మా రాజాకి మీ భవిష్యత్తు తెలుసు

Our king knows your future - Sakshi

జీవనం / రిపోర్టర్స్‌ డైరీ

‘చిలుకరాజా ఇలా వచ్చి ఈ అమ్మ పేరుతో ఓ మంచి కార్డు తీయి...’ అంటూ పంజరం డోర్‌ని తెరిచాడు.చిలుక నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఓ కార్డు లాగి మళ్లీ పంజరం లోపలికి వెళ్లిపోయింది. ఆ కార్డుతో అతను మా ఫ్రెండ్‌ భవిష్యత్తును చెప్పడం మొదలుపెట్టాడు.

‘అమ్మా, నీ మనసు మంచిది. ముక్కుసూటిగా మాట్లాడతవు. అడిగినవారికి లేదనని పెద్ద చేయి తల్లి నీది..’ వరుసగా అన్నీ మంచి లక్షణాలే. మా స్నేహితురాలి ముఖం వెలిగిపోతోంది ఆ మాటలకు. ‘అయినవాళ్ల చెడుసూపు నీ మీద ఉంది. జాగ్రత్తగా ఉండాలి..’ మా స్నేహితురాలి ముఖంలో తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వెంటనే ‘ఈ శ్రావణమాసంలో ఇల్లు కడతావు తల్లీ..’ ఆ మాటతో తన ముఖం మతాబులా వెలిగిపోయింది. అతని మాటల అల్లిక ముచ్చటగా ఉంది. కిందటివారం అమ్మవారి దర్శనానికి స్నేహితులతో కలిసి విజయవాడ వెళ్లినప్పుడు కొండదిగి కిందకు వచ్చాక రోడ్డుకు ఎడమవైపున కూర్చొని కనిపించారు చిలుకజోస్యం చెప్పేవాళ్లు. సరదాగా చిలుకజోస్యం చెప్పించుకుందామన్నారు. మా మాటలు విన్నారేమో అన్నట్టుగా ‘అమ్మా, రండి మా రాజా (రామచిలుకపేరు) జోస్యం నూటికి నూరుపాళ్లు కరెక్ట్‌ అవుతుంది..’ జోస్యం చెప్పే అతను పిలిచాడు. అతని ముందు ఒక ప్లాస్టిక్‌ సంచి పరిచి, దానిమీద  కార్డులు పేర్చి ఉన్నాయి. పక్కన చిలుక పంజరం. వద్దన్నా వినకుండా ఇద్దరూ అక్కడ చేరిపోయారు. ఒక జాతకానికి ముప్పై రూపాయలు అనడంతో మరేమీ ఆలోచించకుండా అతని ముందు మూడు పది నోట్లు పెట్టింది మా ఫ్రెండ్‌. ‘చిలుకరాజా ఇలా వచ్చి ఈ అమ్మ పేరుతో ఓ మంచి కార్డు తీయి...’ అంటూ పంజరం డోర్‌ని తెరిచాడు. చిలుక నెమ్మదిగా నడుచుకుంటూ బయటకు వచ్చి ఓ కార్డు లాగి మళ్లీ పంజరం లోపలికి వెళ్లిపోయింది. ఆ కార్డుతో అతను మా ఫ్రెండ్‌ భవిష్యత్తును చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సంఘటన అక్కడక్కడా, అప్పుడప్పుడూ చూసిందే కానీ, అతని మాటలు ఆ ప్రాంతం వారివిగా అనిపించలేదు.

 ‘ఏ ఊరు మీది..’ అనడంతో సూర్యాపేట. తెలంగాణవాళ్లం’ అన్నాడు. కొంచెం ఆసక్తిగా అనిపించింది. అక్కణ్ణుంచి ఇంతదూరం వచ్చావా? అక్కడ జోస్యం చెప్పించుకునేవారు లేరా! అనడంతో ‘మేం దేశమంతా తిరిగిటోళ్లమమ్మా. బతుకుదెరువుకోసం ఎంత దూరమైనా వెళ్లాల్సిందే, మాకు ఓ ప్రాంతం అనేది ఏముంది?’ అన్నాడు.  ‘సూర్యాపేటలో సొంత ఇల్లు ఉంది. మా సుట్టాలంతా అక్కడే ఉంటారు. నెలలో పది రోజులు సూర్యాపేటలో మిగిలిన రోజులు ఇక్కడే. ముప్పై ఏళ్లుగా ఇదే పని. ఇంకో నలుగురం కలిసి ఇక్కడే ఓ రూమ్‌ తీసుకొని ఉంటున్నాం. వాళ్లూ నాలాగే జోస్యం చెప్పుకుంటారు. నాకు ఒక కూతురు, నలుగురు కొడుకులు. ఈ చిలుకజోస్యం చెప్పుకునే వాళ్లను పెద్దోళ్లను చేశా. వాళ్లందరి పెళ్లిళ్లు అయ్యి, పిల్లలు కూడా! పట్నంలో పనులు చేసుకుంటు బతుకుతున్నరు..’ అంటూ తన గురించి చెప్పుకొచ్చాడు. ఈ రామచిలుకను ఎక్కణ్ణుంచి తీసుకొస్తారు? అనడంతో ‘మా సుట్టాలలోనే కొంతమంది వీటికి ట్రైయినింగ్‌ ఇస్తారు. ఆ పని నాకు తెల్వదు. వాళ్ల దగ్గర్నుంచి మా లాంటివాళ్లు వెయ్యి, రెండు వేలకు ఓ రామచిలుకను కొనుక్కుంటాం’ అన్నాడు. ఎంతసేపూ ఈ చిలుకను పంజరంలోనే ఉంచితే ఎలా? అంటూ.. నా మాట పూర్తికాకుండానే ‘సాయంత్రం మా రూమ్‌కి వెళతాం కదా! అక్కడ పెద్ద పంజరంలో మా చిలుకలన్నీ విడిచిపెడతాం. అన్నీ కలిసి ఉంటాయి. పొద్దున్నే ఎవరి చిలుకను వాళ్లు తీసుకుంటాం. ఒక్కొక్కరం ఒక్కోచోటుకి వెళ్లిపోతాం.’ అంటూనే ‘అమ్మా, మీ పేరున ఓ రాగిరేకు, కొన్ని మూలికలు ఇస్తాను. వాటిని కృష్ణలో వదిలేయాలి. మీ మీదున్న చెడు దృష్టి నీళ్లలో కొట్టుకుపోయినట్టు పోతుంది. దానికి ఖర్చు వంద రూపాయలు!’ అన్నాడు. అతను చెప్పిన ఆ వస్తువులేవో తీసుకొని తను కృష్ణానదివైపుగా అడుగులేసింది. మీ జాతకాన్ని మీరు చూసుకుంటారా అని అడిగితే–‘రోజూ వ్యాపారానికి బయల్దేరే ముందే చూసుకుంటాం. ఏముందమ్మా మనం మంచి అనుకుంటే మంచే అవుతుంది. చెడు అనుకుంటే అంతా చెడే’ అన్నాడు అతను బతుకునేర్పిన అనుభవంతో!

‘ఒక్క గింజ కూడా దాచుకోలేని పిట్ట మనిషి భవిష్యత్తును ఏం చెబుతుంది?’ అని ప్రశ్నించే ఓ కవి మాటలు గుర్తుకువచ్చాయి. వ్యాపారం అని అతనే అంత స్పష్టంగా చెప్పాడు. మంచి‘మాట’ను అందుకు ఎంచుకున్నాడు. మంచే జరుగుతుందనే ఆలోచన మైండ్‌లో ఉంది. వ్యాపారంలో ప్రాథమిక సూత్రాలు ఇవే కదా! ఫ్రెండ్‌ తిరిగి రావడంతో నేనూ తనతో బయల్దేరాను. వెడుతూ వెనక్కి తిరిగి పంజరం వైపు చూశాను. జాతకం చెప్పించుకోవడానికి మరో ఇద్దరు వ్యక్తులు అక్కడ చేరారు. పంజరం నుంచి బయటకు వచ్చిన చిలుక ముక్కుతో కార్డు లాగి, ఆ వెంటనే లోపలికి వెళ్లిపోయింది. 
– నిర్మలారెడ్డి 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top