఆ అమ్మాయి షాపింగ్‌మాల్‌కి వెళ్లింది. డ్రెస్‌ సెలక్ట్‌ చేసుకుంది. ట్రైల్‌ రూమ్‌లోకి వెళ్లి సైజు సరిపోయిందో లేదో చూసుకుంది. మళ్లీ తన డ్రెస్‌ వేసుకుని బయటకు వచ్చేసింది. కావలసిన బట్టలు కొనుక్కుంది. వారం తర్వాత.. ట్రైల్‌ రూమ్‌లో తను బట్టలు మార్చుకున్న వీడియోలు నెట్‌లో సర్క్యులేట్‌ అవడం గమనించి షాక్‌ తింది. సిగ్గుతో చచ్చిపోయింది. ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకుంది. సురేఖ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతోంది. ఒకరోజున వారి ఏకాంతానికి సంబంధించిన ఫొటోలు వాట్సాప్‌కి వచ్చాయి. భార్యాభర్తలిద్దరూ ఆశ్చర్యపోయారు. ఇది ఎలా జరిగిందా అని ఆలోచించారు. ఇంటి గోడలకున్న చిన్న చిన్న మేకులలో స్పై కెమెరాలు ఉన్నట్లు తెలిసింది. ఆ దంపతులు చాలాకాలం ఎవ్వరికీ కనపడకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.నిజామాబాద్‌ మాక్లూర్‌ మండలానికి చెందిన బీటెక్‌ విద్యార్థి రమ్యకృష్ణ. ఆమెకు ప్రసాద్‌ అనే వ్యక్తి  ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. వృత్తిరీత్యా అతడు కువైట్‌లో ఉంటున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ విషయం ఆమెకు తెలియకపోవడంతో, అతనితో స్నేహం చేసింది. తెలియక చేసిన స్నేహానికి ఇప్పుడు ఆమెను సాధిస్తున్నాడు.

ఇవే కాదు..!
కేరళలో ఒక ఫొటోగ్రాఫర్‌ వివాహ వేడుకలో ఫొటోలు తీయడానికి వచ్చాడు. అక్కడ ఫొటోలు తీసి, వాటిని మార్ఫింగ్‌ చేసి 50 వేల మందికి సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశాడు. భద్రాచలంలో ఒక యువకుడు తనకు సోదరి వరుస అయిన యువతి నగ్న చిత్రాలు తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశాడు. బోయినపల్లిలో ఒక యువతికి తెలియకుండా వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌ చేయడంతో ఆ యువతి సజీవదహనం అయిపోయింది. 

విచ్చలవిడి విష సంస్కృతి
ఇటువంటి అనేక ఘటనలు అనునిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎంతోమంది ఆడపిల్లలు తమకు తెలియకుండానే స్పైటెక్‌ వలలో చిక్కుకుని విలవిల్లాడుతున్నారు. మనోవ్యధ చెందుతున్నారు. ఇటువంటి బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతూనే ఉంది. తమకు తెలియకుండా జరుగుతున్న ఈ అఘాయిత్యాలను ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితి. ఒక మహిళను ఆమె అనుమతి లేకుండా ఫొటో లేదా వీడియోలో షూట్‌ చెయ్యడం, వాటిని షేర్‌ చేయడం తీవ్రమైన నేరం. అయినప్పటికీ ఈ తరహా నేరాలు ఆగడం లేదంటే అందుకు ఉపకరిస్తున్నవి స్పై కెమెరాలు. ఈ సంస్కృతికి అడ్డుకట్టు వేసేదెలా మరి? ‘‘దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా జరుగుతున్న స్పై కెమెరాల అమ్మకాలను క్రమబద్ధీకరించాలి. ప్రతి సంస్థ మహిళా కస్టమర్ల భద్రతని తమ స్వంత బాధ్యతగా తీసుకొని వారి వ్యాపార సంస్థలు, హోటల్స్, మాల్స్, హాస్టల్స్‌ వంటి వాటిలో తమ సిబ్బంది కాని, ఎవరైనా ఇతరులు కాని స్పై కెమెరాలు బిగించారా అనేది ఎప్పటికప్పుడు చెక్‌ చేసుకుంటూ ఉండాలి. చట్టపరంగా కూడా బాధితులకు తక్షణ న్యాయం జరగేలా చూడాలి’’ అంటున్నారు ‘యాంటీ రెడ్‌  ఐ’ వ్యవస్థాపకురాలు శ్రీమతి జి. వరలక్ష్మి.

యాంటీ  రెడ్‌ ఐ ఆవిర్భావం
వరలక్ష్మి ఖమ్మం జిల్లాలో జన్మించారు. తండ్రి సూర్య ప్రకాశ్‌ పోలీసు డిపార్ట్‌మెంట్‌లో పనిచేశారు. తల్లి సౌదామిని గృహిణి. భర్త జి. ఎన్‌. వి. సంజయ్‌ కుమార్‌ సొంతంగా వ్యాపారం చేస్తున్నారు. అమ్మాయి భార్గవి ఉద్యోగం చేస్తోంది. అబ్బాయి కిరీటి బీటెక్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. వరలక్ష్మి ఫిల్మ్‌ సెన్సార్‌ బోర్డు మెంబరుగా పని చేస్తున్న రోజుల్లో కొన్ని కేసులను టెక్నికల్‌ టీమ్‌ ఇన్వెస్టిVó ట్‌ చేస్తున్నప్పుడు చూశారు. స్పయింగ్‌ ఎలా జరుగుతోందో తెలుసుకుని కదిలిపోయారు. ఎంతోమంది ఇటువంటి సంఘటనల కారణంగా మనోవ్యధకు గురవుతున్నారని, కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని తెలుసుకున్నాను. స్పై కెమెరాలను దుర్వినియోగం చేయడం వల్ల అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని, స్పై కెమెరాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా యాంటీ రెడ్‌ ఐ క్యాంపెయిన్‌ ప్రారంభించారు.

షీ టీమ్‌లను పెంచాలి
చట్టాల్లోని లొసుగులతో ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారంతా వెంటనే బెయిలు మీద బయటకు వచ్చేస్తున్నారు. కేంద్ర మంత్రి స్మృతీ ఇరానికి కూడా ఒక షాపింగ్‌ మాల్‌లో ఇలాంటి చేదు అనుభవమే ఎదురైనప్పుడు నిందితులు ఐదు వేల రూపాయలు జరిమానా కట్టి, మర్నాడే బయటకు వచ్చేశారంటే సాధారణ మహిళ భద్రత సంగతి ఏమిటి? ‘‘కఠిన చట్టాలు ఉండాలి. అవి సక్రమంగా అమలవ్వాలి. ఓటింగ్‌ ద్వారా కేంద్ర ప్రభుత్వం చట్టాలు అమలుచేసేలా రాజకీయ నేతలు, అధికారులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు... అందరూ సమన్వయంతో మహిళల తరఫున పోరాడటమే దీనికి పరిష్కారం’’ అంటున్నారు వరలక్ష్మి. స్పయింగ్‌ని రూట్‌ లెవల్‌ నుంచి పెకలించడానికి షీటీమ్స్‌ పెంచడం ఆమె సూచిస్తున్న ఒక మార్గం. దురదృష్టం ఏమిటంటే.. వరలక్ష్మి ఎనిమిది నెలల పాటు దీనిపై గ్రౌండ్‌ వర్క్‌ చేసి, అనేక సంఘటనల నేపథ్యం అర్థం చేసుకుని, కోర్టులో పిల్‌ వేసి ఏడాది గడుస్తున్నా, ఇంతవరకు ఆ కేసు బెంచ్‌ మీదకు రాకపోవడం! 

నివేదిక ఇవ్వలేదు!
‘‘ప్రస్తుత సమాజం మొత్తం టెక్నాలజీ మీదే నడుస్తోంది. ముందు ముందు ఈ సాంకేతికత కారణంగా సమాజం ప్రమాదంలో పడే అవకాశం ఉంది. పిల్‌ వేసిన తరవాత, డీజీపీ నెలరోజులలో నివేదిక ఇవ్వాలి.ఇవ్వలేదు! వారే కనుక వెంటనే యాక్షన్‌ తీసుకుని నివేదిక కోర్టుకి ఇచ్చి ఉంటే కొన్నైనా ఇలాంటి ఘటనలు జరక్కుండా ఉండేవి’ అని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘దక్షిణ కొరియాలో ఇటీవల మహిళలు పెద్ద ఎత్తున స్పై కెమెరాలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. వారి పోరాటం ఫలించింది. ఆ పని మన దేశానికి ఎందుకు చేతనవడం లేదు?’’ అని ప్రశ్నిస్తున్నారు వరలక్ష్మి.

రోజుకో ఘటన!
ఆ మధ్య ఓ మంత్రిగారి చొరవతో, ఓ షోరూమ్‌ లో ట్రయల్‌ రూమ్‌లో బయటపడిన సీసీ కెమెరాలు, ఎంత మంది అమ్మాయిల మానసిక క్షోభకు కారణమయ్యాయో తెలిసిందే. పబ్లిక్‌ ప్లేసులు, ప్రైవేట్‌ స్థలాలు, హోటల్‌ రూమ్స్‌ చివరకు కట్టుకున్న భార్యపై అనుమానంతో బెడ్‌రూమ్‌లో కెమెరా అమర్చిన శాడిస్ట్, భార్య స్నానపు దృశ్యాలనే కెమెరాలో బంధించి, స్నేహితులకు షేర్‌ చేసిన పైశాచికపు మృగాడు.చెప్పుకుంటూ పోతే రోజుకో ఘటన, పూటకో అవమానం, క్షణానికో అఘాయిత్యం. 

నాన్‌ బెయిలబుల్‌ అవ్వాలి
మన దగ్గర గన్‌ ఉండాలంటే అనుమతి కావాలి. డ్రగ్స్‌ తీసుకోవాలంటే అనుమతి కావాలి. లిక్కర్‌ తీసుకోవాలంటే అనుమతి కావాలి. నిద్ర మాత్రలు వేసుకోవాలంటే అనుమతి కావాలి. మరి స్పై కెమెరాల కొనుగోలుకు అనుమతి ఎందుకు అవసరం లేదు. ఇష్టానుసారం కొనుక్కుని, వాడుకోవచ్చా! ప్రభుత్వం వీటిని నియంత్రించాలి. ఆన్‌లైన్‌లో ఆఫ్‌లైన్‌లో స్పై కెమెరాల అమ్మకం సరైన మార్గంలో ఉండాలి. 354సి, 2013 యాక్టులో  నాన్‌బెయిలబుల్‌ చేయాలి. పోర్న్‌ ఫొటోగ్రఫీ మీద సైట్లు 40 లక్షల దాకా ఉన్నాయి. వాటిని నియంత్రించాలి. ఇందుకోసం ప్రతిఒక్కరూ8099259925కి మిస్‌డ్‌ కాల్‌ ఇవ్వండి. యాంటీ రెడ్‌ ఐ టీమ్‌ ద్వారా మహిళలకు ఈ సమస్యను ఎదుర్కోవటానికి కావలసిన సాంకేతిక అవగాహన మేము కలిగిస్తాం.
–  జి. వరలక్ష్మి         
సంభాషణ: వైజయంతి పురాణపండ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top