అనుష్క కోసమే ఆ తగాదా?

అనుష్క కోసమే ఆ తగాదా?


కథ... మాటలు

కథ రాసుకుంటున్నప్పుడే సగం మాటలు పడిపోతాయి. అదేనండీ... డైలాగులు... కథలో భాగంగా వచ్చేస్తుంటాయి. మాటలు రాస్తున్నప్పుడు కథలో మార్పులు వస్తుంటాయి. అంతే మరి! మాటలు రాస్తున్నప్పుడే కదా... కథలోని గొప్పతనం, లోటుపాట్లు అర్థమయ్యేవి. పక్కనున్న దొరలిద్దరిలో... ఒకరు... కథల ఖజానా! మరొకరు... మాటల మొఘల్! ఫస్ట్‌టైమ్ ఇద్దరూ కలిసి మాట్లాడారు. కొత్త కథలా అనిపించింది.  ‘సాక్షి ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్... ఎంజాయ్.


 


అది పునాది. నేను పైన కనిపిస్తున్నా!

నమస్తే పరుచూరి గారూ! కంగ్రాట్స్ విజయేంద్రప్రసాద్ గారూ! ‘బాహు బలి’కి అవార్డొచ్చిన వేళ ఇద్దరు గొప్పరైటర్‌‌సతో మాట్లాడ్డం ఆనందం.



పరుచూరి గోపాలకృష్ణ: ప్రసాద్ గారు ‘బాహుబలి’ కథ రచిస్తే, మా రచయితల సంఘం సభ్యుడైన రాజమౌళి స్క్రీన్‌ప్లే రాసుకొని, తెరకెక్కించాడు. పసిబిడ్డ ‘అమ్మ’ అని నేర్చుకున్నట్లే ఇవాళ ప్రపంచమంతా ‘బాహుబలి’ అనే పదం నేర్చుకొని అర్థం తెలుసుకుంటోంది.

విజయేంద్రప్రసాద్: ఐస్‌ముక్క పైన కనిపించేది 10 శాతమే. నీటి లోపల 90 శాతముంటుంది. అలాగే బాహుబలి కథకి కారణం నేనొక్కణ్ణీ కాదు. పింగళి మొదలు మీదాకా ఎందరో రైటర్‌‌స ప్రభావం ‘బాహుబలి’పై లేదంటే అబద్ధం. అది పునాది! పైన కనిపిస్తోంది నేను.




పరుచూరి: టీవీలో అవార్డ్స్ చూడగానే ట్విట్టర్లో ‘ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురైంది’ అంటూ ‘తెలుగువాడికి జైజై! తెలుగువాడి మేధకు ఎదురన్నది నైనై!!’ అని పెట్టా. తల్లి, బిడ్డను చేతితో పైకి ఎత్తి బతికించే షాట్ ఎక్స్‌ట్రార్డినరీ! దాన్ని అరెస్టింగ్ స్క్రీన్‌ప్లే అంటారు.

విజయేంద్రప్రసాద్: సిన్మా ముగింపన్నాక ఆనందమో, దుఃఖమో, బాధో ఉంటాయి. కానీ ‘బాహుబలి’కొస్తే ముగింపు లేదు కదా అయోమయం! బాహుబలిని కట్టప్పెందుకు చంపాడో చెప్పలేదుగా! ఉత్కంఠగా ఉన్నచోటే సినిమా ఆపేయడమంటే చాలా ధైర్యమండి మీకు!

విజయేంద్రప్రసాద్: ధైర్యం కాదండీ మూర్ఖత్వం. మొండితనం. ఒక్కోసారి రిస్క్. ఎన్టీయార్ స్టార్‌గా సిన్మాలొదిలేసి పార్టీ పెట్టడంలాంటిది! 


     

కథలో మీ అబ్బాయి మీకు ఏవైనా మార్పులు చేర్పులు చెబుతుంటారా?

విజయేంద్రప్రసాద్: ఎవరైనా సరే మొదటిసారి వింటా ఏం చెప్పినా! రెండోసారి వినను. అది మా అబ్బాయి అయినా, వేరే ఎవరైనా!






తండ్రీకొడుకు, అన్నాతమ్ముడు ఒకే ఫీల్డ్‌లో ఉంటే వాదనలు వస్తాయేమో!

పరుచూరి: మా అన్నయ్యకి, నాకు వాదనలు ‘ఇవాళ్టితో వీళ్ళిద్దరూ విడిపోయార’నుకునేలా ఉంటాయి. అలాగే 38 ఏళ్లుగా రాస్తున్నాం.

విజయేంద్రప్రసాద్: రిలేషన్స్ స్క్రిప్ట్ డిస్కషన్స్‌లో కాదు. ఇంట్లోనే!

పరుచూరి: ఒకే ఏడాది ఈయన కథల్లో ఒకటి (‘బాహుబలి’) రూ.600 కోట్లు, మరోటి (‘బజ్‌రంగీ భాయీజాన్’) రూ.500 కోట్లు తెచ్చాయి. అంటే ఈయన నెత్తిమీదకి 1000 కోట్ల బాధ్యత వచ్చింది. (నవ్వులు)

విజయేంద్రప్రసాద్: ‘బజ్‌రంగీ’కథకి నాకు ఫస్ట్ 40 లక్షలిస్తామన్నారు. రెండున్నర కోట్లకి తక్కువైతే కథ ఇవ్వనన్నా! ఫైనల్‌గా 2 కోట్లిచ్చారు.


  

మీ దృష్టిలో సినిమా కథ అంటే?!


విజయేంద్రప్రసాద్: అబద్ధం! అదెంత బాగా ఆడితే అంత మంచి కథ.

పరుచూరి: అబద్ధాన్ని నిజమని నమ్మింపజేయడమే సినిమా. 


 

కథ అల్లుకుంటున్నప్పుడే కీలకడైలాగ్స్ వాటిలో భాగంగా తడతాయిగా!


పరుచూరి: ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’లో ‘రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా రోగితో సమానమే’ అని రాసి, రాత్రి నిద్రపోయా.

విజయేంద్రప్రసాద్: ‘ఛత్రపతి’లో ‘ఒట్టేసి ఓ మాట.. వేయకుండా ఓ మాట చెప్పనమ్మా’ డైలాగ్ స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు వచ్చిందే!

పరుచూరి: తొడకొట్టడాలు, పంచ్ డైలాగ్ ట్రెండ్ మొదలైంది మా బ్రదర్‌‌స డైలాగ్‌‌స రాసిన ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ నుంచి! ‘సమరసింహారెడ్డి’లో ‘నేను గట్టిగా తొడకొడితే ఆ సౌండ్‌కే చస్తావురా’తో అంతా ‘మా కూ అలాంటివి రాయండ’న్నారు. ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ (ఇంద్ర) లాంటి డైలాగ్‌‌స కనిపెట్టడానికే సరిపోయింది మాకు(నవ్వు).


 


రచయిత కష్టంతో హీరోకి ప్లస్

మీరు కథలకు ఎక్కడి నుంచి, ఎవరి నుంచి ఇన్‌స్పైర్ అవుతుంటారు?

విజయేంద్రప్రసాద్: బాలకృష్ణ ‘బొబ్బిలిసింహం’కి ‘ప్రేమాభిషేకం’ ఇన్‌స్పిరేషన్. అలాగే, ‘సమరసింహారెడ్డి’కి ‘సిందూరపువ్వు’లోని ఒక పాయింట్ ఇన్‌స్పిరేషన్. అది కేవలం సోల్. దాన్ని ప్రేరణగా తీసుకొని, ఒక కొత్త కథ, వాతావరణం డెవలప్ చేసుకున్నా.

పరుచూరి: నాట్ కాపీయింగ్. లేకపోతే, ‘పసివాడి ప్రాణం’ చూసి ‘బజ్‌రంగీ భాయీజాన్’ కథ రాయడమేంటి? (నవ్వు). రచయితకు సమాజం నుంచే కథలొస్తాయి. ‘బజ్‌రంగీ’ అలా వచ్చిందే. కానీ ‘బాహుబలి’ లాంటివి సమాజం నుంచి పుట్టవు, బుర్రలో నుంచే పుట్టాలి.


     

మరి, రామాయణ, భారత, భాగవతాల స్ఫూర్తితో రాసుకున్న కథలు?


విజయేంద్రప్రసాద్: మనం రాసే కథలన్నిటికీ మూలం అవేనండి.

పరుచూరి: సుకన్యోపాఖ్యానంలో తీర్పుతో ‘బొబ్బిలిబ్రహ్మన్న’ రాశా.




విజయేంద్రప్రసాద్ గారూ! మీరు కథకి కూర్చొనేప్పుడు క్లాసిక్స్ చూస్తార్ట!

విజయేంద్రప్రసాద్: ‘మాయాబజార్’, హిందీలో ‘షోలే’ చూస్తా. అవిచ్చే స్ఫూర్తి వేరు. రచయితకో గౌరవం తెచ్చింది‘మాయాబజార్’.

పరుచూరి: ‘సమరసింహారెడ్డి’ టైటిల్‌పై నిర్మాతకు మాకు క్లాష్ వచ్చింది. మాకివ్వాల్సిన లక్ష తెచ్చి, ‘ఇది ఇచ్చేస్తా. ‘సమరసింహ’ అని టైటిల్ పెడదాం’ అన్నాడు నిర్మాత. ‘ఆ లక్ష తీసుకెళ్లిపోండి, టైటిల్ ఇదే ఉండనీయండి’ అన్నాం మేము. అసలు ఆ కథ రాస్తున్నప్పుడు విజయేంద్రప్రసాద్ స్క్రిప్ట్‌కి పెట్టిన పేరే ‘సమరసింహారెడ్డి’.

విజయేంద్రప్రసాద్: అవును. నేను బొంబాయి నేపథ్యం పెడదామను కొన్నా. కానీ, నా అసిస్టెంట్ రత్నం గారు ‘వద్దు సార్ రాయలసీమ ఫ్యాక్షన్ పెడదాం’ అన్నారు. ఆ సినిమాలో రైలే ్వస్టేషన్లో సీన్‌కు బెజవాడలోని రంగ, రాధ, నెహ్రూ ఫ్యాక్షన్ కుటుంబాలే స్ఫూర్తి.


     

కానీ, అసలు ఇవాళ రచయితలకు తగిన గౌరవం ఉందంటారా?

పరుచూరి: మేము (పరుచూరి బ్రదర్‌‌స) 20 ఏళ్ళు పరిశ్రమను ఏలా మండీ. కానీ వాల్మీకినెవరు తల్చుకుంటారు, రాముణ్ణి తప్ప! ‘బాహుబలి’ అంటే మీకు ప్రభాస్, రాజమౌళి. మాకు  విజయేంద్రప్రసాదే.




{పసాద్‌గారూ! రాజమౌళి కాంబినేషన్‌లోనే మీరు విజృంభిస్తున్నారే?

పరుచూరి: ఆయన రాసిన ‘బొబ్బిలి సింహం’ లాంటి బయటి సిన్మాలూహిట్టే. తండ్రీకొడుకుల కాంబినేషన్‌కి ఎక్కువ క్రేజొచ్చింది.


     

ఒక రచయితకి ఇండస్ట్రీలో ఇవ్వాల్సినంత గుర్తింపు ఇస్తున్నారంటారా?


పరుచూరి: ప్రముఖ దర్శకులు త్రివిక్రవ్‌ు, రాజమౌళి, కొరటాల శివ రైటర్లే. అప్పట్లో దాసరి గారొక్కరే రాస్కొనేవారు కాబట్టి మిగతా దర్శకులకి రైటర్‌‌స కావాలి. నేటి దర్శకుల్లో సగం రచయితలు ఉన్నారు.


     

ఒక రచయిత దర్శకుడు కావడం వల్ల సమస్య ఉంటుందా?

పరుచూరి: మేం రాసి హీరోలతో చేసినవి ఆడాయి. హీరోలు లేకుండా సమాజ సమస్యలపై బయటివాళ్లతో మా డెరైక్షన్‌లో తీస్తే ఆడలేదు.


     

అసలు రచయితకి దర్శకుణ్ణవ్వాలనే ఆలోచన ఎందుకొస్త్తుంది?

విజయేంద్రప్రసాద్: అసలు నేనొచ్చిందే డెరైక్టర్ అవుదామని!

పరుచూరి: డెరైక్టర్‌కన్నా రైటర్‌కి విజనెక్కువ. ‘సమర సింహారెడ్డి’లో విలన్ వెళుతుంటే హీరో రెలైక్కి మెడ పట్టుకోవడం విజన్ రచయితదే! రైటర్‌‌స కష్టమంతా ఫైనల్‌గా హీరోలకే ప్లస్. అక్కినేనికి ‘ప్రేమాభిషేకం’ రాసిన దాసరి ‘బొబ్బిలిపులి’ ఎన్టీయార్‌కి రాసి తీశారు. హీరోల్ని మార్చితీస్తే అవుట్. జనానికి నచ్చదు. అదే విజన్.


 


ఆ అసంతృప్తి ఒకప్పుడుండేది!

డబ్బు పక్కన పెడితే, మీ శ్రమకు తగ్గ గుర్తింపు లేదనే అసంతృప్తి ఏదైనా?

విజయేంద్రప్రసాద్: ఏదో సాధించాలన్లేదు. దాన్తో అసంతృప్తీ లేదు.

పరుచూరి: సినిమా మాకు జీవితమిచ్చింది. అంతేకానీ రచయిత అయ్యామా, దర్శకుడయ్యామా అని కాదు. విజయేంద్రప్రసాద్ గారి దర్శకత్వంలోని ‘రాజన్న’కి జాతీయ అవార్‌‌డ రావాలి, కానీ రాలేదు. 


విజయేంద్రప్రసాద్: అవార్డు కాదు కానీ, కమర్షియల్ హిట్ కాలేదనే అసంతృప్తి ఒకప్పుడుండేది. తెలుగు, కన్నడ, తమిళాల్లో చేస్తున్న సైంటిఫిక్ థ్రిల్లర్ ‘వల్లి’ సిన్మా ఆ కొరత తీరుస్తుందని నమ్ముతున్నా!


   

ఆట్టే టైమ్ తీసుకోకుండా ఒక్కరోజులో రాసిన కథలేమైనా ఉన్నాయా?

పరుచూరి: ‘ఖైదీ, బొబ్బిలిబ్రహ్మన్న, ముద్దాయి’ అలా రాసినవే.

విజయేంద్రప్రసాద్: నేను నెల, 2 నెలల్లో రాసిన కథలైతే ఉన్నాయి.


     

మనకీ, తమిళ, మలయాళ చిత్రపరిశ్రమలకూ గమనించిన తేడా?

విజయేంద్రప్రసాద్: ఏ కథైనా నిలబడేది కథలో దమ్ముంటేనే! మలయాళ, తమిళ సిన్మాలు రియలిస్టిక్ ఫిల్మ్స్. అది మనవాళ్లకి నచ్చదు.

పరుచూరి: ‘వాన’ ఒరిజినల్ కన్నడ ‘ముంగారు మళె’ అక్కడ 70 వారాలు ఆడింది. ఇక్కడికొచ్చేసరికి మార్చమంటే కుదరదు అన్నారు. దాంతో అక్కడి హిట్ సిన్మా కాస్తా ఇక్కడ ఫ్లాప్. మన ప్రేక్షకులకు హీరోనే దేవుడు. హీరో ఓడిపోకూడదు, హీరోయిన్‌ను వదిలేసి వెళ్లకూడదు. మన కథలన్నీ ఇలానే తిరుగుతాయి. అది గుర్తించాలి.


   

మరి, కథ రాసుకునేటప్పుడు మీరు ఎటువంటి సూత్రాలు పాటిస్తారు?


పరుచూరి: వ్యాపారస్తుడు వస్తువునెలా అమ్మాలా అని చూస్తాడు. నిర్మాత తన సినిమాను ప్రేక్షకులకెలా చూపించాలా అని చూస్తాడు. దాంతో నిర్మాత పెట్టిన డబ్బులు వాళ్లకు తిరిగి రావడానికి, నైతిక విలువలు కొన్ని పోగొట్టుకుంటూ ఉంటాం! మద్రాసులో మాకు ఓ బాయ్ ఉండేవాడు. వాడు ‘ముందడుగు’ సిన్మా దాదాపు 20 సార్లు చూశానన్నాడు. కథ నచ్చిందేమోనని నేను సంబరపడిపోయా. తీరా అడిగితే శ్రీదేవి గ్లామర్ కోసం చూశానని చెప్పాడు! (నవ్వులు).


     

ఇంతకీ, ఒక బెస్ట్ స్క్రిప్ట్‌కి ఉండాల్సిన లక్షణాలేమిటి?


పరుచూరి: ప్రేక్షకులకి వీక్షణీయంగా ఉండాలి. దటీజ్ ద బెస్ట్ స్క్రిప్ట్. సిన్మా చూసిన వాళ్ల మొహంలో తెలిసిపోతుంది హిట్టా, ఫట్టా అన్నది!




అనుష్క కోసమే ఆ తగాదా?

‘బాహుబలి’ పార్ట్1లో కథకు ముగింపు ఇవ్వకపోవడంపై విమర్శలు...

పరుచూరి: విమర్శ మానవ లక్షణం. అంతపెద్ద సినిమా, అన్ని కోట్లు వసూలు చేసిన సక్సెస్ సిన్మాపై విమర్శ చేయడమంటే ఫైనల్‌గా వాళ్లే ఆత్మవిమర్శ చేస్కోవాలి. అంతేతప్ప రచయిత, దర్శకుడు కాదు!

విజయేంద్రప్రసాద్: చైనాలో ‘బాహుబలి1’ త్వరలో 500 హాళ్లలో రిలీజ్ అవుతోందండి. అంటే అక్కడా 100 కోట్లు వస్తాయి కదా! అయినా, రామాయణ, భారత, భాగవత కాలం నుంచే విమర్శలున్నాయండి.

పరుచూరి: గాంధీనే విమర్శించిన వాళ్ళున్న దేశం మనది.




వంద, 150వ చిత్రాలంటే హీరోలకున్నట్లే మీకూ ఒత్తిడి ఉంటుందా?

పరుచూరి: మాకు ప్రెజర్ అంతా మీ మీడియా వల్లే! ‘చిరంజీవి 150వ సినిమా’, ‘బాలకృష్ణ 100వ చిత్రం’ అంటూ మా ప్రాణాలు తోడేస్తున్నారు కదా! అది ఎన్నో సినిమానో చెప్పుకుండా తీయొచ్చు కదా! అది ఇన్నో చిత్రమని ముందుగా చెప్పేసి, అంచనాలు భారీగా పెంచేస్తే ఆ ఒత్తిడి మాపైన కూడా పడుతుంది కదా! ‘నిప్పురవ్వ’ పరుచూరి బ్రదర్స్ 200వ సినిమా అని ఏదేదో చెప్పేసి ఆకాశానికి అంచనాలు పెంచారు. దాంతో, అది ఆశించిన విజయం సాధించలేదు. హీరో కృష్ణగారి 200వ సినిమా ‘ఈనాడు’ అని మాకు తెలీదు. రాసేశాం. కానీ, 300వ సినిమాకు ముందే చెప్పేసరికి, అనవసర హంగామా మొదలైంది. అసలు కృష్ణగారు 300వ చిత్రంగా ‘తెలుగువీర లేవరా’ బదులు ‘అడవిలో అన్న’ కథ ఇమ్మన్నారు. కానీ ఈవీవీ సత్యనారాయణగారు దర్శకుడు. ‘ఆయనకు ఎలా ఎక్కుతుంది? అది నక్సలైట్ల కథ కదా’ అన్నాం. ‘కావాలంటే, మీరే దర్శకత్వం కూడా చేద్దురు గాని’ అన్నారు. మేము ఒప్పుకోలేదు.


     

విజయేంద్రప్రసాద్ గారూ ‘బాహుబలి 2’ విషయంలో మీపై ఒత్తిడి లేదా?

విజయేంద్రప్రసాద్: ఆ కథ ఎప్పుడో పూర్తయిపోయిందండి.

పరుచూరి: నిజమే. కథ ఎప్పుడో సిద్ధమైపోయింది, ఇక తీసేవాడిపై ఆ ఒత్తిడి ఉంటుంది. ఇంకా ఎన్ని విజువల్ ఎఫెక్ట్స్ తీసుకురావాలి, ఏం చేయాలని! ఇప్పుడున్న లొకేషన్స్ మళ్లీ చూపించడానికి కుదరదు! కొత్త వాతావరణం సృష్టించాలి. ఆ బాధంతా ఇక డెరైక్టర్‌ది! 


     

ఇంత పేరు, వసూళ్ళు వచ్చాక కథలో ఏవైనా మార్పుచేర్పులు చేశారా?


విజయేంద్రప్రసాద్: చేయలేదండి. అప్పటికే కథ సిద్ధమైపోయింది.

పరుచూరి: మార్చలేరండీ! ఎందుకంటే బాహుబలి 1వ పార్ట్‌గా మనం చూసింది కథలో సెకండాఫ్. రాబోయే 2వ పార్ట్‌లో ఫస్టాఫ్ చూస్తారు.


     

అసలు ఇంతకీ ఆ కథేమిటో?


పరుచూరి: (అందుకుంటూ...) ఒక రైటర్‌గా నేను ఊహిస్తున్నదేమిటంటే... హీరోయిన్ అనుష్కపై ప్రభాస్, రానాలు - ఇద్దరూ ప్రేమలో పడతారు. అనుష్క వల్ల వారిద్దరి మధ్య విద్వేషం పెరుగుతుందని! అసలు కథ ఇది అవునో, కాదో కానీ... ఆస్తి కోసం కాదు అమ్మాయి కోసం పోరాడితేనే ఎప్పుడైనా సిన్మా సూపర్‌హిట్. కచ్చితంగా అనుష్క వల్లే రానా, ప్రభాస్‌ల మధ్య గొడవ అని నా ఊహ.


 

ఇంతకీ కథ అదేనా విజయేంద్రప్రసాద్ గారూ?

విజయేంద్రప్రసాద్: (ముసిముసినవ్వుతో) వచ్చే ఏడాది దాకా ఆగండి!




పోనీ ఒక్కడౌట్ తీర్చండి. ఇంతకీ బాహుబలిని కట్టప్ప చంపిందెందుకు?

విజయేంద్రప్రసాద్: రూ. 150 కోట్ల చెక్కు పట్టుకు రండి! అప్పుడు చెబుతా! (అందరూ గట్టిగా నవ్వులు...)


 


ఓటమి నుంచే సక్సెస్ వెతుక్కోవాలి. ఓటమి ఎప్పుడూ గుణపాఠం నేర్పుతుంది. ఓటమితో నిరాశలో పడిపోకూడదు! మన సినిమాలు కొన్ని సక్సెస్ కాలేదని బాధ పడుతూ కూర్చుంటే లాభం లేదు. దాన్ని మరచిపోయి ముందుకెళ్లడమే! నేను ఆ పనే చేశాను. ఫలితమే - ఇవాళ్టి  ‘బాహుబలి’, ‘బజ్‌రంగీ భాయీజాన్’ దాకా నా జర్నీ!   - విజయేంద్రప్రసాద్


 


ఓ సారి ఎన్టీయార్ గారు ‘మాదేముంది బ్రదర్ తోలు బొమ్మలం! రచయిత, దర్శకులు దారాలు బాగా కదిపితే బాగా ఆడతాం. వదిలేస్తే కూలిపోతాం. ‘కొండవీటి సింహం’లో ఎన్టీయారే. ‘తిరుగులేని మనిషి’లోనూ అదే ఎన్టీఆర్! అదే రచయిత, అదే దర్శకుడు! ఇక్కడ దారాలు బాగా కదిపారు, అక్కడ సరిగ్గా కదపలేదు’ అన్నారు.  - పరుచూరి గోపాలకృష్ణ


 


మామూలు కథకీ, సినిమా కథ రాయడానికీ తేడా ఉంది. సిన్మా కథంటే - ‘ఈ కథ రాస్తే ప్రేక్షకుల నుంచి ఎన్ని డబ్బు లొస్తాయి’ అని ఆలోచిస్తాం. దాన్ని బేస్ చేసుకుని మిగతా వన్నీ పేర్చాలి. అది ఇంపార్టెంట్! ఒకప్పుడు సిన్మాల్లో నేరుగా కథలోకి వెళ్ళేవారు కాదు. కానీ ఇప్పుడు కథ ఫస్ట్ సీన్‌లోనే స్టార్టవ్వాలి. అరెస్టింగ్‌గా కూర్చోబెట్టాలి. నా కథలు అంతే!  - విజయేంద్రప్రసాద్


 


‘బాహుబలి2’కి ఆస్కార్ అవార్డు వస్తే బాగుంటుందని పిస్తోంది. ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో భారతీయ సిన్మాకి తొలి ఆస్కార్ తెచ్చిన ఘనత కూడా మా విజ యేంద్రప్రసాద్, రాజమౌళికి దక్కాలని కోరుకుంటున్నా. ఆ అవార్డు మన సినిమాకి వస్తే- ఈ తండ్రీ కొడుకుల జన్మతో పాటు తెలుగువారి జన్మ కూడా ధన్యమైనట్లే!  - పరుచూరి గోపాలకృష్ణ


 


 - రెంటాల జయదేవ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top