మొక్కల వ్యర్థాలతో ప్లాస్టిక్, నైలాన్‌!

Scientists create promiscuous enzyme that turns plant waste into sustainable products - Sakshi

వృధాగా పడేసే మొక్కల వ్యర్థాల నుంచి విలువైన ప్లాస్టిక్, నైలాన్, జీవ ఇంధనాల తయారీకి ఉపయోగపడే ఎంజైమ్‌లను అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి గుర్తించింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌తో పాటు అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు మొక్కల్లో ప్రధాన భాగమైన లిగ్నెన్‌లపై పరిశోధనలు చేస్తున్నారు. కేవలం కొన్ని బ్యాక్టీరియా, ఫంగస్‌ల ద్వారా మాత్రమే నాశనమయ్యే ఈ లిగ్నెన్‌లలో మనకు ఉపయోగపడే అనేక రసాయనాలు ఉన్నాయి కాని వీటిని సమర్థంగా విడగొట్టడం మాత్రం ఇప్పటివరకూ సాధ్యం కాలేదు. తాజాగా ఓ వినూత్నమైన పద్ధతి సాయంతో ప్రొఫెసర్‌ మెక్‌గీహన్‌ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం దీన్ని సాధ్యం చేసింది. ఈ క్రమంలో లిగ్నెన్‌లో ఉండే కొన్ని ఎంజైమ్‌లతో జీవ సంబంధిత పాలిమర్లు అంటే నైలాన్, ప్లాస్టిక్‌ వంటివి తయారు చేసేందుకు పనికొస్తాయని వీరు గుర్తించారు.

దీంతో ఇప్పటివరకూ వ్యర్థంగా పడేస్తున్న లిగ్నెన్‌లతో విలువైన పదార్థాలను తయారు చేయవచ్చునని స్పష్టమైంది. ముడిచమురుపై ఆధారపడకుండా సహజసిద్ధంగా నశించిపోగల ఈ తరహా ప్లాస్టిక్, నైలాన్‌లతో పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని మెక్‌గీహన్‌ అంటున్నారు. సైటోక్రోమ్‌ పీ450 అనే ఈ ఎంజైమ్‌లు చాలారకాల మూలకాలతో సులువుగా కలిసిపోగలవని, ఫలితంగా కొన్ని కొత్త కొత్త పదార్థాలను తయారుచేయడం వీలవుతుందని అంచనా. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ఎంజైమ్‌తో మరింత వేగంగా చర్యలు జరిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top