స్త్రీలోక సంచారం

Mayawati to go solo if not given fair seat share - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

►2019 సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్‌వాదీ (ఎస్పీ) పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలంటే ఆ పార్టీ తమను తగినన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించవలసి ఉంటుందని స్పష్టం చేసిన బహుజన సమాజ్‌వాదీ (బీఎస్పీ) పార్టీ అధినేత్రి మాయావతి.. అదే సందర్భంలో, ‘భీమ్‌ ఆర్మీ’ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్‌ఆజాద్‌ తనను ‘బువా’గా (ఆంటీ) పేర్కొంటూ.. ‘మా ఇద్దరిదీ ఒకే రక్తం’ అని ప్రచారం చేసుకోవడం సరికాదు అని అన్నారు. దీనిపై స్పందించిన ఆజాద్‌.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంగానీ, పొత్తులు పెట్టుకోవాలన్న ఆకాంక్ష గానీ తమకు లేవు కనుక బీఎస్పీ ఆందోళన చెందనవసరం లేదని, మాయావతిని తన రక్తసంబంధీకురాలిగా చెప్పుకోవడం వెనుక.. తామిద్దరం దళితులమేనన్న భావన తప్ప, మరొకటి లేదని అన్నారు.

►ఇండియా రాకెట్‌ రహస్యాలను పాకిస్తాన్‌కు చేరవేశాడన్న ఆరోపణలపై 1994లో అరెస్ట్‌ అయి, విచారణ అనంతరం 1998లో నిర్దోషిగా విడుదలైన ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణన్‌కు పరువు నష్టపరిహారంగా కేరళ ప్రభుత్వం ఎనిమిది వారాలలోపు 50 లక్షల రూపాయలను చెల్లించాలని సుప్రీంకోర్టు తాజా తీర్పు. ఆనాటి కేసులో కేరళ పోలీసు అధికారుల ప్రమేయంపై దర్యాప్తు జరిపేందుకు ఒక కమిటీని కూడా నియమించింది. రెండు రోజుల అనంతరం ఈ కేసులోనే 1997లో అరెస్ట్‌ అయి, ఏడాది తర్వాత నిర్దోషిగా విడుదలైన బాధితురాలు మరియం రషీదా.. తను కూడా కేరళ పోలీసులపై కేసు వేసి, పరిహారం కోరనున్నట్లు ఓ రహస్య ప్రదేశం నుంచి మీడియాకు సమాచారం అందించారు. ‘ఫారినర్స్‌ రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌ సెల్‌’ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్న విజయన్‌ అనే వ్యక్తి తనను అక్రమంగా నిర్బంధించి, లైంగిక సుఖం కోసం తనను వేధించి, తను తిరస్కరించడంతో కక్షగట్టి ‘ఇస్రో గూఢచర్యం’ కేసులో ఇరికించినట్లు మాల్దీవుల పౌరురాలైన మరియం రషీదా అప్పట్లోనే మీడియా దృష్టికి తీసుకురాగా.. ఇప్పుడీ సుప్రీంకోర్టు తీర్పుతో, దర్యాప్తు కమిటీ నియామకంతో.. రషీదా ధైర్యంగా బయటికి వచ్చారు. 

►పనిచేసే చోట మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులు నానాటికీ అధికమౌతున్నాయని, బాధితుల నుండి సిటీ పోలీసులకు నెలకు నలభై వరకు లైంగిక వేధింపుల ఫిర్యాదులు అందుతుండగా వాటిల్లో కనీసం మూడు ఫిర్యాదులు పని చేసే చోట లైంగిక వేధింపులపైనే ఉంటున్నాయని హైదరాబాద్‌ (రాచకొండ) సైబర్‌ క్రైమ్‌ విభాగం అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.హరినాథ్‌ తెలిపారు. ఈ విషయమై ‘షీ’ టీమ్స్‌ ఏసీపీ నర్మద మాట్లాడుతూ.. వాస్తవానికి ఏ కొద్ది మంది మహిళలో ఫిర్యాదు వరకు వస్తున్నారని, ఫిర్యాదు చేయని బాధితులు ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఉండే అవకాశాలున్నాయని అన్నారు.  

► రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను సమీకరించుకోవడం కోసం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన 12 రోజుల పర్యటనలో భాగంగా ఆర్థికమంత్రి అమిత్‌ మిశ్రా, ఆర్థికశాఖ కార్యదర్శి హెచ్‌.కె.ద్వివేది, ప్రధాన కార్యదర్శి మాలేడేలతో కలిసి ఆదివారం ఉదయం ఫ్రాంక్‌ఫర్ట్‌ (జర్మనీ) బయల్దేరారు. జర్మనీ, ఇటలీ దేశాలలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, అక్కడి ప్రభుత్వ అధికారుల ఆహ్వానంపై విదేశీ పర్యటనకు వెళ్లిన మమత తిరిగి ఈ నెల 28న స్వదేశానికి చేరుకుంటారు. 

►ఒక కేరళ న¯Œ పై పలుమార్లు అత్యాచారం జరిపిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌ బిషప్‌ ఫ్రాంకో ములక్కల్‌.. విచారణకు హాజరయ్యే నిమిత్తం రేపు (సెప్టెంబర్‌ 18) కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో దిగవలసి ఉండగా.. ప్రజాగ్రహాన్ని, మీడియాను తప్పించుకోడానికి అతడు బెంగళూరు, చెన్నై లేదా మంగళూరు ఎయిర్‌పోర్ట్‌లలో ఏదైనా ఒక దానిలో దిగి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కొచ్చి చేరుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు, బిషప్‌ తనపై అత్యాచారం జరిపిన విషయాన్ని బాధితురాలు 2016 సెప్టెంబర్‌లో.. రెండు భాగాలుగా విభజించి ఉన్న  కన్ఫెషన్‌ బాక్సులోని ఒక భాగంలో నిలబడి, రెండో భాగంలో ఉన్న మత ప్రబోధకుని ఎదుట చెప్పుకోగా.. ఆమె చెప్పిన వివరాలను వినిన ప్రబోధకుడెవరో గుర్తించడం కోసం 12 మంది ప్రీస్ట్‌లను ప్రత్యేక పోలీసు బృందం ఒకటి రేపే విచారించబోతోంది.

►లండన్‌లో ప్రస్తుతం జరుగుతున్న ‘లండన్‌ ఫ్యాషన్‌ వీక్‌’ ఈవెంట్‌లో అర్జెంటీనా మోడల్‌ వలేరియా గార్షియా.. క్యాట్‌ వాక్‌ చేస్తూనే ‘బ్రెస్ట్‌ పంప్‌’ను ఉపయోగించడం విశేష వార్తాంశం అయింది. ఇద్దరు బిడ్డల తల్లి అయిన వలేరియా.. నలుపురంగు ట్రౌజర్స్‌ సూటు, బ్రా ధరించి, బ్రా లోపల ఎల్వీ కంపెనీ వారి చప్పుడు చెయ్యని తేలికపాటి బ్రెస్ట్‌ పంప్‌ను అమర్చుకుని అక్కడ లేని తన రెండో బిడ్డకు అందించడం కోసం పాలను తీసిపెట్టుకుంటున్న ఆ మాతృమూర్తిని ర్యాంప్‌ పక్కన వరుసగా కూర్చొని ఉన్న న్యాయనిర్ణేతలు అభినందించకుండా ఉండలేకపోయారు.

►బాలలపై లైంగిక అకృత్యాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో ప్రస్తుతం అనేక దేశాల్లోని చర్చిలు తమ ప్రతిష్టను కోల్పోతున్న తరుణంలో.. మహిళలు మతాధికారి పాత్రలను పోషించడం ఎంతైనా అవసరమని కెనడియన్‌ కార్డినల్‌ మార్క్‌ క్వెలెట్‌ అభిప్రాయపడ్డారు. ఇందు కోసం మహిళలకు శిక్షణ ఇచ్చి మత బోధకులుగా వారికి తర్ఫీదు ఇచ్చేందుకు చర్చి యాజమాన్యాలు ముందుకు రావాలనీ, నిజానికి ‘ప్రీస్ట్‌హుడ్‌’ అనే ఉదాత్తమైన బాధ్యత మహిళల నిర్వహణ వల్ల మరింత గౌరవప్రదం అవుతుందని ఆయన అన్నారు.

►28 ఏళ్ల అమెరికన్‌ గాయని టేలర్‌ స్విఫ్ట్‌కు కనీసం రెండేళ్ల పాటు దూరంగా ఉండాలని.. కొన్నాళ్లుగా ఆమెను వెంబడిస్తూ, ఉత్తరాలతో  వేధిస్తూ, భయపెడుతూ, ద్వేషిస్తూ, ‘ప్రేమిస్తూ’ ఉన్న ఎరిక్‌ స్వార్‌బ్రిక్‌ అనే సైకో అభిమానిని ఆదేశించిన యు.ఎస్‌.కోర్టు.. ఆ ఆదేశాలు తక్షణం అమలయ్యేలా ‘రిస్ట్రెయినింగ్‌ ఆర్డర్‌’(నిషేధాజ్ఞ)ను జారీ చేసింది. ‘‘నిన్ను రేప్‌ చేస్తాను. రేప్‌ చేశాక చంపేస్తాను. నీ లాయర్లు, నీ న్యాయస్థానం నా నుండి నిన్ను కాపాడుకోలేవు. ఎందుకంటే నిన్ను అంతగా నేను ప్రేమిస్తున్నాను’’ అంటూ ఎరిక్‌ స్వార్‌బ్రిక్‌ నుంచి వస్తున్న వరుస ఉత్తరాలకు భీతిల్లిన టేలర్‌ స్విఫ్ట్‌ కోర్టును ఆశ్రయించగా.. ఎరిక్‌ ఇకముందు ఆమెను వెంబడించడంపై, ఉత్తరాలు రాయడంపై కోర్టు నిషేధం విధించింది. 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top