
జాక్ లండన్ ఆత్మలాలసత గురించి ఒక్క విషయం చెప్పవచ్చు. ‘‘నా యిష్టం’’ అన్నమాటకు తిరుగులేదని అతను ‘‘క్రూయిజ్ ఆఫ్ ద స్నార్క్’’లో రాశాడు. అతని ఆత్మీయులు అతని యిష్టానికి తలవగ్గవలిసి వచ్చేది, లేకపోతే ఆత్మీయులు కాకుండా పోవలసిందే. చాలామందికి అతనిలో ఉన్న ఈ గుణం నచ్చలేదు. అతని కెప్పుడూ బోలెడంతమంది శత్రువులుండేవారు. మన్యూంగీ అనే జపనీయుడొకడు జాక్ లండన్‌కు నౌకరుగా ఉండేవాడు. వాడిలో తన యజమానిపై చాలాకాలంగా కసి పేరుతూ ఉండి ఉండాలి. ఒకనాడు జాక్ లండన్ అనేకమంది అతిథుల మధ్య ఉన్న సమయంలో వాడు పళ్లెంలో పానీయాలు తెచ్చి, తన యజమాని ముందు వంగి, అతి వినయంగా, ‘‘దేవుడికి బీర్ కావాలా?’’ అని అడిగి కసి తీర్చుకున్నాడు. అతిథులు నివ్వెర పోయారు. జాక్ లండన్ జీవితం రచించిన అతని భార్య అతని అహంకారాన్ని ‘‘రాజోచితమైనది’’ అన్నది.
(కొడవటిగంటి కుటుంబరావు తెలుగులోకి అనువదించిన జాక్ లండన్ ‘ప్రకృతి పిలుపు’ ముందుమాటలోంచి)
- ఫ్రాంక్ లూథర్‌మాట్