
ఓ తెలుగు సీరియల్ వల్ల తన కూతురు నరకం చూసిందంటోంది చైల్డ్ ఆర్టిస్ట్ నిషిత (Nishita) తల్లి ప్రియ. అందుకు సంబంధించిన సాక్ష్యాలను సైతం బయటపెట్టింది. సెట్‌లో చిన్నారికి కరెంట్ షాక్ కొట్టిందని, ఆరోగ్యం బాగోలేకపోయినా షూటింగ్ చేయించారని వాపోయింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో రిలీజ్ చేసింది.
చిన్నారికి కరెంట్ షాక్
'అందులో నిషితను గార్డెన్ ఏరియాలో లైట్స్ ఉన్న దగ్గర పడుకోబెట్టారు. అక్కడున్న లైట్స్ ద్వారా కరెంట్ షాక్ రావడంతో ఆ పాప నిస్సహాయ స్థితిలో కేకలేసింది. మరో సీన్‌లో తను భయపడుతున్నా సరే బలవంతంగా స్విమ్మింగ్ పూల్‌లోకి లాగారు. అక్కడ తనకోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? కొన్నిసార్లు ఆరోగ్యం బాగోలేక బెడ్‌పై ఉన్నా సరే.. తనకు విశ్రాంతి ఇవ్వకుండా షూటింగ్‌కు రమ్మని ఒత్తిడి తెచ్చారు. అనారోగ్యంతోనే తను సెట్‌కు వచ్చి షూట్ చేయాల్సి వచ్చింది.
రెమ్యునరేషన్ ఆపేశారు
చిన్నపాప అని ఆలోచించకుండా రాత్రిపూట షూటింగ్స్‌కు రమ్మనేవారు. సీరియల్ నిర్మాతలు చైల్డ్ ఆర్టిస్టుల పట్ల ఇలాగే ప్రవర్తిస్తారా? అలాగే వీరు ఏప్రిల్ నుంచి రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఆపేశారు. పని చేయించుకున్నారు, కానీ డబ్బులివ్వలేదు. దాదాపు 150 ఎపిసోడ్ల తర్వాత సడన్‌గా నా కూతురిని తొలగించి మరొకరిని తీసుకున్నారు. తనకు ఒంట్లో బాగోలేకపోయినా, ఎంత ఇబ్బందిపడ్డా సరే అవన్నీ ఓర్చుకుని పని చేసింది. చివరకు ఇదా మీరు తనకిచ్చే బహుమతి?
టీఆర్పీ కోసం వాడుకున్నారు
మీరు నా కూతురిని రీప్లేస్ చేయగలరేమో కానీ తన టాలెంట్‌ను కాదు. టీఆర్పీ కోసం నెలల తరబడి తనను వాడుకున్నారు. ఇప్పుడేమో ఎక్స్‌పెన్సివ్ కిడ్ అని పక్కన పెట్టేశారు. ఈ సీరియల్ కోసమే ఎన్నో ప్రాజెక్టులను కాదనుకున్నాం. ఇప్పుడు ఒక్క మాటైనా చెప్పకుండా తీసేశారు' అని నిషిత తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. కాగా నిషిత.. కన్నడంలో లక్ష్మీ నివాస సీరియల్‌లో నటించింది. ఇందులో పోషించిన ఖుషి పాత్రతో ఎక్కువ పాపులారిటీ సంపాదించుకుంది.
చదవండి: హౌస్ మొత్తాన్ని అల్లాడించేసిన సంజనా, ఇప్పుడేకంగా కెప్టెన్!