ఆడే వేళ

Parents Should Take Care Of Childrens - Sakshi

రెప్ప వెయ్యకండి

ఆటలు పిల్లలకు రెక్కల్లాంటివైతే, పిల్లలు పెద్దవాళ్ల ఆశలకు రెక్కల్లాంటి వారు. వాళ్లు ఆడాల్సిందే.. వాళ్ల వెనుక వీళ్లు పరుగులు తియ్యాల్సిందే.

మాధవ్‌ శింగరాజు
పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. పిల్లలు నేల మీద ఎగురుతారు. మీక్కొంచెం దూరంలో ఉన్న బాబిగాడిని.. ‘బాబీ.. ఇలా రామ్మా, ఈ టాబ్లెట్‌ తీసుకెళ్లి అమ్మమ్మకివ్వు’ అని కేకేస్తే.. బాబిగాడు నడుచుకుంటూ వస్తాడా! ఎగురుకుంటూ వస్తాడు. ‘జుమ్‌’మని రెండు చేతులు పక్కలకు చాచి, ఒక రెక్కను కిందికి, ఒక రెక్కను పైకి పెట్టి పక్షిలా మీ దగ్గర వాలిపోతాడు. లేదంటే ‘జుయ్‌’మని ఒకేసారి బాణంలా వచ్చి దిగబడతాడు. ‘తల్లీ.. ఇలా రారా’ అని పిలిచి, దోసిళ్లలో నిండుగా బియ్యం పోసి, ‘ఆ తాత జోలెలో వేసిరా పో’ అని పంపితే మీ పాప మాత్రం ఇంట్లోంచి వాకిట్లోకి తిన్నగా వెళుతుందనా! ఒంటికాలి మీద గెంతుకుంటూ వెళ్తుంది. చేతుల్లోని బియ్యం చిందిపడతాయని ఉండదు. జుమ్మనో, జుయ్‌మనో వచ్చే బాబిగాడికైనా మధ్యలో పూలకుండీని తట్టుకుని పడతానని ఉండదు. వాళ్లదొక ప్రత్యేకమైన లోకం. పొద్దులు, హద్దులు తెలియని పరుగుల లోకం. కలల్లో కూడా.. ‘అహహా.. అహహా’ మని నవ్వుల పరుగులే.  

లోకంలో జాగ్రత్తలు అనేవి ఉంటాయనీ, జాగ్రత్తగా ఉండాలనీ పిల్లలకు తెలియదు. జాగ్రత్తలు చెప్పే అమ్మానాన్నని కూడా ఏలియన్స్‌ని చూసినట్లు చూస్తారు.. ‘ఏ లోకం నుంచి వచ్చారో ఈ మాలోకాలు’ అన్నట్లు. పక్షులకు ఇచ్చినట్లు దేవుడు పిల్లలకి రెక్కలు ఇవ్వకపోబట్టి పెద్దవాళ్లం ఈ మాత్రంగానైనా ఉన్నాం. లేకుంటే, ‘ఒరేయ్‌ బాబిగా ఎక్కడున్నావ్‌ రా’ అని అరుచుకుంటూ, ‘బంగారం.. ఎక్కడికెళ్లావే..’ అని గుండెల్ని గుబగుబలాడించుకుంటూ మేఘాల్లోకి నిచ్చెన్లు వేసుకునేవాళ్లం. అక్కడ మళ్లీ వీళ్లిద్దరే ఉంటారనా! పెద్ద గ్యాంగ్‌.. ఇరుగిళ్లవి, పొరుగిళ్లవీ. ఆ గ్యాంగ్‌లోంచి బాబిగాడిని, బంగారాన్ని వెతుక్కోవాలి. ఆడి, ఆడి అలసి అక్కడే ఏ మేఘంలోనో పడుకుని ఉంటే భుజాన వేసుకుని నెమ్మదిగా నిచ్చెన దిగాలి. నిచ్చెన పడకూడదు. వీళ్ల నిద్ర చెడిపోకూడదు. దేవుడు ఇవ్వకపోతేనేం, ఆటలు పిల్లలకు రెక్కల్లాంటివే. అవి వాళ్లనొక చోట ఉండనివ్వవు. వాళ్లను కుదురుగా ఉంచాలన్నా మళ్లీ ఆటలే. ఆటలా నిద్రలేపాలి.

ఆటలా స్నానం చేయించాలి. ఆటలా తినిపించాలి. ఆటలా చదివించాలి. పెరిగి పెద్దవుతున్న కొద్దీ ‘వద్దు’ అనే మాటను కూడా ఆటలానే చెప్పాలి. అంత చేసి అలసట వస్తున్నా.. మనిషి జన్మకు ఇంత అవసరమా అనిపించదు. ఆటలు పిల్లలకు రెక్కల్లాంటివైతే, పిల్లలు పెద్దవాళ్ల ఆశలకు రెక్కల్లాంటి వారు. అందుకే అనిపించదు. ఒకటే బాధ.. మనమింత జాగ్రత్తగా ఆడిస్తున్నా, మైమరిచిపోయి వాళ్లకై వాళ్లు ఆడే ఆటల్లో పిల్లల్ని ఏదో ఒక ఆట హర్ట్‌ చేస్తూనే ఉంటుంది. అది బాధనిపిస్తుంది మనకు. పెద్దవాళ్లం.. మన కళ్లేమైపోయాయి అని నిందించుకుంటాం. శివాంగి గొహయిన్‌ పన్నెండేళ్ల ఆటల బంగారం. విలువిద్యా క్రీడాకారిణి. ఫొటోలో ఎలా ఉందో చూడండి.. దిగాలుగా!  గురువారం అస్సాంలోని దిబ్రూఘర్‌లో ప్రాక్టీస్‌ సెషన్‌లో ఉన్నప్పుడు సాటి ఆర్చర్‌ వదిలిన బాణం హటాత్తుగా దిశ మారి, శివాంగి భుజంలోకి గుచ్చుకుపోయింది. ఎంత నొప్పి! బాణం తియ్యడానికి అక్కడి డాక్టర్లు ప్రయత్నించారు కానీ వీలవలేదు.

సర్జరీ కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రికి శివాంగిని విమానం ఎక్కించారు. కొన్నాళ్ల వరకైనా ఆమె ఆ చేత్తో బాణాన్ని లాగి వదల్లేదు. అదీ తనకు అసలు నొప్పి. ఆడొద్దంటే పిల్లలకు కలిగే నిరాశ లాంటి నొప్పి. ఆడకుండా ఉండలేని ఆశలాంటి నొప్పి. పోయిన సోమవారం ఇదే రోజు గుంటూరులో.. ఎక్కడి నుంచో గాలిని కోసుకుంటూ వచ్చిన గాలిపటం దారం కౌశిక్‌ అనే చిన్నారి గొంతును తెంపుకుంటూ వెళ్లింది! ఆ రోజు స్కూలుకు సెలవు. అమ్మమ్మ వాళ్లింట్లో ఆడుకుంటామని తండ్రి బైక్‌ మీద కూర్చున్నారు కౌశిక్, కౌశిక్‌ అన్న. కౌశిక్‌ ముందు కూర్చున్నాడు. బైక్‌ స్పీడ్‌ మీద ఉండగా ఏ మలుపులోనో మెడకొచ్చి చుట్టుకుంది గ్లాస్‌ కోటెడ్‌ మాంజా. తండ్రి గమనించి బైక్‌ ఆపేలోపే తెగిపడ్డ గాలిపటంలా చేతుల్లో తలవాల్చేశాడు కొడుకు. ఎంత నొప్పి! పిల్లవాడు అనుభవించిన నొప్పి;  అమ్మ, నాన్న, అన్న ఎప్పటికీ అనుభవిస్తూనే ఉండే నొప్పి. పిల్లలు ఆడవలసిందే. లేకుంటే ఆటలకే రెక్కలు తెగుతాయి.

పిల్లలు గాలిపటం ఎగరేయవలసిందే. లేకుంటే సంక్రాంతినేం చేసుకోను? అరిసెలు తింటూ టీవీలో ‘గద్దలకొండ గణేశ్‌’ని చూడ్డానికా.. ఇంటిపైన పిల్లలు.. ‘డీలొదులు డీలొలుదు.. కీంచ్‌ కొట్టు.. ఓవ్వొవ్వోవో.. కాటయిందీ.. కాటయింది’ అని అరుస్తూ శ్లాబ్‌ని దద్దరిల్లించకుంటే! ‘బాణాన్ని గురి చూసి కొడతాను నాన్నా’ అంటే.. ఫస్ట్‌ర్యాంక్‌ కొడుతున్నావు కదమ్మా చాల్లే.. బాణాలెందుకు ప్రమాదం’ అని ఆపేస్తామా.. ఢిల్లీకో, గౌహతీకో టోర్నమెంట్స్‌కి తీసుకెళ్లకుండా?! పిల్లలు పరుగులు తీయాల్సిందే. స్పీడ్‌ బ్రేకర్‌ ఉందని భూమధ్య రేఖ మీది నుంచి పిల్లలు అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటు గెంతకపోతే భూగోళానికి కూడా బోరు కొట్టి తిరగడం మానేస్తుంది.. ఛ.. ఎందుకీ భ్రమణం, పరిభ్రమణం అని. జీవితంలో ఎన్నోవాటికి పరుగులు తీస్తుంటాం. పిల్లల్ని కనిపెట్టుకుని ఉంటూ వారి వెనుక పరుగులు తీయడం.. అది మాత్రమే అర్థవంతమైన పరుగు. అదొక్కటే నిరర్థకం కాని పరుగు.             

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top