కష్టాలకే రేటింగ్‌ ఎక్కువ!

Many People Referred to by the Names of the Characters of the Serial - Sakshi

సీరియల్‌

‘అపరంజి’ బొమ్మగా ఆకట్టుకుని, ‘ఇద్దరమ్మాయిలు’తో మెప్పించి, ‘అష్టాచెమ్మా’ఆడేసి, ఇప్పుడు ‘నా కోడలు బంగారం’ అనిపించుకుంటున్న సుహాసిని తెలుగమ్మాయి.పరిచయం అక్కర్లేని నటి. వెండి తెర నుంచి బుల్లితెర వైపుగా టర్న్‌ తీసుకొని అందమైన అభినయంతో మెప్పిస్తున్న సుహాసిని ‘సాక్షి’తో పంచుకున్న చిరుజల్లులు మాల.

‘చాలా మంది సీరియల్‌ పాత్రల పేర్లతోనే పిలుస్తుంటారు. కానీ, నన్ను జనం ‘సుహాసిని’గానే గుర్తుంచుకున్నారు. ఈ గుర్తింపు ‘చంటిగాడు’ సినిమా ఇచ్చింది. చంటిగాడు సినిమా టెన్త్‌క్లాస్‌లో ఉండగా చేశాను. ఆ సినిమా సమయంలో నటన గురించి ఎలాంటి ఐడియా లేదు. ఫిల్మ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ లేదు. ఫొటోగ్రఫీ తెలిసిన వారి ద్వారా నా ఫొటోలు దర్శకురాలు జయగారి దగ్గకు వెళ్లాయి. నా ఫొటో చూడగానే పేరు అడక్కుండా, స్క్రీన్‌ టెస్ట్‌ చేయకుండా ఈ అమ్మాయే నా సినిమాలో హీరోయిన్‌ అన్నారట. అలా నేను సినిమాలోకి వచ్చాను. తెలుగు, తమిళ్, కన్నడ సినిమాలు చేశాను. 

సీరియల్‌ వైపు
‘అపరంజి’ సీరియల్‌తో మూవీ నుంచి టీవీకి వచ్చాను. ఓకే చేయడానికి ముందు ఆలోచనలో పడ్డాను. ‘సినిమాల్లో చేస్తున్నాను.. టీవీలో చేస్తే ఆఫర్స్‌ రావేమో’ అని. కానీ, సీరియల్‌లో లీడ్‌ రోల్‌ అంతా నా చుట్టూతానే తిరుగుతుంది, పర్‌ఫార్మెన్స్‌కి మంచి స్కోప్‌ ఉంది.. పైగా అప్పటికి మంచి రోల్‌ ఉన్న సినిమాలూ కూడా నాకేవీ లేవు. నా కో–యాక్టర్స్‌ కూడా ఇదే మంచి ఆప్షన్‌ అన్నారు. యాక్టర్స్‌కి కావల్సింది వర్క్, గుర్తింపు. చంటిగాడుతో నాకు గుర్తింపు వచ్చింది. నాక్కావల్సింది వర్క్‌. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని టీవీకి టర్న్‌ అయ్యాను. 

ఫ్యామిలీ సపోర్ట్‌
పుట్టిపెరిగింది అంతా నెల్లూరులోనే. మా తాతగారికి నేను సినిమాలో నటించడం అస్సలు ఇష్టం లేదు గ్లామర్‌ ఫీల్డ్‌ అని. ఎంతోకొంత చదివించి పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అనేవారు.. కానీ, మా అమ్మ బాగా సపోర్ట్‌ చేశారు. నాకు డ్యాన్స్‌ అంటే బాగా ఇష్టం. ఇంట్లో వాళ్లకు తెలియకుండా నాకు డ్యాన్స్‌ నేర్పించింది అమ్మ. ‘ఇలా ఉండాలి’ అని చెబుతారు కానీ, ఇలాగే ఉండి తీరాలి అని మా ఇంట్లో ఎప్పుడూ చెప్పలేదు. ఏదైనా వర్క్‌ చేసేముందు మాత్రం ‘ఆలోచించుకో’ అంటారు. మన ఇష్టం లేకుండా ఏదీ చేయలేం కదా! గ్లామర్‌ రోల్‌ అంటే ఓకే కానీ నాకూ ఎక్స్‌పోజింగ్‌ ఇష్టంలేదు. అందుకే అలాంటి ఆఫర్స్‌ వచ్చినా ఒప్పుకోలేదు. చేసినంత వరకు మంచి ఆఫర్స్‌ వచ్చాయి. ‘ప్రేమ, నాకోడలు బంగారం’.. సీరియల్స్‌తో ప్రొడ్యూసర్‌గా మారాను. ఈ అవకాశం నాకు ‘జీ’టీవీ ఇచ్చింది. అన్నింటికన్నా ప్రొడ్యూసర్‌ టైమ్‌ చాలా ఇంపార్టెంట్‌. ప్రతీది దగ్గరుండి చూసుకోవాలి.

మా నాన్నగారు, మావారి సపోర్ట్‌ ఉండటంతో నా వర్క్‌ ఈజీ అయ్యింది. అందుకే ఆర్టిస్టుగా, ప్రొడ్యూసర్‌గా చేయగలుగుతున్నాను.ఎప్పుడూ రెండు, మూడు సీరియల్స్‌ ఒకేసారి ఒప్పుకొని టెన్షన్‌ పడలేదు. ఒకే సీరియల్‌.. నెలలో పదిహేను రోజులు వర్క్, మిగతా రోజులు ఇల్లు. జీవితాన్ని అలా బ్యాలెన్స్‌ చేసుకోవడం ఈజీ అయ్యింది. ఎప్పుడైనా విలేజీకి వెళితే.. ‘నీకెన్ని కష్టాలమ్మా! తర్వాత ఏమౌతుందమ్మా’ అంటుంటారు సీరియల్‌ గురించి మాట్లాడుతూ. సీరియల్స్‌లో కష్టాలు, కన్నీళ్లు ఎక్కువ అని చాలా మంది అంటుంటారు. అయితే, ప్రేక్షకులు వాటికే ఎక్కువ కనెక్ట్‌ అవుతుంటారు. టి.ఆర్‌.పి.. ని బట్టే కంటెంట్‌ మార్చుకుంటూ వస్తాం. ఆ విధంగా చూస్తే కష్టాలున్న వాటికే రేటింగ్‌ ఎక్కువ అన్నమాట(నవ్వుతూ).

నా కోడలు బంగారం
అత్తా–కోడలు అనగానే ఒకరికొకరు పడదు.. అనుకుంటారు. కానీ,  ‘నా కోడలు బంగారం’ సీరియల్‌ మిగతా సీరియల్స్‌కి రివర్స్‌గా ఉంటుంది. ‘జీ’ టీవీలో ప్రసారమవుతున్న ఈ సీరియల్‌లో అత్తా–కోడలు తల్లీ కూతురులా ఉంటారు. నిజజీవితంలోనూ మా అత్తగారితో నేను చాలా బాగా ఉంటాను. ఇప్పుడు సీరియల్స్‌ కేవలం మహిళలు మాత్రమే కాదు యూత్, పిల్లలు కూడా చూస్తున్నారు. వారిని అట్రాక్టివ్‌ చేసేలా .. కొంత రొమాంటిక్, ఇంకొంత ఫన్‌ చూపిస్తుంటాం. అలాగే మదర్, ఫాదర్‌ సెంటిమెంట్‌ సీన్స్‌ కూడా మిస్‌ అవకూడదు. ఇలా ఆడియన్స్‌ అందరినీ దృష్టిలో పెట్టుకొని సీరియల్‌ ప్లాన్‌ నడుస్తుంటుంది. 

కాస్ట్యూమ్స్‌ ఎంపిక
నాకు షాపింగ్‌ చేయడం అంటే చాలా ఇష్టం. నెలలో 15 రోజులు షూటింగ్, మిగతా 15 రోజులు షాపింగ్‌ (నవ్వుతూ) చేయమన్నా విసుగు రాదు. కొత్తబట్టలు.. ఎప్పుడూ కొంటుంటున్నాను. ఏ రోజుకారోజు బెటర్‌డ్రెస్‌ అని ఎంపిక చేసుకుంటాను. చిన్నప్పటి నుంచి నాకీ అలవాటు ఉంది. నేను అందరిలో ప్రత్యేకంగా కనిపించాలి అనుకుంటాను. నా రెమ్యునరేషన్‌లో సగం మనీ బట్టలకే (నవ్వుతూ). ఇంట్లో నా బట్టలే కట్టలు కట్టలుగా ఉంటాయి. అంత పిచ్చి.. బట్టలంటే.

పెళ్ళి.. తర్వాతి జీవితం
ఇద్దరమ్మాయిలు సీరియల్‌ చేస్తున్నప్పుడు నా కో–స్టార్‌ ధర్మ నేను ప్రేమించుకున్నాం. పెద్దల అంగీకారం పెళ్లి చేసుకున్నాం. తను యాక్టింగ్‌లోకి రాకముందు సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేసేవారు. తనకు ఆస్ట్రేలియాలో జాబ్‌ ఆఫర్‌ వచ్చింది. ‘ఏమంటావు..?’ అని అడిగారు. నేను రాలేను.. అని చెప్పాను. ‘నీ కోసం నేనే జాబ్‌ వదిలేస్తాను’ అన్నారు. ‘ఇద్దరమ్మాయిలు’ సీరియల్‌లో తను చాలా తక్కువ టైమ్‌లోనే మంచిపేరు తెచ్చుకున్నారు. నా యాక్టింగ్‌లోనూ సజెషన్స్‌ ఇస్తుంటారు. ముందు అంతేకదా అనుకుంటాను.

తర్వాత మార్చుకుంటాను. పెళ్లయ్యాక మేం కలిసి సీరియల్‌ చేయలేదు. ఇద్దరమ్మాయిలు సీరియల్‌లో మాత్రం పోటా పోటీగా చేశాం. తనకు టైమ్‌ పంక్చువాలిటీ ఎక్కువ. చాలా ఫన్‌ క్రియేట్‌ చేస్తారు. రోజూ నిన్నటి కన్నా ఈ రోజు ఇంకొంచెం మంచి అనిపించుకుంటే చాలని, నా వల్ల ఎవరూ ఇబ్బందిపడకూడదని అనుకుంటాను. అందుకే సోషల్‌మీడియాలోనూ లేను. రిప్లై కోసం ఎదురు చూసేవారిని ఇబ్బందిపెట్టినట్టు అవుతుందని నా ఆలోచన. నెగిటివ్‌ అంటే అస్సలు ఇష్టపడను. ‘నా చుట్టూ మంచి ఉండాలి. అందులో నేను ఉండాలి’ అనే తత్త్వం నాది. 
– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top