ఆమె అంటే సౌదీకి హడల్ | She huddle to Saudi | Sakshi
Sakshi News home page

ఆమె అంటే సౌదీకి హడల్

Nov 7 2016 11:44 PM | Updated on Aug 20 2018 7:33 PM

ఆమె అంటే సౌదీకి హడల్ - Sakshi

ఆమె అంటే సౌదీకి హడల్

సొవాద్ అల్ షమ్మరి.... ఈ పేరు చెప్తే ఇప్పుడు సౌదీలోని మగ సమాజం, మత పెద్దల సమాజం ఉలిక్కి పడుతోంది.

సొవాద్ అల్ షమ్మరి....  ఈ పేరు చెప్తే ఇప్పుడు సౌదీలోని మగ సమాజం, మత పెద్దల సమాజం ఉలిక్కి పడుతోంది. ఎప్పుడు ఏ ఉద్యమం లేవదీస్తుందో ట్విట్టర్‌లో ఏ కామెంట్ పోస్ట్ చేస్తుందో అని అంతా హడలి చస్తున్నారు. దాని కారణం- ఆమె పోరాటంలో సత్యం ఉంటుంది... ఆమె కామెంట్‌లో నిజాయితీ ఉంటుంది.

తాజాగా సొవాద్ తన ట్విట్టర్ అకౌంట్‌లో ఒక సంచలనం రేపింది. అన్ని మతాలకు చెందిన పెద్దల ఫొటోలతో పాటు గడ్డం ఉన్న ఒక కమ్యూనిస్టు ఫొటోని,  ఫ్యాషన్‌గా గడ్డం పెంచుకున్న మరో వ్యక్తి ఫొటోని పెట్టి ‘పెద్ద పెద్ద గడ్డాలు ఉన్నంత మాత్రాన అందరూ పుణ్యాత్ములు అయిపోరు’ అని కామెంట్ చేసింది. మత విశ్వాసాలను పాటించడానికి అంతర విశ్వాసం ముఖ్యమని బాహ్య ప్రదర్శనాలు కావని చెప్పడానికి ఆమె ఈ కామెంట్ చేసింది. పెద్ద పెద్ద గడ్డాలు పెంచుకున్నవాళ్లు గొప్ప మతాధికారులుగా చెలామణి అవుతున్నారన్న చురక కూడా అందులో ఉంది. దాంతో సౌదీలోని కొందరు మతాధికారులు మండిపడ్డారు. ఇలా మాట్లాడుతున్నందుకు సొవాద్‌ను దండించాలన్నంత వరకూ ఈ డిమాండ్ వెళుతోంది. ఈ నేపథ్యంలో మొన్న- అంటే అక్టోబర్ 28న ఆమెను జెడ్డాలో అదుపులోకి తీసుకుని 24 గంటల తర్వాత వదిలిపెట్టారు.

ఎడారి నుంచి ఎదిగి...
సొవాద్ అల్ షమ్మరి సౌదీ రాజధాని రియాద్‌కు సమీపంలోని ‘హయిల్’ అనే గిరిజన ప్రాంతం నుంచి వచ్చింది. ఆమె తండ్రి దాదాపు ఒక రైతు కూలీ లాంటి వాడు. పన్నెండు మంది సంతానంలో షమ్మరి పెద్దది. గొర్రెలమందను ఆమే మేపాల్సి వచ్చేది. అయితే షమ్మరి అలాగే ఉండిపోక వంశపారంపర్యంగా వస్తున్న ‘కచ్చేరి తీర్పరి’ పని కూడా చేసేది. స్థానిక తగాదాలను ఇస్లాం షరియత్ ఆధారంగా తీర్చే పని అది. అయితే షమ్మరి ఈ పనితోనే ఆగిపోకుండా చదువుకుంది.  హయిల్ యూనివర్సిటీ నుంచి ఇస్లామిక్ స్టడీస్‌లో డిగ్రీ చేసి 17 ఏళ్ల వయసులో టీచర్ అయ్యింది. తన రెండింతల వయసున్న వ్యక్తిని పెళ్లి చేసుకుని 20 ఏళ్ల వయసులో విడాకులు తీసుకుంది. విడాకుల వ్యవహారాన్ని ఏ జడ్జీ అయితే చూశాడో ఆ జడ్జీనే రెండో పెళ్లి చేసుకుంది.

కూతురితో పోరాటం మొదలు...
సొవాద్‌కు మొదటి భర్త ద్వారా పుట్టిన కూతురుకి ఏడేళ్ల వయసు వచ్చినప్పుడు సమస్య మొదలయ్యింది. తల్లి రెండో పెళ్లి చేసుకుంది కనుక నా కూతురిని  నాకిచ్చెయ్యండి అని మొదటి భర్త కోర్టుకెక్కాడు. షరియత్ ప్రకారం ఎనిమిదేళ్లు వచ్చిన ఆడపిల్ల మారుటి తండ్రి ఉన్న ఇంట్లో కంటే సొంత తండ్రి ఉన్న ఇంట్లోనే క్షేమంగా ఉంటుంది అని మత పెద్దలు తీర్పు చెప్పారు. దీన్ని సొవాద్ తీవ్రంగా ఖండించింది. నా కూతురు నా దగ్గర ఉండటం ముఖ్యం అని అరిచి గీ పెట్టింది. కాని ఎవరూ వినలేదు. ఇస్లాం ప్రకారం ఇదే సరైన తీర్పు అని చెప్పారు. జడ్జీగా ఉన్న రెండో భర్త కూడా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేదు. ఇది ఇస్లాంలో ఆడవారికి జరుగుతున్న అన్యాయంగా సొవాద్ భావించింది. అప్పటి నుంచి స్త్రీల తరఫున పోరాడాల్సిన పని చాలా ఉందని సొవాద్ ఉద్యమకారిణిగా జీవితాన్ని ప్రారంభించింది.

మూడు నెలలు జైలులో....
సౌదీలో స్త్రీల విషయంలో, మతం విషయంలో సంస్కరణల కోసం సొవాద్ ఒక ఆన్‌లైన్ గ్రూప్‌ను నడుపుతోంది. అందులో తరచూ తన అభిప్రాయాలు పంచుకుంటుంది. అయితే ప్రభుత్వం దీనిని భరించలేకపోయింది. ‘జనాన్ని రెచ్చగొట్టడం’ అనే అభియోగం కింద సొవాద్‌ను 2015 నవంబర్‌లో అరెస్టు చేసి 2016 జనవరిలో విడుదల చేసింది. అయితే జైలులో ఉన్న మూడు నాలుగు నెలల కాలంలో కూడా సొవాద్ తనను కలిసే స్త్రీలకు సలహాలు ఇస్తూ గడిపింది. ‘ఎందుకంటే నేను మనిషిని’ అనే పేరుతో సొవాద్ రాసిన పుస్తకాన్ని సౌదీలో నిషేధించారు. తన ఆన్‌లైన్ గ్రూప్‌కు సహ వ్యవస్థాపకుడైన రయీఫ్ బదావీకి యాభై కొరడా దెబ్బలు కొట్టి పదేళ్ల జైలు శిక్ష విధించారు. అయినా సరే సొవాద్ కొంచెం కూడా వెనక్కు తగ్గడం లేదు. ‘అల్లాహ్ దృష్టిలో స్త్రీలు పురుషులు సమానమే’ అని గట్టిగా అక్కడి సమాజానికి చెప్పదలుచుకుంది.

ఆరుగురు పిల్లల తల్లి...
మొదటి భర్త ద్వారా కలిగిన కూతురిని ఎనిమిదేళ్ల తర్వాత అంటే ఆ కూతురికి 16 ఏళ్ల వయసు వచ్చాక సొవాద్ తిరిగి దక్కించుకోగలిగింది. భర్త జబ్బున పడటం అత్తగారు చనిపోవడం ఇందుకు కారణం. రెండో భర్త ద్వారా కలిగిన ఐదుమంది పిల్లలు పెద్ద కూతురూ మొత్తం ఆరుగురు పిల్లలతో సొవాద్ ఇప్పుడు ఆనందంగా ఉంది. ఆసక్తి కలిగించే సంగతి ఏమిటంటే- సొవాద్ రెండో భర్త నుంచి కూడా విడాకులు తీసుకోవడం. ఇప్పుడామె సింగిల్ మదర్. తల్లితండ్రులు ఆమెను కాదనుకున్నా, పుట్టిన ప్రాంతం ఆమెను శాపనార్థాలు పెడుతున్నా, భర్త తోడు లేకపోయినా సొవాద్ తన లక్ష్యం నుంచి మరలిపోదలుచుకోవడం లేదు. నా పోరాటం ఆగదు అంటోంది సొవాద్.  సౌదీ సమాజంలో స్త్రీలకున్న సమస్యలన్నీ లోకానికి తెలిసే అవకాశం లేదు. కాని వాటిని సొవాద్ పరిష్కరించే పనిలో మాత్రం ఉంది.

కారు డ్రైవింగ్...
సౌదీలో స్త్రీలు కారు నడపడం నిషిద్ధం. దీనిని వ్యతిరేకిస్తూ చాలామంది ఉద్యమకారులు ఉద్యమాలు చేశారు. సొవాద్ కూడా వారితో కలిసి ఆడవాళ్ల కారు ర్యాలీలో పాల్గొంది. ఇలాంటి పోరాటాల ఫలితంగా సౌదీ గత సంవత్సరమే స్త్రీలపై కారు డ్రైవింగ్ నిషేధాన్ని ఎత్తి వేసింది. సొవాద్ ఈ విషయంలోనే కాదు తనను కలిసే స్త్రీలను అలంకరణ తప్పు కాదని, చక్కగా తయారు కాదలిస్తే కావచ్చునని చెబుతుంది. సంగీతం వినడం కూడా తప్పు కాదని ఆమె అభిప్రాయం. ‘ప్రపంచంలో సినిమావాళ్లు, సంగీతకారులు, ఆటగాళ్లు స్టార్లుగా కనపడుతుంటారు. మేము మాత్రం మతాధికారులనే స్టార్లుగా చూడాల్సి వస్తోంది’ అని ఆమె అంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement