బడికి ప్రేమతో..!

Older Student Repaired The School With Wedding Expenses - Sakshi

ఆ గదుల్లో నేర్చుకున్న పాఠాలు వృథాపోలేదు ఆ బడి పంచిన జ్ఞాపకాలు చెదిరిపోలేదు ఆ బడి నేర్పిన సంస్కారం మరుగునపడలేదు తన ఎదుగుదలకు పునాది వేసిన తల్లిలాంటి బడిని మరచిపోలేదు. తాను చదువుకున్న బడి శిథిలావస్థకు చేరుకున్న దృశ్యం ఆ పూర్వ విద్యార్థి మనస్సును కలచివేసింది. తన కొడుకు వివాహానికి పెట్టాలనుకున్న పెళ్లి ఖర్చు కోటి రూపాయలతో చదువులమ్మ చెంతకు చేరాడు వజ్రపు వెంకటేష్‌.

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణానికి చెందిన వజ్రపు వెంకటేష్‌ తన తండ్రి ‘వజ్రపు నర్శింహమూర్తి పౌండేషన్‌’ (విఎన్‌ఎం పౌండేషన్‌) ద్వారా కొంతకాలంగా సేవా కార్యక్రమాలను నిర్వ స్తున్నారు. ఒకరోజు తాను చదువుకున్న పాఠశాలలోని పేద విద్యార్థులకు దుస్తులు, బ్యాగులు, నోటు పుస్తకాలు అందించేందుకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లిన ఆయన అక్కడ బడి దుస్థితిని చూసి చలించిపోయారు. చక్కని వాతావరణంలో చదవాల్సిన విద్యార్థులు చెట్లనీడల్లో, గాలికి పడుతున్న సిమెంట్‌ రేకుముక్కల మధ్య బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారు. అక్కడ విద్యార్థులను పలకరించగా ‘ఎండాకాలంలో నేరుగా సూర్యుడు తమ నెత్తిపైనే తాండవిస్తుంటాడని, వర్షాకాలంలో తామంతా గుంపుగా ఓ చోటుకు చేరి తలదాచుకోవలసిన పరిస్థితుల్లో చదువుతున్నామంటూ’ విలపించారు. అప్పుడే వజ్రపు వెంకటే ష్‌ ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారు.

జత కలిసిన కుటుంబం
తన భార్య అనూష, తల్లి శంకర లక్ష్మీ, కుమారులు జాన్‌ వికాస్, ఆశీష్‌తో తన మనోగతాన్ని పంచుకున్నాడు. కుటుంబ సభ్యులూ వెంకటేశ్‌ మనోగతాన్ని అర్థం చేసుకొని ఓ నిర్ణయానికి వచ్చారు. కుమారుడు జాన్‌ వికాస్‌ వివాహానికి పెట్టే ఖర్చు కోటి రూపాయలతో కోట్లమందికి ఉపయోగపడే చదువుల గు(బ)డికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ ఆశను, ఆకాంక్షను వినతిపత్రం రూపంలో తెలియజేశారు. కలెక్టర్‌ నుంచి వెంటనే అనుమతి లభించింది.

కోటి అభినందనలు
శిథిలావస్థకు చేరుకున్న బడిని పడగొట్టించారు వజ్రపు వెంకటేష్‌. గత ఏడాది ఆగష్టు 31న అప్పటి జిల్లా కలెక్టర్‌ ధనుంజయరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి సాయిరామ్‌ చేతుల మీదుగా కోటి రూపాయలతో పది గదుల భవనానికి శంకుస్థాపన జరిగింది. తాను చదువుకున్న బడి రుణం తీర్చుకుంటున్నందుకు ధన్యుడనంటూ చెప్పిన వెంకటేష్‌ మాటలు విన్న జిల్లా కలెక్టర్‌ ఉప్పొంగి పోయారు. సొంత లాభాలకు పాకులాడే ఈ రోజుల్లో ఆడంబరంగా జరుపుకునే కన్న కొడుకు పెళ్లికి అయ్యే ఖర్చును బడికి వెచ్చించిన వెంకటేష్‌ను సాక్షాత్‌ దేవుడిగా అభివర్ణించారు.

మరో అరకోటి
వజ్రపు వెంకటేష్‌ ఆధ్వర్యంలో తన సంస్థ ద్వారానే భవన పనులు శరవేగంగా జరిగాయి. ధరలు పెరిగినా వెనుకంజ వేయకుండా మరో అడుగు ముందుకేసి అరకోటి అదనపు ఖర్చుతో ఈ ఏడాది నవంబరు 28న రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, రాష్ట్ర విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్‌ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా పాఠశాల భవన సముదాయాన్ని ప్రారంభించారు. శిథిలావస్థలో ఉన్న బడిని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టి అందరి మదిలో సమున్నతంగా నిలుచున్నారు వజ్రపు వెంకటేష్‌.
– మద్దిలి కేశవరావు,
సాక్షి, ఇచ్ఛాపురం రూరల్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top