ఆయుష్షును తగ్గించే చక్కెర | Sakshi
Sakshi News home page

ఆయుష్షును తగ్గించే చక్కెర

Published Mon, Mar 23 2020 11:22 AM

Obesity With Sugar - Sakshi

చక్కెర ఎక్కువగా తింటే ఒళ్లు పెరిగిపోయి మధుమేహం వస్తుందని మనకు చాలాకాలంగా తెలుసు. అయితే ఈ తెల్లటి విషం మన ఆయుష్షును కూడా తగ్గించేస్తుందని అంటున్నారు యూకేలోని  ఎమ్మార్సీ లండన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ మెడికల్‌ సైన్సెస్‌ శాస్త్రవేత్తలు. అధిక చక్కెరతో మీకు ఊబకాయం రాకున్నా సరే. ఆయుష్షు తగ్గడం మాత్రం గ్యారెంటీ అని వీరు హెచ్చరిస్తున్నారు. సెల్‌ మెటబాలిజమ్‌ అనే జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన వ్యాసం ప్రకారం.. చక్కెర ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్‌ ఆసిడ్‌ పేరుకుపోవడం వల్ల జీవితకాలం తక్కువ అవుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త డాక్టర్‌ హెలెనా కోచెమ్‌ అంటున్నారు.

ఈగలకు చక్కెరలు ఎక్కువగా ఉండే ఆహారం ఇచ్చి తాము పరిశీలనలు జరిపామని, మనుషుల మాదిరిగానే వాటికీ చక్కెరతో ఇన్సులిన్‌ నిరోధకత, ఊబకాయం వంటి సమస్యలు ఎదురయ్యాయని కోచెమ్‌ తెలిపారు. అయితే ఉప్పు మాదిరిగానే చక్కెర కూడా శరీరంలో నీటి మోతాదును తగ్గించేస్తోందని అందుకే మధుమేహానికి తొలి గుర్తు అధిక దాహమని వివరించారు. ఈగల మూత్ర వ్యవస్థను పరిశీలించినప్పుడు యూరిక్‌ ఆసిడ్‌ ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైందని, ఫలితంగా ఊబకాయం వంటి సమస్యల్లేకున్నా తొందరగా మరణించే అవకాశాలు పెరిగిపోతున్నట్లు తాము గుర్తించామని తెలిపారు.  మానవుల్లోనూ చక్కెర ఎక్కువగా తీసుకున్నప్పుడు మూతంరలో ప్యూరిన్లు ఎక్కువగా కనిపిస్తాయని ఇది కాస్తా అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతోందని చెప్పారు.

Advertisement
Advertisement