ఇంకా తెలవారలేదు

Real story on road accident victims - Sakshi

కడుపు కోత వేమవరం దుర్ఘటన జరిగి ఏడాది బిడ్డల మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్న తల్లిదండ్రులు

ప్రమాద స్థలం వైపు వెళ్లేందుకు సైతం భయం!

పరిహారం మంజూరులో ప్రభుత్వం వివక్ష

ఏడాదిగా మంచానికే పరిమితమైన విద్యార్థిని ఆలకుంట శిరీష

ఇల్లు తాకట్టుపెట్టి వైద్యం

బడికి వెళ్లి అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు మంచు తెరలపై రక్తాక్షరాలు అయ్యారు. తెల్లవారుజామునే జరిగిన రోడ్డు ప్రమాదంలో నెత్తుటి ముద్దలుగా మారారు. ఈ ఘోరం∙జరిగి సరిగ్గా ఏడాది.  ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నలుగురు విద్యార్థులతోపాటు ఆటోడ్రైవర్‌ బలైన విషాద ఘటన 2017 డిసెంబరు 28వ తేదీన ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామ శివారులో జరిగింది. ఆ ఘటనలో విద్యార్థినులు కనుమర్తి గాయత్రి (15), ఆళ్ల రేణుక (15), పొట్లపల్లి శైలజ (15), మున్నంగి కార్తీక్‌ రెడ్డి (15), వీరితోపాటు ఆటోడ్రైవర్‌ రేపూడి ధన్‌రాజ్‌ (28) చనిపోయారు. గాయపడిన వారిలో పొట్లపల్లి భాను, పొట్లపల్లి వైష్ణవి, ఆలకుంట శిరీషలు ఉన్నారు. ఈ సంఘటన ఎనిమిది కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. అందరూ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే. వైష్ణవి, శిరీష, లక్ష్మీ భవానీలు ముగ్గురికీ కాళ్లు విరగడంతో ఆపరేషన్లు చేశారు. కొద్ది రోజుల క్రితం వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగు పడటంతో ఇంటికి పంపారు. వీరిలో వైష్ణవి, లక్ష్మీభవాని ఇంటివద్ద మంచంలో ఉంటూనే చదువుకుని చేతి కర్రలుపట్టుకుని తల్లిదండ్రుల సహకారంతో పదోతరగతి పరీక్షలు రాసి ఉత్తీర్ణులయ్యారు. ప్రస్తుతం ప్రైవేట్‌ కళాశాల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌మీడియట్‌ చదువుతున్నారు. శిరీషకు మూడు ఆపరేషన్‌లు జరిగాయి. ఒక ఆపరేషన్‌ విజయవంతం కాకపోవడంతో అమ్మ సాయం లేనిదే నడవలేని పరిస్థితిలో ఉంది. దీంతో పదోతరగతి పరీక్షలు కూడా రాయలేక మంచానికే పరిమితమైంది. తాను బాగా చదువుకుని ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించాలని అనుకునేదాన్నంటూ శిరీష గద్గద స్వరంతో చెబుతోంది.

కదిలిస్తే కన్నీళ్లే
శైలజ తండ్రి శ్రీధర్‌ ఎంత ముఖ్యమైన పని ఉన్నా గ్రామం నుంచి ఫిరంగిపురం వెళ్లే మార్గంలో ఉన్న దుర్ఘటన ప్రాంతం మీదుగా వెళ్లడం లేదు.  అటు వెళితే తమ కుమార్తె అసువులు బాసిన ప్రాంతం వస్తుందని, అది చూసి తట్టుకోలేనన్న భయంతో కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలో వున్న ఫిరంగిపురం వెళ్లేందుకు ఏడు కిలోమీటర్ల దూరం వచ్చి, 113 తాళ్లూరు నుంచి ఫిరంగిపురానికి రాకపోకలు సాగిస్తున్నారు. కార్తీక్‌రెడ్డి తండ్రి కూడా ఘటన గురించి ఎవరైనా గుర్తు చేస్తే తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గ్రామానికి ఆర్టీసీ బస్‌ రాని కారణంగా తన కుమారుడు పాఠశాలకు ఆటోలో వెళ్తూ ప్రమాదానికి గురై తిరిగిరాని లోకాలకు వెళ్లాడని.. ప్రభుత్వం నుంచి అందిన పరిహారంతో తన కుమారుడు కార్తీక్‌ పేరుతో బస్‌ షెల్టర్‌ నిర్మించాడు. పూలచెట్లు చూస్తే తమ కుమార్తె గుర్తుకు వస్తుందంటూ  రేణుక తల్లి దేవి విలపిస్తున్న తీరు అపరిచితులు సైతం కంటనీరు తెప్పిస్తోంది. బాగా చదువుకుని ఉన్నత ఉద్యోగం పొంది మిమ్మల్ని బాగా చూసుకుంటానని ఎప్పుడూ చెబుతుండేదని, దేవుడు తమకు అన్యాయం చేసి తీసుకెళ్లాడని గాయత్రి తల్లి శివకుమారి గుండెలు పగిలేలా రోదిస్తోంది.

వైద్యం కోసం ఇల్లు తాకట్టు 
ఏడాది కాలంగా మంచానికే పరిమితమైన ఆలకుంట శిరీషకు మూడు విడతలుగా ఆపరేషన్‌లు జరిగాయి. మొదట ఆసుపత్రిలో చేర్చినప్పుడు ఉచితంగా వైద్యం చేయించిన ప్రభుత్వం ఆ తరువాత పట్టించుకోలేదు. దీంతో ప్రతినెలా వైద్యపరీక్షలు, మందుల కోసం వేలకు వేలు ఖర్చు అవుతుండటతోపాటు తండ్రి కృష్ణయ్య రెండేళ్లుగా పక్షవాతం కారణంగా కాలుచేయి పనిచేయక ఇంటివద్దే ఉంటున్నాడు. శిరీష తల్లి పుల్లమ్మకు కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. ప్రభుత్వం 2 లక్షలు నష్టపరిహారం ఇస్తుందనుకుంటే 1 లక్ష మాత్రమే ఇవ్వడంతో చేసేది లేక ఇల్లు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి శిరీషకు వైద్యం చేయిస్తున్నారు. బాసటగా వై.ఎస్‌.జగన్‌  ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌ బాధితుల పక్షాన నిలబడడంతో తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం కుటుంబాలకు ఆర్ధిక సహాయాన్ని అయితే ప్రకటించింది గానీ అందులోనూ మోసం చేసింది. 
– ఎన్‌. మాధవరెడ్డి, సాక్షి, గుంటూరు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top