టచ్ చేస్తే బ్లాగుల తుపాన్... టంబ్లర్! | million blogs in tumblr.com | Sakshi
Sakshi News home page

టచ్ చేస్తే బ్లాగుల తుపాన్... టంబ్లర్!

Sep 13 2013 11:38 PM | Updated on Jul 26 2018 5:21 PM

టచ్ చేస్తే బ్లాగుల తుపాన్... టంబ్లర్! - Sakshi

టచ్ చేస్తే బ్లాగుల తుపాన్... టంబ్లర్!

‘‘ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో బోర్ కొట్టేసింది.. రొటీన్ అప్‌డేట్స్‌తో నెటిజన్లు కొంచెం అలసిపోయారు.. తలకెక్కిన ట్విటర్ పిచ్చి తగ్గుముఖం పట్టింది.. అక్కడ సెలబ్రిటీలకు తప్ప సామాన్యుల ఘోషకు విలువలేదనిపిస్తోంది..

‘‘ ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో బోర్ కొట్టేసింది.. రొటీన్ అప్‌డేట్స్‌తో నెటిజన్లు కొంచెం అలసిపోయారు.. తలకెక్కిన ట్విటర్ పిచ్చి తగ్గుముఖం పట్టింది.. అక్కడ సెలబ్రిటీలకు తప్ప సామాన్యుల ఘోషకు విలువలేదనిపిస్తోంది.. పింట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ కలగనే లేదు.. గూగుల్‌ప్లస్‌లో గమ్మత్తులేమీ కనిపించలేదు...’’
 
ఈ తరహా అభ్రిపాయంతో ఉన్నవారికి, సోషల్‌నెట్‌వర్కింగ్‌లో కొంచెం కొత్తగా ఏదైనా ట్రై చేద్దామనుకుంటున్న వారికి ఒక ఛాయిస్ ‘టంబ్లర్.కామ్’ ఈ బ్లాగర్‌ల కూడలిలోకి ఎంటరవ్వాలి కానీ.. ఎంటర్‌టైన్ మెంట్‌కు లోటే లేదు.  ప్రత్యేకించి ఫేస్‌బుక్, ట్విటర్‌లపై బోర్‌కొట్టిన వారు దృష్టి పెట్టాల్సిన సైట్ టంబ్లర్.కామ్.
 
లెక్కకు మించి బ్లాగులు, బ్లాగ్ పోస్ట్‌లు...


టంబ్లర్ ఒక బ్లాగింగ్  సైట్. అయితే బ్లాగులంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది బ్లాగ్‌స్పాట్.కామ్, వర్డ్‌ప్రెస్.కామ్ తదితరాలు. ఈ తరహాలోనే కొత్త ఫీచర్లతో ఉంటుంది టంబ్లర్. తెలుగులో బ్లాగు నిర్వహించాలనుకున్నవారికి, భావాలను అక్షరబద్ధం చేయాలనుకున్న వారికి బ్లాగ్‌స్పాట్.కామ్ ఇన్ని రోజులూ ప్రథమ ప్రాధాన్యతగా ఉంది. అయితే ఈ వెబ్‌సైట్ కన్నా ఎంతో భిన్నమైన, భారీస్థాయి కంటెంట్‌ను అందిస్తుంది టంబ్లర్.కామ్. ఇందులో 136.6 మిలియన్ బ్లాగులున్నాయి. అంటే దాదాపు 13 కోట్ల 66 లక్షల బ్లాగులన్నమాట! వీటిద్వారా 61.1 బిలియన్ పోస్టులు ప్రచురితం అయ్యాయని టంబ్లర్ లెక్కలు చెబుతున్నాయి.
 
ఆర్‌‌ట నుంచి అడాల్ట్ వరకూ...


యాక్సెసరీస్, యాక్టర్స్, ఆర్ట్, ఆర్టిస్ట్స్, బ్యూటీ, బుక్స్, బిజినెస్, చారిటీస్, కామిక్స్, కల్చర్, డిజైన్, ఎడ్యుకేషన్, ఎంటర్‌టైన్‌మెంట్, ఫ్యాషన్, ఫిల్మ్, ఫిట్‌నెస్, హోమ్ అండ్ లైఫ్‌స్టైల్, మెడిసిన్, మ్యూజిక్, ఫోటోగ్రఫీ, పొయెట్రీ, పాలిటిక్స్, సైన్స్, స్పిరిచ్యువాలిటీ, స్పోర్ట్స్, స్టార్టప్స్, టెక్నాలజీ, ట్రావెల్, టెలివిజన్, యంగ్ అడాల్ట్.. ఇలా అన్ని విభాగాల కంటెంట్‌కు సంబంధించిన బ్లాగులూ ఉంటాయిక్కడ.  బ్లాగ్‌స్పాట్.కామ్‌లో  మనకు కావాల్సిన కేటగిరీ బ్లాగులను వెదుక్కోవడం కొంచెం కష్టమైన పనే. అయితే.. టంబ్లర్‌లో మాత్రం కావాల్సిన కేటగిరీని ఒకే క్లిక్‌తో క్యాచ్ చేయడానికి అవకాశం ఉంది.
 
 క్రియేట్ చేయడానికి ముప్పై సెకన్ల సమయమే!


జీమెయిల్, ఫేస్‌బుక్ యూజర్ ఐడీలతో టంబ్లర్‌లో బ్లాగ్ క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కేవలం ముప్పైసెకన్లలోనే బ్లాగ్‌ను క్రియేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నట్టుగా తన హోమ్‌పేజ్‌లో పేర్కొంది టంబ్లర్.  
 
తెలుగులోనూ టైప్ చేయవచ్చు..


పీసీలో తెలుగు టైపింగ్ టూల్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా టంబ్లర్ పోస్ట్‌ను తెలుగులో టైప్ చేయవచ్చు. అయితే బ్లాగ్‌స్పాట్.కామ్‌లో తెలుగు పదాలకు ఇంగ్లిష్‌లో స్పెల్లింగ్‌ను రాస్తే.. అది తెలుగు యూనిక్ కోడ్ ఫాంట్‌లోకి మారుతుంది. టంబ్లర్‌లో ఆ అవకాశం లేదు. ప్రాంతీయ భాషల బ్లాగర్‌లను లక్ష్యంగా చేసుకుని గూగుల్ జీమెయిల్‌లోని కంపోజింగ్ టెక్నిక్స్‌ను బ్లాగ్‌స్పాట్.కామ్‌లోకి అనువర్తింపజేసింది. అందరికీ దగ్గరయ్యింది. టంబ్లర్ ఈ విషయంలో ఇంకా చాలా కృషి చేయాల్సి ఉంది.
 
టంబ్లర్ స్టఫ్...


టంబ్లర్‌స్టఫ్ పేరుతో ఫోటోల, వీడియోల రూపంలో ప్రతి బ్లాగర్‌కూ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను అందిస్తుంది ఈ సైట్. ఇవిగాక మీరు ఫాలో అయ్యే బ్లాగుల నుంచి ఎప్పటికప్పుడు కొత్త పోస్టులు పలకరిస్తుంటాయి.
 
 మొదలెట్టేస్తే ఫ్యాన్ ఫాలోయింగే!


 తెలుగు లేదా ఇంగ్లిష్‌లో మంచి రైటింగ్ స్కిల్స్ ఉన్నా, ఫోటోగ్రఫీపై పట్టున్నా, షార్ట్‌ఫిలిమ్ వీడియోల పబ్లిషింగ్‌కైనా.. టంబ్లర్.కామ్ ఒక చక్కటి మార్గం.
 
 స్నేహితులను పట్టేయవచ్చు..  


 మీరు బ్లాగును ప్రారంభించిన తర్వాత.. మీ ఫ్రెండ్స్‌ని టంబ్లర్‌లో ఫైండ్ చేయడం చాలా సులువు. ఫేస్‌బుక్‌లో లేదా జీమెయిల్ ద్వారా మీకు స్నేహితులుగా ఉన్న వారెవరైనా టంబ్లర్ బ్లాగ్‌ను నడుపుతుంటే ‘పీపుల్ యూ నో’ మీద క్లిక్ చేయడం ద్వారా అన్వేషించవచ్చు. ఫేస్‌బుక్, జీమెయిల్ స్నేహాలను ఇక్కడ కూడా కొనసాగించవచ్చు.
 
 కార్ప్ మొదలెట్టాడు, యాహూ కొనుక్కొంది..

 
 2007లో టంబ్లర్.కామ్ మొదలైంది. దీన్ని డేవిడ్ కార్ప్ అనే టీనేజర్ ప్రారంభించాడు. అతడు సాదాసీదాగా మొదలుపెట్టిన ఈ వెబ్‌సైట్ ప్రారంభంతోనే అందరినీ కట్టిపడేసింది. ఇదే సమయంలో సోషల్‌నెట్‌వర్కింగ్‌లో గూగుల్, ఫేస్‌బుక్‌ల విజృంభణతో వెలవెలబోతున్న యాహూ.కామ్ టంబ్లర్‌పై దృష్టిపెట్టింది. 1.1 బిలియన్ డాలర్లసొమ్మును ఆఫర్ చేసి కార్ప్ నుంచి టంబ్లర్‌ను కొనుగోలు చేసింది.
                                
 -జీవన్ రెడ్డి.బి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement