సకుటుంబ ప్రకృతి సేద్యం! | Natural Farming with Desi Seed Varieties | Sakshi
Sakshi News home page

సకుటుంబ ప్రకృతి సేద్యం!

Jan 14 2020 12:08 AM | Updated on Jan 14 2020 12:08 AM

Natural Farming with Desi Seed Varieties - Sakshi

పెద్ద గొల్లపల్లిలోని తమ పొలంలో సన్న జీర దేశీ రకం వరి నాట్లు వేస్తున్న కిరణ్‌ కుటుంబ సభ్యులు

‘ఎంత చదువుకొని ఎంత డబ్బు గడిస్తున్నా, తిరిగి మూలాలు వెతుక్కుంటూ రావాల్సిందే.. పొలంలోకి దిగాల్సిందే.. మన ఆరోగ్యం కోసం, మన పంటను మన చేతులతో పండించుకోవాల్సిందే..’ అంటున్నారు బూనేటి కిరణ్‌ గౌడ్‌. మంచి ఆహారం తినాలనుకుంటే సొంతంగా సహజ పద్ధతుల్లో పండించుకోవడమే ఉత్తమమని అంటున్నారు.

 మా ఆహారాన్ని మేమే పండించుకుంటాం అంటున్న కిరణ్‌ కుటుంబం

ఇంట్లో పెద్దలు, పిల్లలందరూ కలిసి స్వయంగా వరి నాట్లు వేసుకోవడం, ఆరోగ్యదాయకమైన, రుచికరమైన దేశీ రకాలను మాత్రమే పండించడం విశేషం. దేశవాళీ వరి, మిర్చి, వంగ, టమాటో, సొర తదితర కూరగాయలు పండించుకుంటూ.. తాము తింటూ అమృతాహారం తింటూ తోడబుట్టిన వారికి, దగ్గరి బంధుమిత్రుల కుటుంబాలకూ రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పత్తులను అందిస్తూ్త ఆదర్శప్రాయంగా నిలుస్తోంది కిరణ్‌ కుటుంబం.      

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ సమీపంలోని పెద్దగొల్లపల్లిలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన కిరణ్‌ ఉన్నత చదువులు చదువుకొని కొన్నేళ్ల పాటు హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వహించారు. తీరిక లేని ఉరుకులు పరుగుల జీవితం గడిపారు. ‘2006లో ఈ–పేపర్‌ సాంకేతికతను దేశంలోనే తొట్టతొలిగా అందించిన పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీ మాది.. అప్పట్లో ఆహారం గురించి ఆలోచించే తీరిక ఉండేది కాదు. అసలు ఆ ఆలోచనే లేదు. ఇక చాలనుకొని 2014లో విరమించుకున్నాను..’ అంటారాయన.

పొలం పనుల్లో చిన్నారులు

నగరంలో అముల్‌ డెయిరీ డీలర్‌షిప్‌ను నిర్వహిస్తూనే తమ స్వగ్రామంలోని భూమిలో గత రెండున్నరేళ్లుగా దేశీ వంగడాలతో ప్రకృతి సేద్యం చేస్తూ కుటుంబం కోసం అమృతాహారాన్ని పండిస్తున్నారు. తల్లి వినోదిని, భార్య అర్చన, కుమారు దేవ్రత్‌గౌడ్‌(10), కుమార్తె స్కంద(7)తోపాటు కిరణ్‌ ఇటీవల రబీ పంటగా దేశీ రకం సన్నజీర నారుతో నాట్లు వేశారు. ‘నాకు వ్యవసాయం తెలుసు. పిల్లలకు తెలియదు. ఇప్పుడు చెప్పకపోతే ఇకముందు వ్యవసాయమే మిగలదు. అందుకే రుచికరమైన, ఆరోగ్యదాయకమైన దేశీ వరి, కూరగాయలను పండిస్తున్నాను. మా ఇంట్లో అందరం తరచూ పొలానికి వెళ్తున్నాం.

నాట్లు వేయడం వంటి కొన్ని పనులను మేమే చేసుకుంటున్నాం.  ప్రస్తుతం పెద్దగొల్లపల్లి, మహేశ్వరం మండలం హర్షగూడలోని వ్యవసాయ క్షేత్రాల్లో ఆరేడు ఎకరాల్లో బాజ్‌ భోగ్, నవార, సన్నజీర తదితర రకాల వరి, కూరగాయలు పండిస్తూ మా దగ్గరి బంధుమిత్రులకు మాత్రమే ఇస్తున్నాం. అనుభవం గడించిన తర్వాత వందకు పైగా ఎకరాలను కౌలుకు తీసుకొని ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజలకు కూడా అమృతాహారాన్ని అందించాలన్నదే తన అభిమతమని కిరణ్‌ వివరించారు.

వంట నూనెలు కూడా కలుషితమైపోయినందున ఎద్దు గానుగ కూడా పెట్టాలనుకుంటున్నాను. అయితే, కూలీల సమస్య అతిపెద్ద సవాలుగా ఉందన్నారు.  ‘దేశీ రకాలను ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న రైతులు అపురూపంగా పండించిన ఉత్పత్తులను అమ్ముకోవడానికి తగిన మార్కెటింగ్‌ సదుపాయాల్లేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా, మార్కెట్‌లో వ్యాపారులు ప్రకృతి వ్యవసాయోత్పత్తులు విపరీతమైన ఎక్కువ ధరకు అమ్ముతుండటంతో ఈ ఉత్పత్తుల విలువ తెలిసి కొనుగోలు చేస్తున్న వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు.

ఉదాహరణకు.. నవార బియ్యం కిలో రూ. వందకు రైతు అమ్ముతుంటే వ్యాపారులు ఆన్‌లైన్‌లో రూ. 350 వరకు అమ్ముతున్నారు.  ఈ సమస్యను పరిష్కరించడానికి శంషాబాద్‌లో ప్రకృతి వ్యవసాయదారుల మార్కెట్‌ను ఏర్పాటు చేద్దామనుకుంటున్నాను. స్వయంగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులను ఎంపికచేసి ఈ మార్కెట్‌లో చోటు ఇస్తాం. నేరుగా వినియోగదారులే వచ్చి రైతు ధరకే కొనుక్కుంటారు. నేను కూడా ఎక్కువ విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం చేసి ప్రజలకు అమ్ముతా. అప్పటి వరకు మా కుటుంబం, దగ్గరి బంధువుల కోసమే పండిస్తా. డబ్బు కోసం కాదు, మా ఆరోగ్యం కోసం..’ అని కిరణ్‌ అంటున్నారు.

మహానగరంలో నివాసం ఉంటూనే మూలాలు వెతుక్కుంటూ పల్లెకు వెళ్లి, మట్టిని మక్కువతో గుండెలకు హత్తుకుంటున్న కొత్త తరం అన్నదాతలకు ప్రతినిధి కిరణ్‌ గౌడ్‌(98856 33353). ఈ కొత్త తరం ప్రకృతి వ్యవసాయదారులు పంటల సాగులోనే కాదు మార్కెటింగ్‌లోనూ తమదైన ముద్ర వేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పంటల పండుగ సంక్రాంతి సందర్భంగా ఈ కొత్త తరం అన్నదాతలకు జేజేలు పలుకుదాం!

‘నాకు వ్యవసాయం తెలుసు. పిల్లలకు తెలియదు. ఇప్పుడు చెప్పకపోతే ఇకముందు వ్యవసాయమే మిగలదు. అందుకే మా ఇంట్లో అందరం తరచూ పొలానికి వెళ్తున్నాం. నాట్లు వేయడం వంటి కొన్ని పనులను మేమే చేసుకుంటున్నాం..’


బాజ్‌ బోగ్‌ వరి పంట (ఫైల్‌)

ఫొటోలు: ఎస్‌ఎస్‌ ఠాగూర్, సీనియర్‌ ఫొటోగ్రాఫర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement