సీబీఐని చుట్టుముట్టిన ఆ రహస్యాలు ఏమిటి?

Madabhushi Sridhar Article On CBI Director Alok Verma - Sakshi

విశ్లేషణ

సీబీఐ డైరెక్టర్‌ పదవినుంచి ఆలోక్‌ వర్మను బదిలీ చేయడం అంటే తొలగించడమనే అర్థం. అర్ధరాత్రి హఠాత్తుగా ఆలోక్‌ వర్మను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని, సీబీఐ చట్టం కింద కాకుండా నియామకాలు, తొలగింపుల కోసం ఏర్పాటయిన అత్యున్నత అధికార కమిటీకి మాత్రమే ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తే, ఇంకా న్యాయం మినుకుమినుకు మని మెరుస్తున్నదని సంతోషించాం. అంతలోనే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నతాధికార కమిటీ హఠాత్తుగా సమావేశమైంది. ముందే ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనిపించే వాతావరణం. ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ హాజరైనప్పటికీ,  తొలిరోజు ఏ నిర్ణయానికి రాలేదు. మరునాడు మళ్లీ కమిటీ సమావేశమైంది. ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ప్రధాన న్యాయమూర్తి ప్రతినిధిగా జస్టిస్‌ ఎ.కె. సిక్రీ హాజరయ్యారు. సమావేశం వేగంగా నిర్ణయం తీసుకున్నది. సీబీఐ డైరెక్టర్‌ పదవిలో ఉన్న ఆలోక్‌ వర్మను ఏ ప్రాధాన్యతాలేని ఫైర్‌ శాఖకు బదిలీ చేశారు.

కేవలం ఆ అధికారం ఉంది కనుక కమిటీ ఆయన్ను తొలగించేయవచ్చా?  అందుకు ఆధారం ఏదీ ఉండనవసరం లేదా అని న్యాయపరమైన ప్రశ్న. కమిటీలోని ముగ్గురిలో ప్రతిపక్ష నాయకు డుగా ఉన్న ఖర్గే ఒక్కరే తొలగింపు చర్యను వ్యతిరేకించారు. జనవరి 10న అత్యున్నతాధికార కమిటీ సమావేశంలో జరిగిన చర్చలను, నిర్ణయాన్ని వివ   రించే మినిట్స్‌ పత్రం ప్రతి కావాలని అడిగారు.  సీవీసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ డైరెక్ట ర్‌ను తొలగించారని అంటున్నారు. మొదటిసారి వర్మను తొలగించినప్పుడు సుప్రీంకోర్టులో ఆయన సవాలు చేశారు. తొలగింపునకు కారణాలని భావిస్తున్న అంశాలను సీవీసీ పరిశోధించాలనీ, ఆ పరిశోధనను మాజీ న్యాయమూర్తి ఎ.కె. పట్నాయక్‌ పర్య వేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్‌ పట్నాయక్‌ వర్మను తొలగించేంత తీవ్రమైన అవినీతి, అక్రమాల ఆరోపణలకు ఏవిధమైన సాక్ష్యాలు లేవని, కనుక వర్మ తొలగింపు చాలా తొందరపాటు చర్య అని విమర్శించారు.

సీవీసీ నివేదికను, పట్నాయక్‌ నివేదికను చదివిన తరువాత, ఆలోక్‌ వర్మ వివరణను విని సొంత బుర్ర ఉపయోగించి నిర్ణ యం తీసుకోవలసిన బాధ్యత కమిటీపైన ఉందని మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రికి రాసిన లేఖలో వ్యాఖ్యా నించారు. మరొక డైరెక్టర్‌ తాత్కాలిక నియామక ప్రతిపాదనను కమిటీ ముందుకు ఎందుకు తీసుకురాలేదని కూడా ఆయన నిలదీశారు. జస్టిస్‌ పట్నాయక్‌ గారు ఆ సీవీసీ నివేదికతో తనకు ఏ ప్రమేయమూ లేదని, అది కేవలం íసీవీసీకి మాత్రమే చెందిన నివేదిక అనీ, సీవీసీ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తి స్వయంగా వివరిస్తూ ఉంటే ఆ నివేదికను కమిటీ సభ్యులకు ఇవ్వకుండా, పట్నా యక్‌ నివేదికను కమిటీలో పరిశీలించకుండా, ఇంత తీవ్ర నిర్ణయాలు ఎలా తీసుకుంటారు?  ప్రభుత్వం తనకు అధికారం లేకున్నా ఆలోక్‌ వర్మను తొలగించేసింది. ఆయన సవాలు చేస్తే సుప్రీంకోర్టు ఆయనకు కోల్పోయిన పదవి ఇచ్చింది. కానీ ఆలోక్‌ వర్మను రెండురోజుల్లో మళ్లీ తొలగించేశారు. తొలగించే నిర్ణయం తీసుకున్న కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదటి రోజు ఉన్నారు. మరునాడు ఆయన ప్రతినిధిగా మరో జడ్జిగారు రావడమే కాకుండా ప్రధానితో పాటు ఏకీభవించి ఆలోక్‌ వర్మ తొలగింపు నిర్ణయాన్ని సమర్థించారు.

ఇవి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు విశ్వసనీయతకు సంబంధించిన కీలక అంశాలు. ఈ పరిణామాల్లో ఎక్కడా పారదర్శకత మచ్చుకైనా లేకపోవడం ప్రమాదకరం. జస్టిస్‌ పట్నాయక్‌ నివేదికను, సీవీసీ నివేదికను ఎవరు చూశారు? అందులో ఏముంది? వాటి ప్రతులు మల్లిఖార్జున ఖర్గేకు ఎందుకు ఇవ్వలేదు. ప్రధాన మంత్రి, న్యాయమూర్తి అయినా ఆ నివేదికలు చదివారా? అర్థం చేసుకున్నారా? అందులో కొంపముంచే ఆరోపణలు ఏమున్నాయని, ఎందుకు డైరెక్టర్‌ను తొలగించవలసి వచ్చిందో చెప్పవలసిన బాధ్యత ఆ పెద్దల మీద లేదా? ఇవి చాలా తీవ్రమైన ప్రశ్నలు.  నిజానికి ఈ దేశంలో ప్రతిపౌరుడికి తెలియాల్సిన వివరాలు ఇవి. సీబీఐ వంటి అత్యున్నతస్థాయి సంస్థలో అర్ధరాత్రి దర్యాప్తు బృందంలోని పోలీసు అధికారులను ఉన్నట్టుండి, ఏ కారణమూ చెప్పకుండా, దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెల్లాచెదురుగా విసిరేస్తూ బదిలీలు జరపడం, అందుకోసం నంబర్‌ వన్, నంబర్‌ టు స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులను పదవిలోంచి తప్పించడం ఆశ్చ ర్యకరమైన పరిణామాలు. ఆ బృందం దర్యాప్తు చేస్తున్న ఆరోపణలు ఏమిటి? ఏ కీలకమైన నాయకులను రక్షించడానికి ఈ తతంగమంతా?

మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్‌

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top