చెడు దుర్వాసన లాంటిది

No decision was made without consulting Junyad - Sakshi

చెట్టు నీడ

తోటి వారు సంతోషాల్లో ఉంటే చూసి ఏడ్వడం, బాధల్లో ఉంటే నవ్వడం మనల్ని కష్టాలు పాలు చేస్తుంది. 

జునైద్‌ తెలివైన యువకుడు. అందుకే అతడంటే పాదుషాకి ఎంతో అభిమానం. జునైద్‌ ను సంప్రదించకుండా ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. అది చూసి దర్బారులోని ఒక మంత్రి ఓర్వలేకపోయాడు. దర్బారునుంచి జునైద్‌ ను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రకరకాల కుట్రలు పన్నేవాడు. ఒకరోజు పాదుషా దగ్గరికెళ్లి ‘‘పాదుషా గారు జునైద్‌ మీ గురించి చెడుగా చెబుతున్నాడు. మీ దేహం నుంచి దుర్వాసన వస్తుందని ప్రచారం చేస్తున్నాడు. కావాలంటే రేపు అతను దర్బారులోకి రాగానే అతన్ని మీ దగ్గరకు పిలిపించుకుని చూడండి. అతను మీతో మాట్లాడేటప్పుడు ముక్కు, నోరు మూసుకుని మీతో మాట్లాడతాడు.’’ విషం చిమ్మాడతను. మంత్రి మాటలకు పాదుషా ఆశ్చర్యపోయాడు. రెండోరోజు ఉదయం మంత్రి తన పథకంలో భాగంగా జునైద్‌ కు మాయమాటలు చెప్పి తన ఇంటికి విందుకు ఆహ్వానించాడు. విందు ముగిసాక మాటల్లో పెట్టి వెల్లిపాయలు తినిపించాడు. విందు అవగానే జునైద్‌  దర్బారుకు వెళ్లాడు. జునైద్‌ను ఏదో అడిగేందుకు పాదుషా దగ్గరికి పిలిపించుకోగానే తన నోటినుంచి వస్తున్న దుర్వాసన వల్ల పాదుషా గారికి ఇబ్బంది కలుగుతుందనే భయంతో ముక్కూ, నోరు మూసుకున్నాడు. అది చూసిన పాదుషా మంత్రి చెప్పింది నిజమేనని నిర్ధారించుకున్నాడు. జునైద్‌ మీద కట్టలు తెగేంత కోపం వచ్చింది. వెంటనే ఒక లేఖను రాసి ఈ లేఖను గవర్నర్‌కు ఇమ్మని దానికి జునైద్‌ కు అందించాడు. జునైద్‌ లేఖను తీసుకుని దర్బారు నుంచి బయటకు వచ్చాడు.

దారిలోనే మంత్రి ఎదురయ్యాడు. జునైద్‌ చేతిలో ఉన్న లేఖను చూసి ‘ఈ ఉత్తరంలో ఏముంది?’ అని అడిగాడు. ‘‘పాదుషా గారు నాకోసం నగదు బహుమతులు ఇవ్వమని సిఫారసు లేఖ రాశారనుకుంటాను’’ అని చెప్పాడు. మంత్రి ఆ లేఖను తనకివ్వవలసిందిగా ప్రాధేయపడ్డాడు. జునైద్‌ ఆ ఉత్తరాన్ని మంత్రికి ఇచ్చేశాడు. మంత్రి ఆ ఉత్తరాన్ని అందుకుని ఎంతో సంబరపడుతూ తీసుకెళ్లి గవర్నర్‌ కు అందించాడు. గవర్నర్‌ ఉత్తరాన్ని తెరిచి చూడగా అందులో ‘‘ఈ లేఖను తెచ్చిన వ్యక్తిని ఉరితీసి చంపేయండి. శవాన్ని నా దగ్గరకు పంపండి’’ అని రాసి ఉంది. పాదుషా గారి ఆజ్ఞ మేరకు మంత్రిని ఉరికొయ్యకు వేలాడదీశారు. మరునాడు యధావిధిగా దర్బారుకు వచ్చిన జునైద్‌ను చూసిన పాదుషా నిర్ఘాంతపోయి తానిచ్చిన ఆ ఉత్తరం ఏమయ్యిందని అడిగారు. జరిగిందంతా పూసగుచ్చినట్లు చెప్పాడు జునైద్‌. ఈ మాటలు విన్న పాదుషా నువ్వు మంచి వాడివి కాబట్టే నీ మంచే నిన్ను బతికించింది. పాపానికి ఒడిగట్టిన ఆ మంత్రికి తగిన శాస్తి జరిగిందని చెప్పి జునైద్‌ కు విలువైన కానుకలు అందించాడు. తోటి వారు సంతోషాల్లో ఉంటే చూసి ఏడ్వడం, బాధల్లో ఉంటే నవ్వడం మనల్ని కష్టాలు పాలు చేస్తుంది. 
– ముహమ్మద్‌ ముజాహిద్‌  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top