డాక్యుమెంట్లు పోయాయి..!

డాక్యుమెంట్లు పోయాయి..!


గైడ్

 

మా చె ల్లెలికి ఈ మధ్యనే  ఓ మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. అబ్బాయి అమెరికాలో గ్రీన్‌కార్డ్ హోల్డర్. మాకు అందిన సమాచారం మేరకు మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. బాగానే సంపాదిస్తున్నాడు. అయితే ఈ వివరాలన్నీ నిజమో కాదో ఎలా నమ్మడం? ఈ మధ్య ఎన్నారై సంబంధాల విషయంలో పలు మోసాలు జరుగుతున్నందున ఒకసారి ఎంక్వయిరీ చేయడం మంచిదేమో అనిపిస్తోంది. అందుకు ఏదైనా మార్గం ఉందా?

- నిర్మల



ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. అమెరికాలో మీకు తెలిసినవాళ్లు, బంధువులు ఎవరైనా ఉంటే, వారితో విషయం చెప్పండి. అబ్బాయి గురించిన పూర్తి వివరాలను సేకరించమని అడగండి. ఒకవేళ అలా ఎవరూ లేకపోతే... ఎవరైనా డిటెక్టివ్‌ని మాట్లాడుకోవచ్చు. వివరాలన్నీ చెబితే వాళ్లే ఎంక్వయిరీ చేసి చెబుతారు. అయితే నిజానికి ఇలాంటి విషయాల్లో తెలిసినవారికి బాధ్యతను అప్పగించడమే మంచిదని నా ఉద్దేశం.

 

మా తమ్ముడు ఈ మధ్యనే అమెరికాలో ఉన్న తన ఫ్రెండ్ దగ్గరకు వెళ్లాడు.  ఏదైనా పని దొరికితే చేద్దామన్న ఉద్దేశంతో తన సర్టిఫికెట్స్ కూడా తీసుకెళ్లాడు. కానీ అనుకోకుండా అక్కడ తన పాస్‌పోర్ట్, సర్టిఫికెట్స్ ఉన్న బ్యాగ్ పోగొట్టుకున్నాడు. ఆ విషయం నిన్ననే నాకు ఫోన్ చేసి చెప్పాడు. నాకు చాలా టెన్షన్‌గా ఉంది. పాస్‌పోర్ట్ లేకుండా ఆ దేశంలో ఉండటం నేరమా? వాడికి ఏదైనా ఇబ్బంది కలుగుతుందా? ఇప్పుడు వాడేం చేయాలి? సలహా ఇవ్వండి.

 - దీప్తి, వైజాగ్



 ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితే. పరాయి దేశం వెళ్లినప్పుడు ఇలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్లను చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం ఎంతో అవసరం. మీ తమ్ముడిని వెంటనే కొత్త పాస్‌పోర్టుకి అప్లై చేయమని చెప్పండి. డాక్యుమెంట్లు పోయాయని పోలీస్ కంప్లయింట్ ఇవ్వమని చెప్పండి. కొత్త పాస్‌పోర్ట్ వచ్చేవరకూ కూడా... పాత పాస్‌పోర్ట్ జిరాక్స్ కాపీ ఉంటే దాన్ని, వీసా పేజీని, పోలీస్ కంప్లయింట్ కాపీని, కొత్త పాస్‌పోర్ట్ కోసం పెట్టిన అప్లికేషన్ కాపీని ఎప్పుడూ తనతోనే ఉంచుకొమ్మని చెప్పండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... వీసా స్టాంపింగ్ మాత్రం అమెరికాలో చేయించుకోవడం కుదరదు. మన దేశంలోనే చేయించుకోవాలి.

 

 మీ సందేహాలు, సమస్యలను తెలియజేయాల్సిన చిరునామా...

 గైడ్, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్,

 రోడ్ నం. 1, బంజారాహిల్స్,

  హైదరాబాద్ - 34 ఈ మెయిల్: guide.sakshi@gmail.com

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top