అన్నీ ఉన్నా కొందరికి అల్లుడి నోట్లో శని అన్నట్లు... కొందరి ఇంట్లో నిత్యం ఏవేవో చికాకులు.
అన్నీ ఉన్నా కొందరికి అల్లుడి నోట్లో శని అన్నట్లు... కొందరి ఇంట్లో నిత్యం ఏవేవో చికాకులు. ఎవరికీ మనశ్శాంతి ఉండదు, అనారోగ్యాలు, అనవసర కోపతాపాలు వంటివి నిత్యకృత్యంగా కొనసాగుతూ ఉంటాయి. ప్రతికూల గ్రహస్థితులు, ప్రతికూల గ్రహాల దశలు జరిగే సమయంలో ఇలాంటి ఇబ్బందులు పట్టి పీడిస్తాయి. అలాంటి వాటి నుంచి ఉపశమనం పొందాలంటే...
♦ చీమలకు ఆహారంగా చీమల పుట్టల వద్ద పంచదార వేయండి. వీలు కుదిరినప్పుడల్లా ఆడపిల్లలకు మిఠాయిలు తినిపించండి. ఈ పనులకు వారం వర్జ్యాలు చూసుకోవాల్సిన అవసరం లేదు.
♦ కుంకుమ, కర్పూరం పొట్లంగా కట్టి, నిద్రించేటప్పుడు తలదిండు కింద పెట్టుకోవడం వల్ల కొంత వరకు చికాకులు తొలగుతాయి.
♦శివాలయంలో నమక చమక పారాయణం చేస్తూ శివలింగానికి జలాభిషేకం చేయండి. ఇలా కనీసం ఇరవై ఒక్క సోమవారాలు కొనసాగిస్తే ఫలితం ఉంటుంది.
♦ఆంజనేయ ఆలయంలో మంగళవారం సిందూరాన్ని, ఎరుపు రంగు వస్త్రాన్ని దానం చేయండి. ఆలయం బయట ఉండే పేదలకు అరటిపండ్లు పంచిపెట్టండి.
♦ బాగా నూనె ఓడుతూ ఉండే పదార్థాలను తినడం పూర్తిగా మానేయండి. ఇంటి ప్రవేశద్వారానికి పసుపురంగు కర్టెన్లు వాడండి.
♦ ప్రతి శనివారం చందనం కలిపిన నలుగుపిండితో స్నానం చేయండి. తర్వాత ఆంజనేయ ఆలయానికి వెళ్లి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆలయం వద్ద పేదలకు నువ్వుండలను పంచిపెట్టండి.
– పన్యాల జగన్నాథదాసు