వినియోగదారుల అక్కయ్య

Rajani Hindi TV Serial Special Story - Sakshi

రజని

80ల కాలంలో వినియోగదారులకు ఒక అక్కలా మార్గం చూపించిన పాత్ర రజని. తూనికల్లో, కొలతల్లో ఆటో చార్జీలలో, స్కూలు ఫీజుల్లోమధ్య తరగతివాడు ఎలా మోసపోతున్నాడో, నష్టపోతున్నాడో చూపించి, మేల్కొల్పిన పాత్ర రజని. వినియోగదారుల ఉద్యమందేశంలో ఉవ్వెత్తున ఎగిసేలా చేసిన ఈ పాత్ర, పోషించిన నటి ప్రియా టెండూల్కర్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారు.రజని’ సీరియల్‌ అనగానే గంజిపెట్టిన చిన్న అంచు కాటన్‌ చీరలు, ముడివేసిన కొప్పు, నుదుటన పెద్దబొట్టు..‘ నాటి ప్రేక్షకుల మదిలో ఓ మధ్యతరగతి గృహిణి ఇమేజ్‌ అలాగే కళ్లముందు నిలిచిపోయింది. అలాగే, మొదటిసారి వినియోగదారుల హక్కుల విషయంలో అవగాహన కలిగించడానికి ‘రజని’ సీరియల్‌తో పెద్ద సాహసమే చేసింది దూరదర్శన్‌.

సామాన్యుని పెన్నిధి ‘రజని’
దూరదర్శన్‌లో వచ్చే సీరియల్స్‌ నాడు విభిన్న తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తూ ఉండేవి. అలాంటి సమయంలో ముంబయ్‌ చిత్ర దర్శకుడు బసు ఛటర్జీకి ఒక ఆలోచన వచ్చింది. రచయిత కరన్‌ రజ్దాన్, అనిల్‌ చౌదరీలు ఛటర్జీ ఆలోచనను పంచుకున్నారు. సామాన్య మానవుడు ఎదుర్కొనే కష్టనష్టాలను రాసుకున్నారు. పిల్లాడికి స్కూల్లో అడ్మిషన్‌ కావాలన్నా, ఇంటికి సమయానికి గ్యాస్‌ సిలిండర్‌ రావాలన్నా, నిత్యావసర సరుకుల కొనుగోలులో మోసాలున్నా, ఆటో–రిక్షా డ్రైవర్ల ఆగడాలను కట్టిపెట్టాలన్నా.. ఇవన్నీ సామాన్యుడు ఎదుర్కొనే సమస్యలే. ఇవన్నీ ఆ సామాన్యుడు ఎదురు తిరిగితేనే వాటికి అడ్డుకట్టవేయడం సాధ్యం. ఆ సామాన్యుడు మగ అవడం కంటే ‘ఇల్లాలు’ అయితే.. అలా ఆ ఆలోచన నుంచి పుట్టిందే ‘రజని.’
ఏడాదికి సరిపడా కథనాలు సిద్ధమయ్యాయి. అవినీతి వ్యవస్థపై పోరాటం, సామాజిక సమస్యలను పరిష్కరించడంలో ముందుండే రజని 1985లలో బుల్లితెరపై ప్రతీ ఆదివారం ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చేది.  

ప్రియా ‘రజినీ’ టెండూల్కర్‌
ప్రియ తన బాల్యం నుండే కళలు, సంస్కృతి పట్ల మొగ్గు చూపేవారు. ఆమె తండ్రి ప్రముఖ రచయిత, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత విజయ్‌ టెండూల్కర్‌. ముంబయ్‌లోనే పుట్టి పెరిగారు. పద్నాలుగేళ్ల వయసులో మొదటిసారి మరాఠీ స్టేజీ మీద నటించింది. ఆ తర్వాతి కాలంలో .. ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో రిసెప్షనిస్ట్, ఎయిర్‌ హోస్టెస్, పార్ట్‌–టైమ్‌ మోడల్, న్యూస్‌ రీడర్‌.. ఇలా భిన్నమైన ఉద్యోగాలు చేసింది.1974లో శ్యామ్‌ బెనెగల్‌ ‘అంకుర్‌’ సినిమాలో నటించింది. ఆ తర్వాత వరసగా డజన్‌ మరాఠీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఒక కన్నడ సినిమాలోనూ నటించింది. 1985లో ‘రజని’ టీవీ సీరియల్‌ ద్వారా ఇండియా మొత్తం ప్రియ పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొన్నాళ్లకు ‘స్వయంసిద్ధ’ అనే టీవీ సీరీస్‌లోనూ నటించింది. ప్రియ సహజంగానే స్వేచ్ఛావాది. సామాజిక కార్యకర్త కూడ. సామాజిక సమస్యల మీద ఎలాంటి భయం లేకుండా తన భావాలను బయటపెట్టేది. ప్రియా నిర్వహించే ‘జిమ్మెదార్‌ కౌన్‌’అనే టాక్‌ షోలో ఆమె ఒక మండే అగ్నికణంలా ప్రేక్షకులకు కనిపించేది. ‘పూజ న ఫూల్‌’ అనే గుజరాతీ సినిమాలోనూ ముఖ్యపాత్ర పోషించారు ప్రియ. ఆ మూవీ ద్వారా పెద్ద విజయాన్ని అందుకుంది. రజనీ సీరియల్‌లో సహనటుడైన కరణ్‌ రాజ్దాన్‌ను 1988లో పెళ్లి చేసుకున్న ప్రియ కుటుంబ కలహాలతో 1995లో విడిపోయింది. కొన్నేళ్లపాటు రొమ్ముక్యాన్సర్‌తో పోరాడిన ప్రియ అనే రజని 2002 సెప్టెంబర్‌లో గుండెపోటుతో హఠాన్మరణం పొందారు.

నిజాల నిగ్గు తేల్చే గృహిణి
రజని ఒక ఆవేశపూరితమైన మహిళ. ఆమె దేనికీ భయపడదు. అన్యాయం ఎక్కడ జరిగినా ఎదిరిస్తుంది. నిజాల నిగ్గు తేలుస్తుంది. ఆమె కుటుంబం మొదట కంగారుపడుతుంది తప్ప, ఎదురు చెప్పదు. తమ చుట్టుపక్కల పిల్లలకి స్కూల్‌లో అడ్మిషన్‌ కావాలన్నా, టెలిఫోన్‌ కనెక్షన్‌ కావాలన్నా, ఆటో, రిక్షా డ్రైవర్ల సమస్య అయినా.. జనం తరపున పోరాడటానికి రజని ముందుంటుంది. రాజకీయనాయకులు, పోలీసు అధికారులను సైతం హెచ్చరించడానికి ఆమె ఏ మాత్రం వెనుకాడదు. చెడును చూసినప్పుడు వెనకడుగువేసే ప్రసక్తేలేదు. ధైర్యంగా పోరాడుతుంది. వ్యవస్థతో పోరాడటానికి తన గొంతుకను వినిపించడానికి ఏ మాత్రం వెనుకంజవేయదు. ‘మగవాడు ఎంతటి కఠిన మార్గం మీదనైనా వెళతాడు, ఆడది అతణ్ణి అనుసరించాలి’ అని చెప్పే పెద్దల నీతి మాటలను రజని తప్పని చూపుతుంది. మార్గం ఎవరికైనా ఒకటే అని రుజువుచేస్తుంది.

దారితీసిన ఉద్యమాలు  
‘రజని’ ఆదివారం ఉదయం టిఫిన్‌ ముగించుకునే సమయానికి వచ్చేది. అరగంటపాటు అర్థవంతమైన సమస్యలపై సామాన్య మానవుడు పడే అగచాట్లను చూపేది. అన్ని ఎపిసోడ్లలో బాగా పాపులర్‌ అయిన ఎపిసోడ్స్‌..వంటకు ఉపయోగించే ఎల్‌పీజీ సిలిండర్‌ సమస్య. ఇప్పటిలాగా నాటి రోజుల్లో బుక్‌ చేసిన రెండు రోజుల్లోనే గ్యాస్‌ వచ్చేది కాదు. రోజుల తరబడి ఎదురు చూడాల్సి వచ్చేది. ఆ సమయంలో ఇల్లాళ్లు పడే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు. అంతేకాదు, సిలండర్‌ డెలివరీచేసే ఏజెంట్లు సృష్టించే సమస్యలూ ఇన్నీ అన్నీ కావు. సామాన్య మానవుల కష్టాలు కాబట్టి ఇది అందరి నాడినీపట్టుకుంది. ముంబయ్‌కి చెందిన ‘ఆల్‌ ఇండియా ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్స్‌ ఫెడరేషన్‌’ ఈ షోకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసింది.

మరో ఎపిసోడ్‌లో.. టాక్సీ డ్రైవర్ల వేధింపులు. ‘తమవి చెడ్డ పాత్రలుగా సృష్టించారని, క్షమాపణ చెప్పి తీరాల్సిందే అని ముంబయ్‌లో 500 మంది టాక్సీ డ్రైవర్లు ఒక ఉద్యమంగా నడుస్తూ దూరదర్శన్‌ కార్యాలయానికి Ðð ళ్లారు. రజని ప్రభావం ఎంతటిదంటే ఓ నిశ్శబ్ద విప్లవానికి దారితీసింది. భారతీయ బుల్లితెర చరిత్రలో ‘రజని’ ఎప్పుడూ చెప్పుకోదగిన పాత్రగా మిగిలిపోతుంద’ని దర్శకుడు ఛటర్జీ గుర్తుచేసుకున్నారు.

పద్మిని కొల్హాపూర్‌ –        ప్రియా టెండూల్కర్‌
ప్రియా టెండూల్కర్‌కి ముందు ఈ షోకి బాలీవుడ్‌ నటి పద్మిని కొల్హాపురి అనుకున్నారట.‘అప్పటికే పద్మిని ఇండస్ట్రీలో పెద్ద తార. ఆమెతో ‘రజని’ పైలట్‌ ఎపిసోడ్‌ కూడా షూట్‌ చేశాం. కానీ, ఆ తర్వాత పద్మిని డేట్స్‌ దొరకడం గగనమైపోయింది. ఆప్పుడు యాక్టర్స్‌ అయిన అనితారాజ్, బిందియా గోస్వామి, ప్రియలతో విడివిడిగా పైలట్‌ ఎపిసోడ్స్‌ షూట్‌ చేశాం. ప్రియ ‘రజని’కి పర్‌ఫెక్ట్‌ అనుకున్నాం. అలా అందరినీ దాటుకొని ప్రియా టెండూల్కర్‌ని ‘రజని’ వరించింది. అది ఆమె కోసమే పుట్టిన సీరియల్‌ అయ్యింది’ అన్నారు బసు చటర్జీ.పదమూడు ఎపిసోడ్లు పూర్తయిన తర్వాత ముంబయ్‌ చర్చిగేట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో సీరియల్‌ టీమ్‌ అంతటినీ దూరదర్శన్‌ ఘనంగా సత్కరించింది. ఇంతటి ఘనవిజయం సాధించిన సీరియల్‌ కనీసం ఏడాది పాటు వస్తుందని ఆశించాం. 42 వారాలకు ఎపిసోడ్స్‌ రష్‌ సిద్ధం. కానీ, ప్రభుత్వం ఈ సీరియల్‌ని నిలిపివేయమని కోరింది. కారణం, సీరియల్‌ సామాన్యుడి వైపు ఉండటమే. ఈ సమాధానం మమ్మల్ని చాలా నిరాశపరిచింది’ అని గుర్తుచేసుకున్నారు దర్శకుడు ఛటర్జీ.‘రజని’ సీరియల్‌ వచ్చిన దాదాపు 27 ఏళ్లకు అమీర్‌ఖాన్‌ ‘సత్యమేవ్‌ జయతే’ అంటూ స్టార్‌ ప్లస్‌లో సామాజిక సమస్యల అవగాహనపై ఓ కార్యక్రమం చేశారు. బాలీవుడ్‌ స్టార్‌ని సైతం ‘రజని’ సీరియల్‌ ఈ విధంగా ప్రభావితం చేసిందని చెప్పవచ్చు.– ఎన్‌.ఆర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top