తబారక్‌... ముబారక్‌

Migrant Worker Wife Sorga Problem Of Rickshaw Story In Sakshi Family

రిక్షా రక్ష

ఆకలితో చచ్చేట్టు మేము అక్కడ.. నా ఇద్దరు కూతుళ్లు ఇక్కడ.. మేం పడ్డ బాధ మాటల్లో చెప్పలేను. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. అందరం ఒకే చోట ఉన్నాం.. ఈ క్షణంలో ప్రాణం పోయినా పర్వాలేదు’  ఒక వలస కార్మికుడి భార్య మాట ఇది. ఆమె పేరు సోర్గా. అయితే ఈ కథనం ఆమె గురించి కాదు.. వలస కార్మికుడైన ఆమె భర్త ఇస్రాఫిల్‌ గురించీ కాదు. వాళ్లబ్బాయి పదకొండేళ్ల తబారక్‌ గురించి.. తల్లిని, తండ్రిని రిక్షాలో కూర్చోబెట్టుకొని ఆరువందల కిలోమీటర్లు రిక్షాతొక్కాడు తబారక్‌. 
∙∙ 
తబారక్‌ది బిహార్‌లోని, అరారియా జిల్లా జోకిహత్‌. ఆరుగురు సంతానంలో తబారక్‌ అయిదోవాడు. ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక చెల్లి. జోకిహత్‌లో ఒక పూరి గుడిసె తప్ప ఏమీ లేదు ఆ కుటుంబానికి. ఇరౖÐð  ఏళ్ల కిందట వారణాసికి వలస వెళ్లాడు తబారక్‌ తండ్రి ఇస్రాఫిల్‌. అక్కడ ఓ మార్బుల్‌ షాప్‌లో పనికి కుదిరాడు. పిల్లలను చూసుకుంటూ.. దొరికిన పనిచేసుకుంటూ ఊళ్లోనే ఉండిపోయింది తబారక్‌ తల్లి సోర్గా. ఒకసారి పనిచేస్తుండగా కంటికి దెబ్బతగిలి చూపు కోల్పోయింది సోర్గా. దాంతో ఇంటికే పరిమితమైపోయింది ఆమె. 

అక్కడ వారణాసిలో..
దుకాణంలో రాళ్లు మోసే కూలీగా వస్తున్న జీతంలోంచి కొంత ఇంటికి పంపి.. మిగిలిన దాంతో తన ఖర్చులను వెళ్లదీసుకుంటున్న 55 ఏళ్ల ఇస్రాఫిల్‌ ఈ యేడాది ఫిబ్రవరిలో ప్రమాదానికి గురయ్యాడు. కాలు విరిగింది. ఈ విషయం తెలియగానే తబారక్‌ను తోడు తీసుకుని వారణాసి వచ్చింది సోర్గా. భర్త ఆరోగ్యం కాస్త కుదుట పడగానే తిరగి ఊరెళ్లిపోదామనుకుంది. కాని ఈలోపే కరోనా వల్ల లాక్‌డౌన్‌ విధించడంతో వారణాసిలోనే చిక్కుకు పోవాల్సి వచ్చింది. దెబ్బతగిలి అప్పటికే నెల రోజులుగా సెలవులో ఉన్న ఇస్రాఫిల్‌ దగ్గర దాచుకున్న డబ్బంతా అయిపోయింది. లాక్‌డౌన్‌ బంద్‌ వల్ల పనీ పోయి.. ఆకలితో అలమటించే రోజులు వచ్చాయి. ఇక అక్కడ ఉండే కన్నా కష్టమో నష్టమో సొంతూరుకు వెళ్లడమే నయమనే అభిప్రాయానికి వచ్చేశాడు. అతనికి ఒక సైకిల్‌ రిక్షా ఉంది. దాంట్లోనే జోకిహత్‌కు బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. అదేవిషయం భార్యకు, కొడుకుకూ చెప్పాడు. కాలిగాయంతో బాధపడుతున్న తండ్రి రిక్షాను ఎలా నడుపుతాడు అని ఆలోచించాడు తబారక్‌. తెల్లవారి పొద్దున్నే అమ్మానాన్నకంటే ముందే తయారై రిక్షా ఎక్కాడు తబారక్‌. వెనక కాదు.. ముందున్న సైకిల్‌మీద. అమ్మానాన్నని ఎక్కించుకొని రిక్షా తొక్కడం మొదలుపెట్టాడు. 

ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వారణాసి నుంచి బిహార్‌లోని జోకిహత్‌ వరకు మొత్తం 600 కి.మీ. ఎదురైన అడ్డంకులన్నిటినీ అధిగమించి తల్లిదండ్రులను క్షేమంగా సొంతూరు చేర్చాడు. ప్రస్తుతం.. ఇస్రాఫిల్, తబారక్‌ ఇద్దరూ కూడా జోకిహత్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌లో ఉన్నారు. పదకొండేళ్ల తబారక్‌.. తన తల్లిదండ్రులను కూర్చోబెట్టుకొని రిక్షా తొక్కుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. ఆ పిల్లాడి అన్న కూడా వలసకార్మికుడే. ప్రస్తుతం తమిళనాడులో చిక్కుకుపోయాడు. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top