పండుటాకులకు అండగా...

Parental Misery For The Future Of Childrens - Sakshi

అమ్మ.. నాన్న.. పిల్లలు

పిల్లల భవిష్యత్తు కోసం తమ జీవితాలను ఫణంగా పెట్టి ముద్దుగా పెంచుకుంటారు తలిదండ్రులు. ఆ పిల్లలే పెద్దయి అమ్మానాన్నలను పనికిమాలిన వస్తువులుగా భావిస్తూ ఇంటి బయట పారేయడానికి సిద్ధపడుతున్నారు. అమ్మానాన్నా అంటే ఆస్తులు సంపాదించి ఇచ్చే యంత్రాలుగానే భావిస్తున్నారు. తమ కలల్ని, ఆస్తులను పిల్లలకు పంచి ఇచ్చిన తల్లిదండ్రులు జీవిత చరమాంకంలో అయినవారి అండ లేకుండా అనాథలుగా మారుతున్నారు.

కమలమ్మ భర్త చనిపోతే తానే అన్నీ అయ్యి కొడుకును పెంచి పెద్ద చేసింది. కొడుకు కూడా బాగా చదువుకున్నాడు. పెళ్లి చేసింది. కోడలు కూడా బాగా చదువుకుంది. వాళ్లకు ఇద్దరు పిల్లలు. డెభ్బై ఏళ్ల వయసులో కమలమ్మకు క్యాన్సర్‌ వచ్చింది. ‘ఏడాదికన్నా బతకద’ని డాక్టర్‌ చెప్పారు. ఆ రోజు నుంచి మొదలు ఇంట్లో ‘మీ అమ్మను ఎక్కడైనా హోమ్‌లో పెట్టండి. పిల్లలకూ ఈ జబ్బు వస్తుంది..’ అని కోడలు రోజూ కొడుకుతో చెప్పే మాటలు వింటూనే ఉంది కమలమ్మ. వృద్ధాశ్రమంలో పెట్టను అన్నాడు కొడుకు. గొడవలు ముదిరి కోడలు వేధింపుల కేసు పెట్టేంత వరకు వెళ్లింది. అందులో అత్తగారి మీద కూడా కేసు పెట్టింది. చివరి దశలో ఉన్న కమలమ్మ మానసిక వ్యథ అంతా ఇంతా కాదు. మరో ఆరు నెలలు బతికేది రెండు నెలలకే కన్ను మూసింది.

అన్నపూర్ణ, పరంధామయ్యల కొడుకు బాగా చదువుకొని అమెరికాలో స్థిరపడ్డాడు. వాళ్లిద్దరూ హైదరాబాద్‌లో ఉంటారు. ఓ రోజు కొడుకు వచ్చి ‘నాతో పాటు వచ్చేయండి అన్నాడు. ‘సరే’ అన్నారు తల్లిదండ్రి. మీరు అమెరికా వచ్చేశాక ఇక్కడ ఆస్తులు ఎందుకు?’ అన్నాడు. ఆస్తులన్నీ అమ్మించేసి క్యాష్‌ అయ్యాక అమెరికా బయల్దేరారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లాక తల్లిదండ్రులని బయట కూచోబెట్టి వివరాలేవో కనుక్కొని వస్తానని చెప్పి లోపలికెళ్లాడు. వాళ్లిద్దరూ ఎదురు చూసి చూసీ తమ కొడుక్కి ఏదో జరగరానిది జరిగిందని ఏడుస్తూ కూచున్నారు. కొడుకు వివరాలు చెప్పి అక్కడి సిబ్బందిని కనుక్కొంటే అతను ఎప్పుడో అమెరికా ఫ్లైట్‌ ఎక్కేశాడని తెలిసి షాకయ్యారు. వసుధ వయసు 80 ఏళ్లు. ముగ్గురు కొడుకులు. కూతురు.

కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నవాళ్లే. భర్త ఉన్నప్పుడు పిల్లలకు ఆస్తులు పంచి ఇచ్చాడు. భర్త చనిపోయాక వసుధ పిల్లల ఇంట్లో నెల రోజుల చొప్పున ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ఓ రోజు హాస్పిటల్‌లో చెకప్‌ కోసమని తీసుకెళ్లి హాస్పిటల్‌ దగ్గర వదిలేసిపోయారు. వసుధ తన పిల్లల పేర్లు, వివరాలు చెప్పడానికి ఇష్టపడలేదు. లక్ష్మీబాయమ్మకు నెలనెలా వృద్ధాప్య పెన్షన్‌ వస్తుంది. పెన్షన్‌ వచ్చే ముందు రెండు రోజులు తల్లితో బాగానే ఉంటాడు కొడుకు. పెన్షన్‌ తీసుకోవడానికి ఆఫీస్‌ వరకు బండిమీద తీసుకొని వెళతాడు. తల్లి పెన్షన్‌ తీసి కొడుకు చేతికి ఇవ్వగానే అవి జేబులో పెట్టుకొని ఇంటికి వెళ్లిపో .. అని అక్కడే వదిలేసాడు. మళ్ళీ పెన్షన్‌ వచ్చే రెండు రోజుల మందు వరకు లక్ష్మీబాయమ్మ అర్ధాకలితో కాలం గడపాల్సిందే.  

పిల్లలదే బాధ్యత
ఇలా పిల్లల చేత నిరాదరణకు గురైన పెద్దల సంఖ్య దేశవ్యాప్తంగా నానాటికీ పెరిగిపోతోంది. కన్నపిల్లలే కాదన్నాక ఇంకెవరిని నమ్ముతాం అనే నైరాశ్యంలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తున్నాయి. ‘చాలా మంది తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని పెంచడమే అంటుంటారు. కానీ తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత, ప్రభుత్వాల బాధ్యత ఎంతవరకు ఉందనే విషయాల గురించి ఆలోచించరు’ అంటారు పి.శ్యామ్‌కుమార్‌. హెల్పేజ్‌ ఇండియా అడ్వొకసీ ఆఫీసర్‌ అయిన శ్యామ్‌ కుమార్‌ వయోవృద్ధులకు ఉన్న హక్కులను ప్రతి ఒక్కరూ తెలుసుకుని, వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉందం’టారు.
‘వృద్ధుల మీద 498ఎ కేసులూ నమోదవుతున్నాయి.

కోడళ్లు పెట్టే గృహ హింస కేసులను ఇంట్లో పెద్దలు వారు చనిపోయే దశ వరకు ఎదుర్కోవలసి వస్తుంది’ అంటూ ఆవేదన చెందారు రాజేశ్వరి. తోడునీడ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు ఆమె. ‘పిల్లలు తల్లిదండ్రులకు ఉండటానికి వసతి, తిండి, బట్ట.. వంటివి తప్పక ఇవ్వాలి. పిల్లలు ఏ ఆదాయాన్ని కలిగి ఉన్నా సెక్షన్‌ 23 ప్రకారం దాదాపు 10 వేల రూపాయల వరకు తల్లిదండ్రుల సంరక్షణ కోసం ఇవ్వాలి. పిల్లలు వారిపై నిర్లక్ష్యాన్ని చూపితే అది మోసం, బలవంతంగా ఆస్తులు లాక్కోవడం వంటి నేరాల కిందకే వస్తుంది.సెక్షన్‌ 23 ప్రకారం తల్లిదండ్రుల బాధ్యత కొడుకులు–కూతుళ్లు, కోడళ్లు–అల్లుళ్లు, బంధువులది కూడా’ అని వివరించారు.

తిరిగి ఆస్తిని పొందవచ్చు
‘తల్లిదండ్రులు తమకోసం ఏమీ ఉంచుకోకుండా ప్రేమతో పిల్లలకు ఆస్తి అంతా రాసిస్తారు. చివరకు ఆ పిల్లలు తల్లిదండ్రులని పట్టించుకోరు. ఇలాంటప్పుడు నేరుగా కోర్టుకు అప్పీల్‌ చేసుకొని తమ ఆస్తులను తిరిగి పొందవచ్చు. వయోవృద్ధులకు సంబంధించిన కార్యాలయం, రెవిన్యూ డివిజన్‌ ఆఫీస్‌కు నేరుగా కంప్లైంట్‌ ఇవ్వచ్చు. మంచానికే పరిమితమైన వారి తరపున ఎవరైనా అప్పీల్‌ చేయవచ్చు.
►సెక్షన్‌ 11 కింద డిడబ్ల్యూవో జిల్లా స్థాయిలో మెయింటెన్స్‌ ఆఫీసర్‌ జడ్జిమెంట్‌ను ఇంప్లిమెంట్‌ చేస్తారు. అలాగే వారి సంరక్షణ ఏవిధంగా ఉందనే విషయం ప్రతీ నెలా, మూడు నెలలకు ఓసారి ఆ ఆఫీసర్‌ పర్యవేక్షిస్తుంటారు.

►అయినప్పటికీ పిల్లలను సరిగా పట్టించుకోకపోయినా, వృద్థులను ఎవరైనా వేధించినా సెక్షన్‌ 24 ప్రకారం క్రమినల్‌ చర్యలు తీసుకుంటారు.. మూడు నెలల జైలు శిక్ష, 5 వేల జరిమానా విధించే అవకాశాల ఉంటాయి.

రక్షణగా ఉండాలి
యువతరంలో స్వార్థం బాగా పెరిగింది. నేను– నా ఇల్లు –నా పిల్లలు ఇదే నా కుటుంబం అనుకుంటున్నారు. తల్లిదండ్రుల విషయానికి వస్తే భారంగా ఫీలవుతారు. చిన్న కుటుంబాలు పెరిగాక శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా వృద్ధుల వల్ల ఏమీ ప్రయోజనం లేదని పిల్లలు భావిస్తున్నారు. ఇది తప్పు అని తెలియజేయాల్సిన అవసరం సమాజానికి, ప్రభుత్వానికి ఉంది. నిరాదరణకు గురవుతున్న పెద్దలు కోర్టుకు అప్పీలు చేసుకుంటే 90 రోజుల్లోనే తమ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

వృద్ధుల ఆరోగ్య రక్షణలో భాగంగానూ ప్రతీ ఏరియా హాస్పిటల్స్‌లో విడిగా జీరియాట్రిక్‌ వార్డు ఉండాలి. ఓపీల దగ్గర, మెడిసిన్స్‌ దగ్గర విడిగా క్యూ లైన్‌ ఉండాలి. ఉమ్మడి కుటుంబంతో కాకుండా పెద్దలకు విడిగా హెల్త్‌ కార్డు ఉండాలి. పెద్దలు ఎక్కడైనా సమస్యలు ఎదుర్కొన్నట్టు గుర్తిస్తే వారికి సంబంధించిన సమాచారాన్ని మాకు తెలియజేయవచ్చు.
రాజేశ్వరి, తోడునీడ స్వచ్ఛంద సంస్థ,
స్టేట్‌ కౌన్సెల్‌ మెంబర్‌ ఫర్‌ సీనియర్‌ సిటిజిన్స్, తెలంగాణ

సమస్యల పరిష్కారానికి..
వృద్ధులు నిరాదరణకు గురైతే వారి పోషణ ఖర్చును పేరెంట్స్‌ అండ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ యాక్ట్‌ 2007 కింద పొందవచ్చు. ఇందుకోసం ఒక శాఖ పనిచేస్తోంది. వయోవృద్ధుల సంరక్షణ కోసం అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం, నేరుగా బాధిత వృద్ధులను కలుసుకొని సమస్యలను పరిష్కరించడం దిశగా ఈ కమిటీæ పనిచేస్తుంది. బాధిత వృద్ధులు ఎవ్వరైనా, వారి తరపు వారైనా ఏ విధమైన ఇన్ఫర్మేషన్‌ తెలుసుకోవాలన్నా టోల్‌ఫ్రీ నెం: 18001801253 కు ఫోన్‌ చేయచ్చు. గూగుల్‌లో ఏ్ఛ p్చజ్ఛ  ౖ  యాప్‌ ద్వారా కూడా సమాచారం పొందవచ్చు.
పి.శ్యామ్‌కుమార్‌.
టిఎస్‌ అండ్‌ ఎపి హెల్పేజ్‌ ఇండియా అడ్వొకసీ ఆఫీసర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top