బాషాలా అనంత ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది | Director Suresh Krisna Speech At Anantha Movie | Sakshi
Sakshi News home page

బాషాలా అనంత ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది

Nov 14 2025 6:14 AM | Updated on Nov 14 2025 6:14 AM

– దర్శకుడు సురేష్‌ కృష్ణ 

‘‘బాబా గారి గురించి బయోపిక్‌ చేయాలనుకున్నప్పుడు ఆయన ఆశ్రమానికి వెళ్లాను. ‘ఇంతకాలం ఎందుకు రాలేదు’ అని అడిగారు ఆయన. ఆ తర్వాత నా రొటీన్‌లో నేను పడిపోయాను. 2011లో ఆయన చనిపోయారు. గత ఏడాది ఆయన కలలోకి వచ్చి విభూది ఇచ్చారు. బాబాగారి దగ్గరికి నన్ను మొదటిసారి తీసుకెళ్లిన వ్యక్తికి ఈ విషయం ఫోన్‌ చేసి చెప్పాను. ఒక రోజు గిరీష్‌ కృష్ణమూర్తిగారు ఫోన్‌ చేసి, బాబాగారి జీవితం పై సినిమా చేయాలని చెప్పారు. 

నేనే ఎందుకు ఈ సినిమాను డైరెక్టర్‌ చేయాలని అడిగినప్పుడు... బాబాగారు కలలోకి వచ్చి మిమ్మల్ని డైరెక్ట్‌ చేయమని చెప్పారు అన్నారు. బాబాగారి శత జయంతి సందర్భంగా ఈ సినిమా చేయాలని కోరారు. అప్పుడు నా దగ్గర సరైన స్క్రిప్ట్‌ కూడా లేదు. అనుకోకుండా ఒక మంచి స్క్రిప్ట్‌ వచ్చింది. ఏదో భక్తి సినిమాలా కాదు... ‘బాషా’ సినిమా లాంటి కమర్షియల్‌ స్క్రిప్ట్‌ ‘అనంత’కు కుదిరింది’’ అని చెప్పారు దర్శకుడు సురేష్‌ కృష్ణ. జగపతిబాబు, సుహాసిని ప్రధాన పాత్రల్లో ఆధ్యాత్మిక ప్రాధాన్యంగా సాగే ‘అనంత’ చిత్రాన్ని గిరీష్‌ కృష్ణమూర్తి నిర్మించారు. 

ఈ సినిమా ఆడియో, టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో చిత్రదర్శకుడు సురేష్‌ కృష్ణ మాట్లాడుతూ– ‘‘కమర్షియల్‌ సినిమాల్లో ‘బాషా’ చిత్రం ఎలాంటి ట్రెండ్‌ క్రియేట్‌ చేసిందో, డివైన్‌ ఫిలిమ్స్‌లో ‘అనంత’ అలాంటి ట్రెండ్‌ సెట్‌ చేస్తుంది. జగపతిబాబుగారు అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ ఇచ్చారు. సుహాసిని చాలా ఇంపార్టెంట్‌ రోల్‌ చేశారు’’ అన్నారు. ‘‘సురేష్‌కృష్ణ ఎప్పుడూ మంచి సినిమా తీస్తారు. ఈ సినిమాని కూడా అందరూ చూడాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ్‌. ‘‘సత్యసాయిబాబాగారి ప్రేమతత్త్వం అందరికీ పంచాలనే మనస్తత్వం ఉంటే తప్పితే ఇలాంటి సినిమా చేయలేం’’ అని పేర్కొన్నారు సాయిమాధవ్‌ బుర్రా. ఈ కార్యక్రమంలో డైరెక్టర్‌ వీర శంకర్, రచయిత రామజోగయ్య శాస్త్రి, సినిమాటోగ్రాఫర్‌ చోటా కె. నాయుడు, నిర్మాత పుస్కూర్‌ రామ్మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement