అప్పగింతల కర్ర

Man killed His Wife by Snake Biting in kerala - Sakshi

అమ్మాయిని పంపిస్తున్నాం. ‘సర్దుకుపోవాలి తల్లీ..’
‘గుట్టును గడప దాటనివ్వకు బుజ్జీ..’
‘అణకువగా ఉండు బంగారం..’
‘మాటంటే నొచ్చుకోకు బిడ్డా..’
అన్నీ చెప్పాల్సిన మాటలే.
వీటితో పాటు..
ఇవ్వాల్సిన కర్ర కూడా ఒకటి ఉంది.
అప్పగింతల కర్ర!
ధీమాకు.. ధైర్యానికి.

అతడింకా నోరు విప్పలేదు.
‘నువ్వేనా నీ భార్యను చంపింది?’
‘అవును’.
ఎలా చంపావు?
‘ఆమె పడుకుని ఉన్న మంచం మీదికి పామును వదిలి కాటేయించాను’.
‘పాము ఎక్కడిది నీకు?’
‘పాములోళ్ల దగ్గర పదివేలకు కొన్నాను’.
‘పాములోళ్లు నీకెలా తెలుసు?’
‘యూట్యూబ్‌లో అడ్రస్‌ పట్టుకున్నాను’
ఉన్నది ఉన్నట్లు ఇంత బాగా చెబుతుంటే అతడు నోరు విప్పకపోవడం ఏమిటి?
అవును. విప్పడంలేదు. ‘నీ భార్యను ఎందుకు చంపావు?’ అనే ప్రశ్నకు అతడింకా నోరు విప్పలేదు. అయితే అతడు నోరు విప్పడం అన్నది పోలీసులకు అవసరమే కానీ.. మన స్టోరీకి కాదు. మనక్కావలసింది.. అలాంటి వ్యక్తిని భర్తగా అమ్మాయిలు ఎందుకు భరిస్తూనే ఉంటారని! అలాంటి వ్యక్తితో సర్దుకుని పొమ్మని అమ్మాయిల తల్లిదండ్రులు అమ్మాయిలకు ఎందుకు చెబుతూనే ఉంటారని! అలాంటి వ్యక్తి అంటే?
∙∙
కట్నంగా ఐదు లక్షల క్యాష్‌ ఇచ్చారు. కిలో బంగారం ఇచ్చారు. కారు కొనిపెట్టారు. వరుడి చెల్లి చదువుకు  డబ్బిచ్చారు. చదువుకే కాదు, చదువుకోడానికి టూ–వీలర్‌ కావాలంటే ఆ చెల్లికి వీలర్‌ని కూడా కానుకగా ఇచ్చారు. ఇక వరుడి తండ్రిగారు.. ఆయనకు బాడుగలకు తిప్పే లోడ్‌–వ్యాన్‌ కావాలంటే దాన్నీ కొనిపెట్టారు. ఇన్ని చేశాక పెళ్లి చేసుకున్నాడు. భార్యను తీసుకెళ్లాడు. అదూర్‌ అతడిది. పట్టణంతిట్ట జిల్లాలో ఉంటుంది. వధువుది ఆంచల్‌. కొల్లం జిల్లాలో ఉంటుంది. కేరళలోని జిల్లాలివి. 2018 మార్చి 26న పెళ్లయింది. 2020 మే 7న భార్యను చంపేశాడు. ఈ రెండేళ్ల కాలంలో భార్యతో అతడు ఏం మాట్లాడినా ఒకేమాట.. డబ్బు! ఇంకా తీసుకురా, ఇంకా తీసుకురా. ఆ ఇంకా.. నెలవారీ అయింది. ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీలో ఉద్యోగం అతడిది.

ఆమె గృహిణి. ఉద్యోగంలో నెల నెల జీతం రాకపోయినా, భార్య నుంచి నెలనెలా ‘జీతాన్ని’ ఏర్పాటు చేసుకున్నాడు అతడు! అతడు సూరజ్‌. ఆమె ఉత్తర. ఏడాది వయసున్న కొడుకు. ‘పాపం ఇక మావాళ్లు డబ్బు ఇవ్వలేరండీ’ అన్నందుకు ఆ ఇంట్లోకి పాము దూరింది. మొదట ఆ పాము అతడి మెదడులోకి ప్రవేశించి, తర్వాత ఆమె బెడ్‌రూమ్‌లోకి పాకింది. మార్చి 2 ఆ రోజు. పాము చేత ఆమెను కాటేయించాడు. రెండునెలలు ఆసుపత్రిలో ఉంది. ‘అదృష్టం బాగుండి బతికింది. అది మామూలు పాము అయి ఉండదు’ అన్నారు డాక్టర్లు. అదూర్‌లోని ఆసుపత్రి నుంచి నేరుగా ఆంచల్‌లోని పుట్టింటికి తీసుకెళ్లారు ఉత్తరను ఆమె తల్లిదండ్రులు. రెండో అటెంప్ట్‌ ఆమె పుట్టింట్లోనే మే 7న చేశాడు సూరజ్‌. ఈసారి కోబ్రాను ప్రయోగించాడు. ఆమె చనిపోయింది.
∙∙
అల్లుడు ఎలాంటివాడో తెలుస్తూ ఉన్నప్పుడు కూతుర్ని అతడితో ఎందుకు ఉండనిస్తారు తల్లిదండ్రులు? కూతురు చెప్తూనే ఉంటుంది.. మెంటల్‌గా టార్చర్‌ పెడుతున్నాడనీ, చంపేస్తానని బెదిరిస్తున్నాడనీ, తను ఇంటికొస్తుంటేనే భయం వేస్తుందనీ..! అంతులేని డబ్బు ఆశ ఉన్నవాడి దగ్గర కూతురు ప్రాణాలకు ఎప్పటికైనా ప్రమాదమే అని ఎందుకు అనుకోరు తల్లిండ్రులు? అలాంటి భర్త లేకపోయినా ఏం కాదు.. మేమొస్తున్నాం, మాతో వచ్చేయ్‌. అతడిని వదిలేద్దాం అని ఎందుకు ధైర్యం ఇవ్వరు? ఒడ్డున ఉండి ప్రశ్నించినంత సులభం కాకపోవచ్చు వీటికి సమాధానాలు. ఎన్నో భయాలు ఉంటాయి.

భర్తకు దూరంగా ఉందని తెలిస్తే పిల్ల పలచనై పోతుందన్న భయం ఉంటుంది. రేపు ఎప్పుడైనా.. బిడ్డకు తండ్రి లేడా అనే మాట వస్తుందన్న భయం ఉంటుంది. ఎన్ని భయాలున్నా.. పిల్ల ప్రాణం పోతుందేమోనన్న భయం కన్నా పెద్దవా?! దేశంలో రోజుకు 21 మంది భర్తలు డబ్బు కోసం తమ భార్యల్ని చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారని నేషనల్‌ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో లెక్కలు చెబుతున్నాయి! అమ్మాయి తల్లిదండ్రులు, అన్నదమ్ములు అమ్మాయికి కొంచెం సపోర్ట్‌గా ఉంటే ఇంట్లోకి పాము దూరక ముందే, ఆమె తన చేతిలోకి కర్రను తీసుకుంటుంది. ఆ కర్ర.. విడాకులే కానక్కర్లేదు. ‘నాకు నువ్వు అక్కర్లేదు’ అని చెప్పి బయటికి వచ్చే ధైర్యం కూడా కావచ్చు.
 

పెళ్లినాటి ఫొటో : సూరజ్, ఉత్తర


ఉత్తర ఫొటోతో ఆమె తల్లిదండ్రులు మణిమేఖల, విజయసేనన్‌

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top