
నేటి పత్రాలు.. రేపటి నోట్లు
సామాన్య ప్రజల్లో పొదుపు అలవాటును పెంపొందించి ఆ పొదుపు సొమ్మును దేశ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే మార్గంలో .....
ఉమన్ ఫైనాన్స్
సామాన్య ప్రజల్లో పొదుపు అలవాటును పెంపొందించి ఆ పొదుపు సొమ్మును దేశ ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడే మార్గంలో పెట్టుబడి పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం ‘నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్’ (ఎన్.ఎస్.సి.) స్కీమును ప్రారంభించింది. ఈ స్కీమును పోస్ట్ ఆఫీసు ద్వారా ప్రభుత్వం నిర్వహిస్తుంటుంది. ఇందులో పెట్టుబడులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వారు ఈ స్కీములో పెట్టిన పెట్టుబడికి సెక్షన్ 80 సి కింద పన్ను మినహాయింపును కూడా ఇస్తున్నారు.
ఎన్.ఎస్.సి. స్కీములు ప్రస్తుతం ఎన్నారైలు, హెచ్.యు.ఎఫ్. (హిందూ అన్‌డివెడైడ్ ఫ్యామిలీ) లు పెట్టుబడి పెట్టడానికి వీలుకాదు. ఒకవేళ ఎన్నారై కాకముందు పెట్టుబడి పెట్టి ఉన్నట్లయితే ఆ పెట్టుబడి కొనసాగుతుంది. కాల పరిమితి ముగిసిన తర్వాత వాపసు
తీసుకోవాలి.
ఎన్.ఎస్.సి. లను మూడు పద్ధతుల్లో కలిగి ఉండొచ్చు.
సింగిల్ హోల్డర్ (వ్యక్తిగతంగా లేదా మైనరు తరఫున జాయింట్ హోల్డర్ (ఎ) : జాయింటుగా ఇద్దరి పేరు మీద తీసుకుని, కాల పరిమితి ముగిసిన తరువాత ఈ మొత్తాన్ని ఇద్దరి పేరు మీద జాయింట్‌గా పొందవచ్చు. జాయింట్ హోల్డర్ (బి) : జాయింటుగా ఇద్దరి మీద పొందవచ్చు. అలాగే మెచ్యూరిటీ మొత్తాన్ని జాయింట్ హోల్డర్స్ ఏ ఒక్కరి పేరు మీదనైనా పొందవచ్చు.
ఎన్.ఎస్.సి. వివరాలు - నిర్వహణ
ఎన్.ఎస్.సి.లలో కనీస మొత్తం 100 రూపాయల నుంచి ఎంత మొత్తం వరకైనా పెట్టుబడి పెట్టవచ్చు. కానీ పన్ను మినహాయింపు మాత్రం ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 80 సి లో పొందు పరిచిన మొత్తం వరకు మాత్రమే వర్తిస్తుంది.వీటిని 100, 500, 1,000, 10,000 రూపాయల విలువ కలిగిన సర్టిఫికెట్స్ రూపేణా అందజేస్తారు. ఒక వ్యక్తి ఎన్ని సర్టిఫికెట్స్ అయినా పొందవచ్చు.
టి.డి.ఎస్. వర్తించదు.
నామినీని పొందుపరిచే సదుపాయం కూడా ఉంది. నామినీని ముందే సర్టిఫికెట్ తీసుకునేటప్పుడు గానీ, ఎన్.ఎస్.సి.ని పొందిన తర్వాత గానీ నమోదు చేయవచ్చు. ఒకవేళ గడువు తీరకముందే ఎన్.ఎస్.సి. తీసుకున్న వ్యక్తి మరణిస్తే ఆ సర్టిఫికెట్ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.ఈ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్‌ను కొల్లేటరల్‌గా (తనఖా) పెట్టి బ్యాంకుల నుండి లోన్ పొందే సదుపాయం కూడా ఉంది.ఎన్.ఎస్.సి.ల వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.5 శాతం చొప్పున అందజేస్తున్నారు. ఎన్.ఎస్.సి. తీసుకున్నప్పుడు ఏ వడ్డీ రేటు అయితే ఉంటుందో ఆ కొన్న ఎన్.ఎస్.సి.కి అప్పటి వడ్డీ రేటే అమలు చేయడం జరుగుతుంది.
► ప్రతి సంవత్సరం వచ్చే వడ్డీ రీ ఇన్వెస్ట్ అవుతున్నప్పటికీ ఆ వడ్డీకీ పన్ను వర్తించదు.
► ఎన్.ఎస్.సి కొన్న తర్వాత కాల పరిమితి లోపల ఒకే ఒక్కసారి వేరే వ్యక్తి పేరిట మార్చుకునే అవకాశం ఉంటుంది.
► ఎన్.ఎస్.సి.లను ఒక పోస్టాఫీసు నుండి ఇంకో పోస్టాఫీసుకు మీ సౌలభ్యం ప్రకారం మార్చుకోవచ్చు.
► ఏవైనా కారణాల వల్ల మీరు ఎన్.ఎస్.సి. పోగొట్టుకున్నట్లయితే డూప్లికేట్ సర్టిఫికేట్‌ని పొందవచ్చు.
► రిస్క్ తక్కువగా ఉండి ఒక నిర్ణీత మొత్తాన్ని పొందగోరేవారు ఈ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్స్‌ని నెల నెల కొంటూ, కాల పరిమితిముగిసిన తర్వాత ఆ మొత్తాన్ని రీ ఇన్‌వెస్ట్ చేసినట్లయితే తమ రిటైర్‌మెంట సమయానికి ఒక మంచి మొత్తాన్ని సమకూర్చుకోవచ్చు.
రజని భీమవరపుఫైనాన్షియల్ ప్లానర్, ‘జెన్ మనీ’