సరిగమలకు విలువలను కలిపారు

సరిగమలకు విలువలను కలిపారు


ఏ గూటి చిలక ఆ గూటి పలుకే పలుకుతుందంటారు.

 బహుశా కోయిల కూడా...

 తన గూటి పాటే పాడుతుందేమో!

 అయితే రాష్ట్రంలోని వందలాది చిన్నారి కోయిలలిప్పుడు...

 ఏ వేదిక మీద పాడినా, ఒకే గూటి పాట పాడుతున్నాయి !

 ఆ గూడు... ‘లిటిల్ మ్యుజీషియన్స్ అకాడమీ’.

 ఆ గూటి ‘గురుకోయిల’...

 కొమండూరి రామాచారి.

 ఆయన దగ్గర రెండు పాఠాల్లేవు, రెండు ప్యాకేజీల్లేవు.

 సొంతబిడ్డలకైనా, సంగీతానికొచ్చేవారికైనా...

 ఒకటే సిలబస్! ఒకటే నోట్స్! ఒకటే జీవనసారం!

 కొడుకు సాకేత్, కూతురు సాహితిలకు...

 మ్యూజిక్‌తోపాటు, మోరల్స్ నేర్పించే క్రమంలో...

 రామాచారి, సుజాత సాధన చేస్తున్న

 సమన్వయ గీతమే ఈవారం మన ‘లాలిపాఠం’!


 

టీవీ పెడితే రియాలిటీ షోలలో పదేళ్ల పిల్లలు పాటలు పాడుతుంటారు, సాంస్కృతిక కార్యక్రమానికి వెళ్తే అక్కడా ఈ పిల్లల్లో ఎవరో ఒకరు మైక్‌లో పాటలు పాడుతూ కనిపిస్తారు. సినిమాకెళ్తే నేపథ్య గాయకుల పేర్లలో ఈ పిల్లల్లో ఒకరిద్దరి పేర్లయినా కనిపిస్తాయి. ఇదీ నేటి మన సరిగమల ప్రపంచం. సాగరంలాంటి సంగీతం తన అలల జడితో అందరినీ అలరిస్తోంది. ప్రొఫెషనల్ సింగర్స్‌గా కెరీర్‌ని మలుచుకున్న ఈ పిల్లల్ని ‘మీ గురువులు ఎవరు’ అని అడిగితే... చాలామంది చెప్పే సమాధానం రామాచారి అనే. శాస్త్రీయ సంగీతం ఎవరి దగ్గర నేర్చుకున్నప్పటికీ లైట్ మ్యూజిక్‌లో శిక్షణ మాత్రం రామాచారి స్థాపించిన లిటిల్ మ్యూజీషియన్ అకాడమీలోనే. మరి ఈ ట్రెండ్‌సెట్టర్ రామాచారి పిల్లలు సాకేత్, సాహితిలు కూడా సరిగమలనే పలుకుతున్నారు. ఈ తండ్రి పెంపకంలో వీరికి సంగీతం అలవడిందా లేక... జన్యువుల్లోనే సరిగమలను ఒంటబట్టించుకున్నారా అంటే, ‘కడుపులో ఉన్నప్పటి నుంచే సరిగమలను విన్నారు మా పిల్లలు’ అంటారు రామాచారి, సుజాత దంపతులు.

 

 ‘‘మా నాన్నగారు కృష్ణమాచారి కూడా గాయకులే. ఆయన వేదపండితుడు, పూజారి, హరిదాసు. మా సొంత ఊరు మెదక్ జిల్లా, శివంపేట మండలం, పెద్ద గొట్టిముక్కల గ్రామం, ఆ పరిసరాలను దాటి బయటకు రాలేదు. మా అమ్మ యశోదమ్మ గ్రామంలో వేడుకలలో మంగళహారతులు పాడేది. వాళ్లు సంగీతాన్ని శాస్త్రీయంగా నేర్చుకోలేదు. కానీ గానం అనే జన్యువు నాలో ప్రవహించడానికి కారకులు. నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకుని దూరదర్శన్ కార్యక్రమాల్లో పాడేవాడిని. ‘పాడుతా తీయగా’ కార్యక్రమంతో పదిమందికి తెలిశాను. అప్పటికి సాకేత్ పుట్టాడు కూడ. నేను చెప్పేదేమిటంటే... సంగీత ప్రపంచంలో స్థిరపడడానికి నేను చేసిన ప్రయత్నాలు మా పిల్లల కళ్లెదుటే జరిగాయి. వాళ్లు మాటలు రాకముందు నుంచి ఇంట్లో నా పాట వింటుండేవారు. పదాలను పలకడానికి నాలుక తిరగక ముందు నుంచే వాళ్ల గొంతులు రాగాన్ని పలికించడానికి ప్రయత్నించాయి. సంగీత శబ్దాలను ఒంటబట్టించుకున్నారు. నిజానికి సంగీత జ్ఞానం ఒంటబట్టడానికి వీటన్నింటికంటే ముందుగా దైవకృప ఉండాలి. భగవంతుని దయ వల్ల అది మా ఇంట్లో ఉంది’’ అంటారు రామాచారి.

 

గురువు... తండ్రి!
గురువుగా, తండ్రిగా రెండు బాధ్యతలను నిర్వర్తించడంలో ఇబ్బంది పడలేదంటారాయన. ‘‘ఆడియో రికార్డింగ్ స్టూడియో, లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ(ఎల్‌ఎమ్‌ఎ), ఇల్లు... ఇదీ నా ప్రపంచం. వృత్తి, ప్రవృత్తి, ఇంటిని కలపను. ఇంట్లో నా పిల్లలను కేవలం తండ్రిని. వాళ్లు అకాడమీకి వచ్చినప్పుడు గురువుని మాత్రమే. అలాగే ఎంతో డబ్బు సంపాదించేయాలని ఆడియో రికార్డింగ్ స్టూడియోకే అంకితం కాను. నా కారణంగా ఎవరూ అసంతృప్తికి లోను కాకూడదని నమ్ముతాను. లిటిల్ మ్యూజీషియన్స్ అకాడమీ ద్వారా స్టూడెంట్స్‌కి ఫీజులేకుండా సంగీతంతోపాటు జీవిత విలువలని కూడా నేర్పిస్తూ మంచి హ్యూమన్ బీయింగ్స్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాను. కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తోపాటు దేశభక్తి, వసుధైక కుటుంబ భావనలు అలవరుస్తున్నాను. వీటిని స్టూడెంట్స్‌తోపాటు నా పిల్లలూ నేర్చుకున్నారు’’ అని రామాచారి చెబుతుండగా సుజాత ‘‘నేను పిల్లలను తీసుకుని ఎల్‌ఎమ్‌ఎకి వెళ్లేదాన్ని, అక్కడ మిగతా పిల్లల పేరెంట్స్‌లాగ నేను మా పిల్లలకు తల్లిని మాత్రమే’’ అన్నారు.

 

తరం మారింది!
‘ఒకప్పుడు మనిషి జీవించడానికి తన ఊరు, ఆ చుట్టుపక్కల ఉన్న పది-ఇరవై గ్రామాలు తెలిస్తే చాలన్నట్లు ఉండేది. ఇప్పుడు జీవిత చిత్రం మారింది’ అంటారు రామాచారి. ‘‘విశాలవిశ్వంలో ప్రతి మూలా మనదే! నీ నైపుణ్యానికి తగిన అవకాశం ప్రపంచంలో ఏ మూల ఉన్నా అక్కడ నీవు నీ ఉనికిని చాటాలి అని చెప్తాను. సాకేత్ ఆరవ తరగతిలో ఉన్నప్పుడు... సంగీతం నేర్చుకుని మ్యూజిక్ కంపోజర్‌ని అవుతానని స్పష్టంగా చెప్పేశాడు. అప్పుడు పియానో కొనిచ్చి, శిక్షణ ఇప్పించడం మొదలుపెట్టాం. సాహితి చదువునీ, సంగీతాన్ని బాలెన్స్ చేసుకోవాలంటుంది. పిల్లల విషయంలో తల్లిదండ్రులకు కచ్చితమైన అంచనా ఉండాలి. ఒక రంగం పట్ల తల్లిదండ్రులకు ఇష్టం ఉంది కాబట్టి పిల్లలచేత సాధన చేయించాలనుకుంటే అది సాధ్యం కాకపోవచ్చు. అలాగే కొన్నిసార్లు పిల్లలకు ఇష్టం ఉన్నా, స్కిల్ లేకపోతే రాణించలేరు. అలాగని స్కిల్ ఉన్న పిల్లలను మెరుగులు దిద్దకుండా వదిలేసినా రాణిస్తారని కాదు. స్వతహాగా నైపుణ్యం ఉంటే దానికి తల్లిదండ్రుల ఆసక్తి, పిల్లల ఇష్టం తోడయితే లక్ష్యానికి చేరవచ్చు. పిల్లల నైపుణ్యం తెలుసుకోవడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైనది’’ అన్నారు.

 

మానవత్వం నేర్పిస్తే...
పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోకుండా పెంచాలనే తన అభిప్రాయంతో సుజాత ఏకీభవించిందంటారు రామాచారి. ‘‘మా పిల్లలు... అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు, బాబాయ్... ఇలా సంపూర్ణమైన ఉమ్మడి కుటుంబంలో పెరిగారు. పిల్లలకు మానవత్వం నేర్పిస్తే మిగిలినవన్నీ వాటంతట అవే అలవడతాయి. మానవత్వం అలవడితే ‘మీరు నానమ్మను బాగా చూసుకోవాలి, అమ్మమ్మను బాగా చూసుకోవాలి’ అని పేరుపేరునా చెప్పాల్సిన పని ఉండదు’’ అంటారు.

 

తల్లిదండ్రుల ప్రభావం!
సాహితి, సాకేత్‌ల మీద తండ్రి  ప్రభావాన్ని చెబుతూ... ‘పిల్లల మీద మాత్రమే కాదు నా మీద కూడా వీరి ప్రభావమే ఉంటుంది’ అని నవ్వుతూ రామాచారిని చూపించారు సుజాత. సాకేత్ నాలాగ ఓపెన్ అనీ, సాహితికి వాళ్ల నాన్నగారిలా అబ్జర్వేషన్ ఎక్కువనీ చెబుతుంటారు. నేను లెక్చరర్‌ని. పిల్లల్ని స్కూల్‌కి పంపించి కాలేజ్‌కెళ్లేదాన్ని. వాళ్ల చదువు, హోమ్‌వర్క్, శాస్త్రీయ సంగీతం క్లాసులకు తీసుకెళ్లడం వంటివన్నీ నేనే చూసుకునేదాన్ని. ఈయన మాటల్లో నాకు బాగా నచ్చినది... ‘మనిషి ఆచార, విచార, వ్యవహారాలు బాగుంటే ఆనందంగా, ఆహ్లాదంగా, హాయిగా జీవించగలుగుతాడు’ అనే మాట. ‘కళాకారుడికి దార్శనికత ఉండాలి, శారీరక మానసిక ఆరోగ్యం బావుండాలి, ఇవన్నీ కలిస్తేనే కళారూపం. అప్పుడే పాటలో భావంతోపాటు జీవం కూడా ఉంటుంది. ఆ పాట శ్రోతల మనసును తాకుతుంది’ అంటారు, ఆచరిస్తారు కూడ. పిల్లలు ఏం చేసినా కోప్పడరు, కానీ ఆ పని వల్ల ఎదురయ్యే పరిణామాలను వివరిస్తారు. ఆ పని మరోసారి చేయకూడదని వాళ్లకు వాళ్లే అనుకునేటట్లు చెప్పే నైపుణ్యం ఉంది. సాకేత్ చిన్నప్పుడు చాలా అల్లరి. అయినా ఒక్క దెబ్బ కొట్టలేదు. కాలేజ్ ఎగ్గొట్టి ‘కొత్తబంగారు లోకం’ సినిమాకెళ్లాడు. ఏం చేసినా ఇంట్లో చెప్పేవాడు. అప్పుడూ ఏమీ అనరు’’ అన్నారామె.

 

హైదరాబాద్‌లో నల్లకుంట, రామాలయం వీథిలో ఉన్న రామాచారి ఇంట్లోకి అడుగుపెడుతుంటే... లోపలి గదిలో నుంచి సన్నగా సంగీతం వినిపించింది. ముందుగదిలో ఉన్న లెక్కలేనన్ని జ్ఞాపికలు... ఈ కుటుంబం చేస్తున్న సంగీతసాగర మధనం లోతులకు ప్రతీకలుగా ఉన్నాయి. ఈ దంపతులతో మాటల్లో జీవితపు లోతులను తాకి జీవనసారాన్ని పైకి తీసిన నైపుణ్యం కనిపించింది.

 - వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 

స్నేహమే సరైన మార్గం!


తొమ్మిదవ తరగతి నుంచి డిగ్రీ వరకు పిల్లల్ని చాలా నిశితంగా గమనిస్తుండాలి. అవసరమైతే వారి ఆలోచన విధానాన్ని సరిచేస్తుండాలి. పిల్లల పెంపకంలో క్లిష్టమైన దశ ఇదే. ఎక్కువ సమయం పిల్లలతో గడపాలి. వాళ్లు చెప్పే కబుర్లన్నీ వినాలి. స్నేహంగా మెలగాలి. అంతేతప్ప వారిని కోప్పడి, భయపెట్టి దారిలో పెట్టలేం.

- రామాచారి, గాయకులు

 

సాకేత్...

వయసు 21. వోకల్ మ్యూజిక్‌లో నాలుగేళ్ల కోర్సు, పియానోలో మూడేళ్ల కోర్సు పూర్తిచేసి ఇప్పుడు ఆడియో ఇంజనీరింగ్ డిప్లమో చేస్తున్నాడు. సినిమాలకు పాటలు పాడుతున్నాడు. జాతీయస్థాయి గాయకుడిగా, మ్యూజిక్ కంపోజర్‌గా ఎదగాలని కోరిక.

 

సాహితి...

వయసు 15. పదవ తరగతి చదువుతోంది. రియాలిటీ షోలలో పాల్గొంటోంది. సీరియల్స్‌లో నేపథ్యగానం చేస్తోంది. నేపథ్య గాయనిగా స్థిరపడాలని కోరిక.

 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top